ప్రభుత్వ వర్సిటీ సత్తా - సొంతంగా ‘హెర్బల్ టీ’ ఫార్ములాలు - క్యాంపస్‌లోనే స్టార్టప్ టీ -మార్కెట్‌లోకి ఎంట్రీ
సొంత ఫార్ములాలతో 6 రకాల ‘హెర్బల్ టీ’ ఉత్పత్తులు - జీవన శైలి వ్యాధుల ముప్పును తగ్గించేలా తయార్ - అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో ఉత్పత్తి - అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి

Published : January 1, 2026 at 4:45 PM IST
Sambalpur University Herbal Teas: మన దేశ విశ్వవిద్యాలయాల్లో ఏవైనా పరిశోధనలు జరిగితే, వాటిపై అంతర్జాతీయ జర్నల్స్‌లో అధ్యయన నివేదికలు ప్రచురితం అవుతుంటాయి. ఇది సర్వసాధారణ విషయం. కానీ ఒక ప్రభుత్వ యూనివర్సిటీ ఇందుకు భిన్నంగా ప్రత్యేక చొరవ చూపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో తమ పరిశోధనా నివేదికల్లోని అంశాలకు ఆచరణాత్మక రూపాన్ని ఇచ్చింది. యూనివర్సిటీయే స్వయంగా ఒక స్టార్టప్‌ను ఏర్పాటు చేసి మరీ వివిధ రకాల హెర్బల్ టీల ఉత్పత్తిని మొదలుపెట్టింది. భారతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేసిన ఈ ఉత్పత్తులను 7 నెలల క్రితమే మార్కెట్‌లోకి విడుదల చేసింది. దేశంలోని ఇతర వర్సిటీలకు ఆదర్శంగా నిలిచేలా ఓ ప్రభుత్వ విశ్వవిద్యాలయం సాగిస్తున్న విప్లవాత్మక, స్ఫూర్తిదాయక ప్రస్థానం గురించి తెలుసుకుందాం.
'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ట్యాగ్‌కు న్యాయం
ఒడిశా రాష్ట్రంలోని బుర్లా పట్టణంలో సంబల్‌పుర్ యూనివర్సిటీ ఉంది. 2019లో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఈ విశ్వవిద్యాలయానికి ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ నేచురల్ ప్రోడక్ట్స్ అండ్ థెరప్యూటిక్స్’ను మంజూరు చేసింది. ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ట్యాగ్‌కు న్యాయం చేసేలా సొంతంగా చొరవ చూపి ఏదైనా చేసి చూపించమని నాటి రాష్ట్ర ప్రభుత్వం సంబల్‌పుర్ యూనివర్సిటీకి సూచించింది. ప్రస్తుతం మనుషులకు షుగర్(డయాబెటిస్), ఒబెసిటీ, గుండె జబ్బుల లాంటి జీవనశైలి వ్యాధుల బెడద ఎక్కువగా ఉంది. ఈ వ్యాధుల ముప్పును తగ్గించే ఔషధ విలువలు కలిగిన ఆహార ఉత్పత్తులను తయారుచేస్తే, మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుందని సంబల్‌పుర్ వర్సిటీ గుర్తించింది. వర్సిటీలోని బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మేటిక్స్ విభాగం విద్యార్థులు, ప్రొఫెసర్లు కలిసి ముమ్మర పరిశోధనలు చేశారు. నెలల తరబడి పరిశోధనలు, ప్రయోగాలు చేసి 6 రకాల ఔషధ మూలికా గ్రీన్ టీల ఫార్ములాలను తయారు చేశారు. గుండె, కిడ్నీలు, ప్రోస్టేట్, మధుమేహం, నిద్రలేమి, కీళ్ల వాతం వంటి ఆరోగ్య సమస్యల ముప్పును తగ్గించేలా ఈ టీలను శాస్త్రీయంగా అభివృద్ధి చేశారు. ఈవిధంగా ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ట్యాగ్‌కు సంబల్‌పుర్ వర్సిటీ న్యాయం చేసింది.
7 నెలల క్రితమే మార్కెట్‌లోకి హెర్బల్ టీలు
హెర్బల్ టీల ఫార్ములాలను రెడీ చేశాక, ఈ ఏడాది ఆరంభంలో సంబల్‌పుర్ యూనివర్సిటీకి చెందిన ఒక నిపుణుల టీమ్ దేశ రాజధాని దిల్లీకి వెళ్లింది. కేంద్ర ఆయుష్ శాఖ పరిధిలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (సీసీఆర్‌హెచ్) విభాగం డైరెక్టర్ జనరల్‌తో వర్సిటీ నిపుణుల టీమ్ భేటీ అయింది. తాము తయారుచేసిన హెర్బల్ టీల ఫార్ములాల గురించి వివరించారు. వాటి అధ్యయన నివేదికలను సమర్పించారు. వర్సిటీ ఆధ్వర్యంలో హెర్బల్ టీల ఉత్పత్తికి అనుమతులను కోరారు. ఇందుకు సీసీఆర్‌హెచ్ పచ్చజెండా ఊపింది. దీంతో సంబల్‌పుర్ యూనివర్సిటీ క్యాంపస్‌లోనే ఒక స్టార్టప్‌ను నెలకొల్పారు. దానిపేరు 'ఆర్కిడ్ హెర్బల్ ప్రైవేట్ లిమిటెడ్'. దీని ఆధ్వర్యంలోనే 6 రకాల హెర్బల్ టీలను ఉత్పత్తి చేయించారు. ఔషధ మూలికలతో కూడిన గ్రీన్ టీ, లెమన్ టీ, యాలకుల ఇన్‌స్టంట్ కాఫీ, యాలకుల ఇన్‌స్టంట్ టీలను వివిధ పేర్లతో ఉత్పత్తి చేసి 7 నెలల క్రితమే మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఔషధ మూలికలతో కూడిన గ్రీన్ టీకి గ్రీన్ లిఫ్ట్ అనే పేరును పెట్టారు.
