దిల్లీ అల్లర్ల కేసు- ఉమర్ ఖాలిద్‌కు బెయిల్ నిరాకరణ
దిల్లీ అల్లర్ల కేసు- నిందితుల బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

Published : January 5, 2026 at 11:27 AM IST
|Updated : January 5, 2026 at 1:01 PM IST
Delhi Riots Case : 2020 నాటి దిల్లీ అల్లర్ల కుట్ర కేసులో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలిద్, మరో విద్యార్థి నేత షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వీరిద్దరికీ బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం సోమవారం నిరాకరించింది. అల్లర్ల వెనుక ఉన్న భారీ కుట్రలో వీరిద్దరి పాత్ర 'అత్యంత కీలకం' అని, మిగిలిన నిందితులతో పోలిస్తే వీరిపై ఉన్న ఆరోపణల తీవ్రత వేరని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఐదుగురు నిందితులకు మాత్రం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసి భారీ ఊరటనిచ్చింది.
కీలక తీర్పు
జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. డిసెంబర్ 10న వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. తాజాగా సోమవారం తీర్పు వెల్లడించింది. ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌ల పాత్ర మిగిలిన వారి కంటే భిన్నమైనది అని కోర్టు వ్యాఖ్యానించింది. వారిద్దరూ ఐదేళ్లుగా జైల్లో ఉన్నప్పటికీ, చట్టపరమైన ఆంక్షలను, రాజ్యాంగ నిబంధనలను అతిక్రమించి బెయిల్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. యుఏపీఏ వంటి కఠిన చట్టాల కింద కేసులు ఉన్నప్పుడు, కేవలం జైల్లో ఎక్కువ కాలం ఉన్నారనే కారణంతో బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. విచారణలో జాప్యం జరగడాన్ని 'ట్రంప్ కార్డ్'గా వాడుకుని చట్టం నుంచి తప్పించుకోలేరని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.
బెయిల్ పొందిన వారు వీరే
ఇదే కేసులో జైల్లో ఉన్న మరో ఐదుగురికి మాత్రం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వారు గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహ్మాన్, మహ్మద్ సలీం ఖాన్, షాదాబ్ అహ్మద్.
పోలీసుల వాదన ఇదే
దిల్లీ పోలీసులు బెయిల్ పిటిషన్లను తీవ్రంగా వ్యతిరేకించారు. కోర్టు ముందు బలమైన వాదనలు వినిపించారు. "ఇవి సాధారణ నిరసనలు కాదు. ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి జరిగిన ఉద్దేశపూర్వక ప్రయత్నం. ఇది దేశవ్యాప్తంగా పన్నిన పక్కా కుట్ర. ప్రభుత్వాన్ని మార్చడం, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే వీరి లక్ష్యం. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చిన సమయంలోనే ఈ అల్లర్లు జరగాలని ప్లాన్ చేశారు. అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించి, సీఏఏ అంశాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని చూశారు. 'శాంతియుత నిరసన' ముసుగులో ప్రజలను రెచ్చగొట్టారు. వీరి కుట్ర వల్లే దిల్లీలో 53 మంది మరణించారు. ప్రజా ఆస్తులు ధ్వంసమయ్యాయి. 753 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి" అని పోలీసులు వాదించారు.
నిందితుల వాదన
ఉమర్ ఖాలిద్, షర్జీల్ తరఫు న్యాయవాదులు ప్రధానంగా జాప్యంపైనే వాదించారు. "గత ఐదేళ్లుగా నిందితులు జైల్లోనే మగ్గుతున్నారు. విచారణ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. వారు ప్రత్యక్షంగా హింసను ప్రేరేపించినట్లు ఎలాంటి ఆధారాలు లేవు" అని కోర్టుకు విన్నవించారు. కానీ కోర్టు ఈ వాదనలతో ఏకీభవించలేదు. బెయిల్ నిరాకరించినప్పటికీ, సుప్రీంకోర్టు ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు ఒక వెసులుబాటు కల్పించింది. సాక్షుల విచారణ పూర్తయిన తర్వాత, లేదా ఈ తీర్పు వచ్చిన తేదీ నుంచి ఏడాది తర్వాత, వారు మళ్లీ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.
నేపథ్యం ఇదీ
పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా 2020లో దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఈ క్రమంలో 2020 ఫిబ్రవరిలో ఈశాన్య దిల్లీలో మత ఘర్షణలు చెలరేగాయి. ఈ అల్లర్లలో 53 మంది మరణించగా, 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ కుట్రలో ప్రమేయం ఉందనే ఆరోపణలతో ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లను 2020 జనవరిలో యుఏపీఏ చట్టం కింద అరెస్ట్ చేశారు. 2025 సెప్టెంబర్ 2న దిల్లీ హైకోర్టు కూడా వీరి బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. వారి ప్రసంగాలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని హైకోర్టు అప్పట్లో వ్యాఖ్యానించింది.
ప్రజాస్వామ్య వాదుల ఆవేదన
సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ కేంద్ర న్యాయ శాఖ మంత్రి అశ్వనీ కుమార్ స్పందించారు. "సుప్రీంకోర్టు రికార్డుల ఆధారంగానే తీర్పు ఇస్తుంది. అయితే ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్ చాలా కాలంగా జైల్లో ఉన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోతే దానికి పరిహారం ఉండదు. ఈ తీర్పు పట్ల స్వేచ్ఛా వాదులు అసంతృప్తిగా ఉండే అవకాశం ఉంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

