ETV Bharat / bharat

బంగారు తాపడాల వివాదం- శబరిమల ఆలయ ప్రధాన పూజారి అరెస్ట్‌

శబరిమల ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరు​ను అరెస్ట్- బంగారం అదృశ్యంలో మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ

Sabarimala Chief Priest Arrest
Sabarimala Chief Priest Arrest (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 9, 2026 at 3:40 PM IST

3 Min Read
Choose ETV Bharat

Sabarimala Chief Priest Arrest : శబరిమల బంగారం తాపడాల కేసులో భాగంగా ఆలయ ప్రధాన పూజారి (తంత్రి) కందరారు రాజీవరును సిట్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం 4.30 గంటల సమయంలో సిట్‌ అధికారుల బృందం ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారించి, అనంతరం అరెస్టు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్‌ పొట్టితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. తరువాత బంగారు తాపడాల చోరీ కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో తేలడంతో అరెస్టు చేసినట్లు సమాచారం. బంగారు తాపడాల దొంగతనం గురించి తంత్రికి ముందే తెలుసని వారు వెల్లడించారు.

మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టిని శబరిమలకి సహాయకుడిగా తీసుకువచ్చింది తంత్రియేనని సమాచారం. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత పొట్టి, ఉన్నత స్థాయి పరిచయాలను ఏర్పరచుకున్నారని, తద్వారా బంగారు పూతను రాగి పూతగా నమోదు చేసి బంగారాన్ని దొంగిలించారని తెలుస్తోంది. అయితే పొట్టి ఇలా చేయడానికి అవకాశం కల్పించింది మాత్రం తంత్రి అని ఇతర నిందితులు తమ వాగ్మూలంలో పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, బంగారం కుంభకోణం గురించి తంత్రికి తెలుసునని నిందితులు విచారణలో చెప్పినట్లుగా అధికారులు తెలిపారు. ఈ క్రమంలో బంగారు పూతను అక్రమంగా రవాణా చేయడానికి ఇద్దరూ కుట్ర పన్నారని సిట్ పేర్కొంది. వాస్తవానికి ఆలయంలో అన్ని విషయాలకు తంత్రి అనుమతి తప్పనిసరి. అయితే ఆలయం నుంచి వస్తువులను బయటకు తీసుకెళ్లడానికి మాత్రం తాను అనుమతి ఇవ్వలేదని పూజారి వాదించారు.

ఈడీ కేసు నమోదు!
ఇదిలా ఉండగా, శబరిమల బంగారు దోపిడీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ తదుపరి చర్యలు తీసుకోనుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ)లోని వివిధ సెక్షన్ల కింద ఈడీ (ఈసీఐఆర్)ను నమోదు చేసిందని తెలిపారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే సిట్​ 11 మందిని అరెస్టు చేసింది.

ఉన్ని కృష్ణన్‌ వెనుక భారీ శక్తులే ఉన్నాయ్!
అంతకుముందు, శబరిమలలో గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. వాటిని సరిచేయించి కొత్త బంగారు తాపడాలను అందిస్తానని ఉన్ని కృష్ణన్‌ వాటిని తీసుకెళ్లారు. ఆ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. అయితే 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.100 కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. ఎలక్ట్రోప్లేటింగ్‌ ప్రక్రియ పూర్తైన తర్వాత వాటిపై ఉండే బంగారంలో కొంత అదృశ్యమైందని సదరు కంపెనీ పేర్కొంది. ఉన్నట్లుండి తాపడాల బరువు దాదాపు 4.524 కేజీలు తగ్గడంతో ఈ విషయంలో అవకతవకలు జరిగినట్లు అధికారుల వర్గాలు గుర్తించాయి.

దీనిపై విచారణ చేపట్టగా ఉన్ని కృష్ణన్‌ పొట్టి సహా పలువురు ప్రధాన అధికారులు ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు తేలింది. దీంతో ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్​) దర్యాప్తు వేగవంతం చేసింది. శబరిమల అయ్యప్ప దేవాలయంలోని విగ్రహాల బంగారు తాపడం బరువులో వ్యత్యాసం కేసులో ఏదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేయాలని కేరళ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్‌ వెనుక భారీ శక్తులే ఉన్నాయని అనుమానం వ్యక్తం చేసింది. ఈ కేసులో వేగవంతమైన, కచ్చితమైన దర్యాప్తు జరగాలని సిట్​ను జస్టిస్‌ రాజా విజయరాఘవన్‌, జస్టిస్‌ కేవీ జయకుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.

'బీజేపీ అంటే భ్రష్ట జనతా పార్టీ'- డబుల్​ ఇంజిన్​ ప్రభుత్వాలపై రాహుల్ ఫైర్

బంగాల్​లో 'I-PAC' రైడ్స్​ రగడ- మమతపై సీబీఐ దర్యాప్తు కోరిన ఈడీ- పత్రాలు దుర్వినియోగంపై హైకోర్టుకు టీఎంఎసీ