'చాలా బాధగా ఉంది- దోషులను కఠినంగా శిక్షించాలి'- రామ మందిరం విరాళాల చోరీపై తొలిసారి స్పందించిన RSS
అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం ఘటనపై స్పందించిన ఆర్ఎస్ఎస్- దోషులకు కఠిన శిక్ష విధించాలని, ట్రస్టులో పారదర్శకత పెంచాలని డిమాండ్- జులై 6న ట్రస్ట్ కీలక సమావేశం

Published : July 3, 2026 at 5:48 PM IST
RSS On Ram Mandir Donation Theft : అయోధ్య రామ మందిరం విరాళాల హుండీల్లో చోరీ ఘటనపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తొలిసారిగా స్పందించింది. ఈ ఘటనను అత్యంత బాధాకరమైనదిగా పేర్కొన్న ఆర్ఎస్ఎస్- దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. అలాగే ఆలయ నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు సూచించింది. దిల్లీలో శుక్రవారం రోజు ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ్ (ప్రధాన కార్యదర్శి) దత్తాత్రేయ హోసబలే విడుదల చేసిన ప్రకటనలో- 'అయోధ్యలో నిర్మించిన శ్రీరామ జన్మభూమి రామ మందిరం తరతరాలుగా కోట్లాది మంది హిందువులు చేసిన త్యాగాలు, పోరాటాలు, భక్తి ఫలితంగా రూపుదిద్దుకున్న విశ్వాసానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.
'రామభక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి'
శ్రీరామ్ లల్లా ఆలయంలోని విరాళాల హుండీల్లో జరిగిన చోరీ ఘటన సమాజం మొత్తాన్ని, ముఖ్యంగా రామ భక్తుల్ని తీవ్రంగా కలచివేసిందని హోసబలే తెలిపారు. 'ఈ ఘటన హిందూ సమాజం, రామ భక్తుల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. మాకు తీవ్ర బాధ, ఆగ్రహాన్ని కలిగించింది' అని ఆయన పేర్కొన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విజ్ఞప్తి మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ను ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించిన విషయాన్ని హోసబలే గుర్తు చేశారు. సిట్ విచారణ పూర్తయిన తర్వాత ఎవరు దోషులుగా తేలినా వారిపై ఎలాంటి కనికరం లేకుండా చట్టప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ట్రస్టుకు కీలక సూచనలు
దీనిని సాధారణ ఘటనగా చూడకుండా అత్యంత అసాధారణ ఘటనగా పరిగణించాలని ట్రస్టుకు సూచించింది ఆర్ఎస్ఎస్. ఆలయ నిర్వహణ, భద్రత, ఆర్థిక కార్యకలాపాల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే వాటిని సరిదిద్దాలని కోరింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని కాపాడే బాధ్యత ట్రస్టుపై ఉందని పేర్కొంటూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. ఆర్థిక నిర్వహణ, విరాళాల లెక్కల నిర్వహణ, పరిపాలనలో పూర్తి స్థాయి పారదర్శకత, జవాబుదారీతనం, పవిత్రత, ధార్మిక విలువలు ఉండేలా ట్రస్ట్ చర్యలు తీసుకుంటుందని హోసబలే విశ్వాసం వ్యక్తం చేశారు. విచారణ కొనసాగుతున్న తరుణంలో హిందూ సమాజం ఓర్పు, సంయమనం పాటించాలని ఆర్ఎస్ఎస్ విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనను ఆసరాగా చేసుకొని హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని అపఖ్యాతిపాలు చేయాలని ప్రయత్నించే హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక శక్తుల కుట్రల్ని తమ విచక్షణతో తిప్పికొట్టాలని ప్రకటనలో పిలుపునిచ్చింది.
జులై 6న ట్రస్టు కీలక సమావేశం
ఇక జులై 6వ తేదీన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి. విరాళాల అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత చంపత్ రాయ్, అనిల్ మిశ్రా ఇప్పటికే తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. అయితే ట్రస్ట్ నిబంధనల (ట్రస్ట్ బైలాస్) ప్రకారం వారిపై ఏమైనా క్రమశిక్షణా చర్యలు తీసుకునే వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించడం తప్పనిసరి. అందుకే జులై 6న సమావేశంలో ఇద్దరి నుంచి రాతపూర్వక, మౌఖిక వివరణలు స్వీకరించిన తర్వాతే వారి రాజీనామాలు ఆమోదించాలా, తిరస్కరించాలా లేదా తదుపరి చర్యలు తీసుకోవాలా అనే అంశంపై ట్రస్టీలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
సిట్ విచారణ వేగవంతం
విరాళాల చోరీకి సంబంధించి యూపీ సర్కార్ ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణ మరింత వేగవంతం చేసింది. అసలు ఎంత సొమ్ము చోరీ అయిందో తెలుసుకునేందుకు- గత ఐదేళ్ల కాలంలో ట్రస్ట్ నిర్వహించినటువంటి ఆర్థిక లావాదేవీలు అన్నింటిపై మరింత లోతుగా రీ ఆడిట్ చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, ఆలయ నిర్వహణతో సంబంధం ఉన్న గోపాల్ రావుల్ని సిట్ అధికారులు విచారించగా, అవసరమైతే మరికొందరిని కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉందని సమాచారం.
అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు- ట్రస్ట్ ఖాతాల నిర్వహణపై సిట్ 'రీ-ఆడిట్'
సోదరుడి కోసం రూ.700తో 'స్మార్ట్ గాగుల్స్'- ఐటీఐ విద్యార్థి వినూత్న ఆవిష్కరణ

