ETV Bharat / bharat

'బ్రహ్మోస్ క్షిపణిని తమ సైన్యంలో చేర్చుకునేందుకు రష్యా ఆసక్తి'

బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిపై ఏరోస్పేస్‌ చీఫ్ జయతీర్థ్ జోషి కీలక వ్యాఖ్యలు-బ్రహ్మోస్ క్షిపణిని రష్యా తమ సైన్యంలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తోందని వెల్లడి

BrahMos supersonic cruise missile system
BrahMos supersonic cruise missile system (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : June 18, 2026 at 6:14 PM IST

3 Min Read
Choose ETV Bharat

Russia Keen To Induct Brahmos Missile : బ్రహ్మోస్ సూపర్‌ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని తమ సైన్యంలో చేర్చుకోవడానికి రష్యా ఆసక్తిగా ఉందని బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ చీఫ్ జయతీర్థ్ జోషి వ్యాఖ్యానించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. గురువారం నాగ్‌పుర్‌లో సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ తయారు చేసిన 100వ స్వదేశీ బూస్టర్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలో బ్రహ్మోస్ క్షిపణి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

బ్రహ్మోస్ ప్రోగ్రామ్‌తో ఇప్పటికే స్థిరమైన పారిశ్రామిక భాగస్వాములు ఉన్నప్పటికీ, మాస్కో ఈ క్షిపణిపై ఆసక్తి వ్యక్తం చేసిందని జయతీర్థ్ జోషి వెల్లడించారు. రష్యా తన సాయుధ దళాల్లోకి బ్రహ్మోస్‌ను చేర్చుకుంటుందా? అనే ప్రశ్న అడగ్గా, అదే విషయంపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. "రష్యా ప్రభుత్వం బ్రహ్మోస్ సూపర్‌ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని తమ సైన్యంలో చేర్చుకోవడానికి ఆసక్తిగా ఉందని తెలిసింది. కానీ రష్యాకు ఇప్పటికే స్థిరపడిన పారిశ్రామిక భాగస్వాములు ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా బ్రహ్మోస్ క్షిపణిని తమ సైన్యంలో భాగంగా చేసుకోవాలనుకుంటోంది. ఈ విషయంపై మేము రష్యాతో చర్చలు జరుపుతున్నాం" అని జయతీర్థ్ జోషి స్పష్టం చేశారు.

'25ఏళ్ల కృషి వల్ల బ్రహ్మోస్ క్షిపణికి ఇంతటి పేరు వచ్చింది'
భవిష్యత్తులో రష్యాకు అవసరమైన క్షిపణులను భారత్ సరఫరా చేస్తుందా? అని ప్రశ్న అడగ్గా, దానికి జయతీర్థ్ జోషి ఆసక్తికర సమాధానమిచ్చారు. రష్యాలో ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో భారత పరిశ్రమ కీలక పాత్ర పోషించగలదని అభిప్రాయపడ్డారు. 25 సంవత్సరాల అభివృద్ధి, పరీక్షలు, కార్యాచరణ ద్వారా అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్షిపణి ఖ్యాతి గడించిందని తెలిపారు. ఇది కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి సహాయపడిందని అన్నారు. బ్రహ్మోస్ క్షిపణి ఆపరేషన్ సిందూర్‌లో చూపించిన కార్యాచరణను జోషి ప్రస్తావించారు.

వియత్నాంకి బ్రహ్మోస్ క్షిపణులు ఎగుమతికి సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్న తరుణంలో జయతీర్థ్ జోషి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం ఖరారు కావడానికి ఇంకా కొన్ని అనుమతులు మాత్రమే రావాల్సి ఉందన్నారు. అదే సమయంలో తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు చెందిన అనేక ఇతర దేశాలతో కూడా చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. "బ్రహ్మోస్ క్షిపణితో సాధారణంగా భూమిపై లేదా నౌక, ఇతర వేదికల నుంచి ఒక అనుకరణ (సిమ్యులేటెడ్) పరీక్షను నిర్వహిస్తుంటాం. కానీ ఆపరేషన్ సిందూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణితో ఒక ప్రత్యక్ష పరీక్ష నిర్వహించాం. ఇది దేశానికి, ప్రపంచానికి తెలిసిన ఒక విజయగాథ. ఈ విజయం దేశ ప్రజలకు చాలా కీలకం. సాధారణంగా తయారైన క్షిపణిని వాస్తవ పరిస్థితుల్లో పరీక్షించడం జరగదు. కానీ శత్రువుపైనే క్షిపణిని పరీక్షించే అవకాశం లభించడం ఇదే మొదటిసారి" అని జయతీర్థ్ జోషి పేర్కొన్నారు.

ఆత్మనిర్భరతకు నిలువెత్తు సాక్ష్యం
సరిహద్దుల సంరక్షణకు, శత్రు దాడులను నిరోధించడానికి స్వీయ సాంకేతికతతో భారత్ అభివృద్ధి చేసుకున్న అత్యంత శక్తిమంతమైన ఆయుధం, ఆత్మనిర్భరతకు నిలువెత్తు సాక్ష్యంగా బ్రహ్మోస్‌ క్షిపణి నిలుస్తోంది. అధిక వేగం, దూరం, కచ్చితత్వం దీని ప్రత్యేకతలుగా చెప్పొచ్చు. భూతల, గగనతల, సముద్రతలాల నుంచే కాకుండా సముద్ర గర్భం నుంచి కూడా దూసుకొచ్చి శత్రు దేశాల లక్ష్యాలను ధ్వంసం చేయడం బ్రహ్మోస్ క్షిపణి ప్రత్యేకత. ఈ క్షిపణిని భారత రక్షణ రంగ సంస్థ డీఆర్‌డీఓ, రష్యా ఎన్‌పీఓ మషినోస్ట్రోయెనియా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

కాగా, ఇండియా 'ఆత్మనిర్భర్ భారత్' చొరవ కింద స్వదేశీ రక్షణ రంగ తయారీని బలోపేతం చేస్తూనే, ప్రపంచ ఆయుధ మార్కెట్‌లో తన ఉనికిని విస్తరించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రహ్మోస్ క్షిపణి భారతదేశ అత్యంత ముఖ్యమైన రక్షణ ఎగుమతుల్లో ఒకటిగా నిలుస్తోంది. అందుకే ఇటీవల కాలంలో ఈ క్షిపణి ఎగుమతులు పెరిగాయి. అలాగే దీనికి డిమాండ్ కూడా పెరిగింది.

గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి- కొత్తగా 3కోట్ల మందికి రేషన్ కార్డులు

నీట్-యూజీ రీ ఎగ్జామ్‌పై ఊహాగానాలు నమ్మొద్దు- ప్రశాంతంగా పరీక్ష రాయండి: ఎన్‌టీఏ