ETV Bharat / bharat

EVMలో ఓట్ల లెక్కింపునకు 'టోటలైజర్‌'- కేంద్రం అభిప్రాయం కోరిన సుప్రీంకోర్టు

ఈవీఎంల ఓట్ల లెక్కింపులో టోటలైజర్‌ విధానంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు- ఒక్కోసారి 14 పోలింగ్‌ కేంద్రాల ఓట్లను కలిపి లెక్కించే అవకాశం- ఓటర్ల గోప్యత కోసం టోటలైజర్‌ను ప్రవేశపెట్టాలని పిటిషనర్ల వాదన

Supreme Court on EVM
సుప్రీంకోర్టు ఫైల్​ ఫొటో (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : September 1, 2026 at 3:35 PM IST

3 Min Read
Choose ETV Bharat

Supreme Court on EVM : ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో నమోదైన ఓట్లను పోలింగ్‌ కేంద్రాల వారీగా కాకుండా, ఒకేసారి పలు కేంద్రాల ఓట్లను కలిపి లెక్కించే 'టోటలైజర్‌' విధానంపై సుప్రీంకోర్టు కీలకంగా స్పందించింది. ఈ విధానాన్ని ప్రవేశపెట్టడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అమలు చేస్తే ప్రతికూల ప్రభావాలు ఉంటాయా? అనే అంశాలపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్​మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి. మోహనతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. టోటలైజర్‌ విధానం కోసం ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో అవసరమైన సవరణలు చేయడంపై కేంద్రం పరిశీలన చేయాలని సూచించింది.

ప్రస్తుతం ఈవీఎంల్లో నమోదైన ఓట్లను సాధారణంగా పోలింగ్ కేంద్రం వారీగా లెక్కిస్తారు. అయితే టోటలైజర్ పరికరాన్ని ఉపయోగిస్తే ఒకేసారి సుమారు 14 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను కలిపి లెక్కించవచ్చు. దీంతో ఏ ప్రాంతంలో ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయనే విషయం పోలింగ్‌ కేంద్రం స్థాయిలో స్పష్టంగా తెలియకుండా ఉంటుందని పిటిషనర్లు వాదిస్తున్నారు. ముఖ్యంగా ఓటర్ల గోప్యతను కాపాడటంతో పాటు, ఎన్నికల అనంతరం ఓటింగ్‌ సరళి ఆధారంగా చోటుచేసుకునే ఒత్తిళ్లు, వివక్ష, హింసను తగ్గించవచ్చని పేర్కొన్నారు. టోటలైజర్ అమలు కోరుతూ పిటిషన్​ దాఖలు చేసిన న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్, ఓటర్ల గోప్యత పరిరక్షణే తమ ప్రధాన ఉద్దేశమని కోర్టుకు తెలిపారు. ఇతర దేశాల్లోనూ ఓటర్ల గోప్యతను కాపాడేందుకు, ఎన్నికల అనంతర హింసను నివారించేందుకు ఇలాంటి విధానాలను ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. 2007 నుంచి ఇటీవలి వరకు ఎన్నికల సంఘం కూడా టోటలైజర్‌కు అనుకూలంగా ఉన్నట్లు అశ్విని వాదించారు. అయితే ప్రస్తుత విచారణలో ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది మాత్రం టోటలైజర్‌ను ప్రవేశపెట్టడంలో పలు సమస్యలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. దీనిపై మెజారిటీ రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రాలేదని పేర్కొన్నారు.

నిబంధనలపై కేంద్రం పరిశీలన
ఈ వ్యవహారంలో కండక్ట్ ఆఫ్​ ఎలక్షన్ రూల్స్, 1961లోని నిబంధనలను పరిశీలించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. అలాగే టోటలైజర్​కు సంబంధించి భారత న్యాయ కమిషన్ గతంలో చేసిన సిఫారుసులను కూడా పరిగణనలోకి తీసకోవాలని పేర్కొంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం ఈవీఎంల్లో నమోదైన ఓట్లను పోలింగ్ కేంద్రం వారీగా లెక్కించాల్సి ఉంటుంది. దీని వల్ల ఆయా ప్రాంతాల్లో ఓటింగ్ సరళి బయటలడే అవకాశం ఉందని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్​, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలకు ఉమ్మడి ఓటర్ల జాబితా రూపొందించడం ద్వారా ప్రభుత్వ నిధులు, సిబ్బంది వినియోగాన్ని తగ్గించాలని కోరుతూ దాఖలైన పిటిషన్​లో టోటలైజర్​ అంశాన్ని కూడా ప్రస్తావించారు. న్యాయవాదులు అశ్విని ఉపాధ్యాయ్‌, యోగేశ్‌ గుప్తా తదితరులు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

యూపీ, గోవాలో ఈవీఎంల తొలి దశ తనిఖీలు
మరోవైపు దేశంలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఉత్తర్​ప్రదేశ్​, గోవాల్లో ఇప్పటికే ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలకు ఫస్ట్‌ లెవల్‌ చెక్స్‌ (ఎఫ్​ఎల్​సీ) ప్రారంభమయ్యాయి. ఎన్నికలకు ముందు చేపట్టే కీలక సాంకేతిక తనిఖీల్లో భాగంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్), ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్)కు చెందిన ఇంజినీర్లు ఈ యంత్రాలను పరీక్షిస్తున్నారు. యంత్రాల్లో యాంత్రిక లోపాలు, సాంకేతిక సమస్యలు ఉన్నాయా? అనే అంశాలను పరిశీలిస్తారు. లోపాలున్న ఈవీఎంలను తయారీ సంస్థలకు తిరిగి పంపించి మరమ్మతులు చేయించడం లేదా అవసరమైతే కొత్త యంత్రాలతో భర్తీ చేయడం జరుగుతుంది. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించి యంత్రాల పనితీరును కూడా పరిశీలిస్తారు.

నీట్ నిరసనకారులకు ఊరట- FIRలు రద్దు చేసిన సుప్రీంకోర్టు

స్కూల్ రికార్డుల ఆధారంగా వయసును నిర్ధారించలేం : పోక్సో కేసులో హైకోర్టు సంచలన తీర్పు