అన్ని సర్టిఫికేషన్లు - నాణ్యతా ప్రమాణాలు
ఈ అన్ని హెర్బల్ టీలలో తమ సొంత పరిశోధనల ఫార్ములాలనే వినియోగించామని సంబల్‌పుర్ వర్సిటీ అధికార వర్గాలు తెలిపాయి. వీటి నాణ్యతను ధ్రువీకరించే ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్, ఉత్పత్తి ప్రక్రియలోని నాణ్యతను ధ్రువీకరించే జీఎంపీ సర్టిఫికేషన్ పొందామని వెల్లడించాయి. తమ హెర్బల్ టీలను తాగితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, పరిశోధనల్లోనూ ఈవిషయం తేలిందని పేర్కొన్నాయి. ఈ అన్ని హెర్బల్ టీల బాక్స్‌లపై ఏపీఐ సూచిక ఉంది. వీటి తయారీలో వినియోగించిన పదార్థాల సమాచారం అందులో స్పష్టంగా ఉంటుంది. భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం నాణ్యతా ప్రమాణాలతో హెర్బల్ టీలను ఉత్పత్తి చేయిస్తున్నారు. వీటిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తున్నారు. అవసరం ఉన్నవాళ్లు ఆన్‌లైన్‌లో ఆర్డర్స్ పెట్టొచ్చు. ప్రతి టీ బాక్స్‌పైన ఒక బార్‌కోడ్ ఉంటుంది. దాన్ని మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేస్తే, టీ తయారీ, ఉత్పత్తితో ముడిపడిన పూర్తి శాస్త్రీయ సమాచారం కనిపిస్తుంది.
ప్రజల వద్దకు పరిశోధనా ఫలాలు
ఇటీవలే ఒడిశాలోని బర్హంపుర్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో సంబల్‌పుర్ యూనివర్సిటీ తమ హెర్బల్ టీ ఉత్పత్తులను ప్రదర్శించింది. ఈసందర్భంగా వర్సిటీకి చెందిన 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ నేచురల్ ప్రోడక్ట్స్ అండ్ థెరప్యూటిక్స్' విభాగం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ నాయక్‌ను పలకరించింది. అన్ని రకాల శాస్త్రీయ పరిశోధనలు చేశాక, ఈ హెర్బల్ టీలను అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు. వీటిని తాగితే జీవనశైలి వ్యాధుల ముప్పు తగ్గుతుందని చెప్పారు.ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని అనుకునే వారు ఇలాంటి టీలను వినియోగించాలని సూచించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం హెర్బల్ టీలను మార్కెట్లోకి తెచ్చామని ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. ఒక పరిశోధనను అధ్యయన నివేదికకు పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయికి, ప్రజల మధ్యకు తీసుకొచ్చినందుకు గర్వంగా ఉందన్నారు.
ఈ టీలతో జీవనశైలి వ్యాధులకు చెక్
"మేం సంబల్‌పుర్ వర్సిటీలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగంతో కలిసి పనిచేశాం. కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులు, ప్రొస్టేట్ సమస్యలు, నిద్రలేమి, ఆర్థరైటిస్, డయాబెటిస్ వంటి జీవనశైలి వ్యాధుల ముప్పును తగ్గించే హెర్బల్ టీలను మార్కెట్‌లోకి తెచ్చాం. లిప్టన్, టెట్లీ లాంటి ఉత్పత్తులను కూడా తయారు చేశాం. మా ప్రోడక్ట్స్ జాబితాలో ఇన్‌స్టంట్ టీ, నిమ్మకాయ టీ, యాలకుల ఇన్‌స్టంట్ కాఫీ, టీ కూడా ఉన్నాయి. మా సొంత ఫార్ములాలతోనే వీటిని తయారు చేశాం" అని సంబల్‌పుర్ వర్సిటీలోని ఆర్కిడ్ హెర్బల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ దివ్య రంజన్ సాహు తెలిపారు.
సహజ పదార్థాలు, మూలికలతో టీలు
"మనదేశంలో ఎంతోమంది మధుమేహం, నిద్రలేమి వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. అలాంటి వారి కోసమే మేం సహజ పదార్థాలు, మూలికలతో టీలు తయారు చేశాం. వీటితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి" అని ఈ పరిశోధనల్లో పాల్గొన్న విద్యార్థిని ఇస్రా నాయక్ తెలిపారు.
ఈ టీలను తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది
"మేం చాలా రకాల హెర్బల్ టీలను తయారు చేశాం. వాటన్నింటిని వివిధ శాస్త్రీయ పద్ధతుల్లో జంతువులపై పరీక్షించాం. అవన్నీ సేఫ్ అని తేలాకే మార్కెట్‌లోకి తెచ్చాం. ఈ టీలను తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీవనశైలి వ్యాధుల ముప్పు తగ్గుతుంది. సైడ్ ఎఫెక్ట్ ఉండవు" అని ఈ పరిశోధనల్లో పాల్గొన్న విద్యార్థిని రేష్మా ప్రధాన్ తెలిపారు.

