'కుట్రదారులకు శిక్ష పడాలి- ఆ కాపీలను వెంటనే జప్తు చేయాలి'- NCERT వివాదంలో కేంద్రంపై సీజేఐ ఫైర్
ఎన్సీఈఆర్టీ వివాదంపై విచారణను చేపట్టిన సుప్రీంకోర్టు- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న సీజేఐ- ఈ విషయంలో మీడియా బాధ్యతాయుతమైన పాత్ర పోషించిందన్న ధర్మాసనం

Published : February 26, 2026 at 11:27 AM IST
SC On NCERT Book Row : జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) ముద్రించిన ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఒక అధ్యాయాన్ని ప్రచురించడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఈ వ్యవహారంపై, సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు చేసిన కుట్రేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి బాధ్యులెవరో తెలుసుకోవడం తమ విధి అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
బాధ్యులకు శిక్ష పడాలని స్పష్టం
ఎనిమిదో తరగతి పాఠ్యాంశ వ్యవహారంపై జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ప్రయోగించిన బుల్లెట్‌తో న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోందన్న ఆయన న్యాయవ్యవస్థ అధికారాన్ని అణచివేసేలా, గౌరవాన్ని కించపర్చేలా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో లోతుగా పాతుకుపోయిన కుట్ర ఉందన్న సీజేఐ బాధ్యులకు శిక్ష పడాలని స్పష్టం చేశారు. అదేవిధంగా ఎన్సీఈఆర్టీ బుధవారం ఇచ్చిన వివరణలో ఎక్కడా క్షమాపణ అన్న పదమే లేదని, పైగా వారు తమ చర్యను సమర్థించుకుంటున్నారని సీజేఐ మండిపడ్డారు.
ఆ కాపీలను వెంటనే జప్తు చేయాలి!
ఎన్సీఈఆర్టీ ముద్రించిన పుస్తకంలోని వివాదాస్పద అధ్యాయం ఉన్న భౌతిక, డిజిటల్ కాపీలను వెంటనే జప్తు చేయాలని సీజేఐ ఆదేశించారు. సదరు అధ్యాయం ఉన్న పుస్తకాన్ని ప్రింట్ చేయడం లేదా డిజిటల్ రూపంలో పంపిణీ చేయడంపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని పేర్కొన్నారు. ఈ తప్పుకు బాధ్యులను చేస్తూ ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్, పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి, విద్యా మంత్రిత్వ శాఖకు సుప్రీంకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
మీడియా బాధ్యతాయుతమైన పాత్ర పోషించింది!
మరోవైపు, కేంద్ర విద్యాశాఖ తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పాఠ్యాంశం వ్యవహారంలో సుప్రీం కోర్టుకు భేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకోవడం లేదని కోర్టుకు వెల్లడించారు. బాధ్యతాయుతమైన వ్యక్తులు అలాంటి పనిలో ఇకపై ఉండరని కోర్టుకు తెలిపారు. అది చాలా చిన్న పరిణామమని చెప్పిన సీజేఐ ప్రచురించిన పుస్తకం ఇప్పటికే మార్కెట్‌లో ఉందని, ఒక కాపీ తనకు కూడా వచ్చిందని తెలిపారు. ఈ అంశాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని పేర్కొన్నారు. ఈ అంశంలో మీడియా బాధ్యతాయుతమైన పాత్ర పోషించిందని సీజేఐ ధర్మాసనం అభినందించింది. ప్రజాస్వామ్య నాలుగో స్తంభంగా మీడియా నిలిచిందని కొనియాడింది. పాఠ్యాంశంపై మరింత లోతైన దర్యాప్తు జరగాలని భావిస్తున్నట్లు చెప్పిన ధర్మాసనం తదుపరి విచారణను మార్చి 11కు వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా, ఈ విషయంపై బీజేపీ ఎంపీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా మీడియాతో మాట్లాడారు. "సుప్రీం కోర్టు ఈ సంఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంది. సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ కేసులో సొలిసిటర్ జనరల్ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. ఆయన దాని గురించి చాలా సానుకూలంగా ఉన్నారు. దీనికి ఎవరు బాధ్యులో తాము కనుగొంటామని, ప్రమేయం ఉన్న వారిని పట్టుకుని తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏ పుస్తకాలు విడుదలైనా, వాటిని ఉపసంహరించుకోవాలి. దీనిపై బార్ చాలా ఆందోళన చెందుతోంది. ఇలాంటి చర్యను బార్ అంగీకరించదు. దాదాపు అందరు బార్ నాయకులు కోర్టులో ఉన్నారు. అలాంటి ఉత్తర్వును జారీ చేయడంలో సుప్రీంకోర్టుకు సహాయం చేస్తున్నారు. ఎన్సీఈఆర్టీ చర్య చాలా అభ్యంతరకరమైనదని, ఆ అంశంపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని బార్ అభిప్రాయపడింది." మనన్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు.

