ఎన్నికల కోసం లగ్జరీ ప్రచార వాహనాలు- రోల్స్ రాయిస్ తరహా ఫీచర్లు- ధర రూ.కోట్లకు పైనే!
కోయంబత్తూరులో అత్యాధునిక ఎన్నికల ప్రచార వాహనాలు తయారీ- అందులో కంప్యూటర్లు, ఎల్ఈడీ స్క్రీన్లు- రోల్స్ రాయిస్ తరహా ఫీచర్లు!

Published : February 25, 2026 at 3:28 PM IST
Rolls Royce Style Campaign Vans : తమిళనాడులో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. రాజకీయ పార్టీలు తమ ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి లగ్జరీ లుక్స్‌తో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ప్రచార వాహనాలను సిద్ధం చేయిస్తున్నాయి. అందులో కంప్యూటర్లు, స్మార్ట్ ఎల్ఈడీలు, రోల్స్ రాయిస్ కారులోని పుష్ క్యాబిన్ తరహా ఇంటీరియర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? అయితే ఈ పూర్తి కథనం చదవండి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు ఓ వైపు పొత్తులు, సీట్ల సర్దుబాటు చర్చలు చూస్తూనే, మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి కార్యకలాపాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో గోడలపై ఆయా పార్టీలు చిహ్నాలు దర్శనమిస్తున్నాయి. ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో, రాజకీయ పార్టీలు ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మరంగా ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నాయి.
లగ్జరీ ప్రచార వాహనాల కోసం ఆర్డర్స్
అందుకే పలు రాజకీయ పార్టీలు కోయంబత్తూరులోని శివానంద కాలనీలో ఉన్న ఓ ప్రైవేటు సంస్థకు భారీగా ఆర్డర్లు ఇస్తున్నాయి. తమ నాయకుల కోసం ప్రత్యేకంగా అత్యంత విలాసవంతమైన ప్రచార రథాలను తయారు చేయమని అడుగుతున్నాయి.
తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన నాయకుల కోసం ఎన్నికల ప్రచార వాహనాలు డిజైన్ చేసిన అనుభవం ఈ ప్రైవేట్ సంస్థకు ఉంది. క్రమంగా ఇది రాజకీయ నాయకుల కోసం క్యాంపెయిన్ వెహికల్స్ తయారుచేసే అగ్రగామి సంస్థగా ఎదిగింది. అందుకే ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమ కోసం అత్యాధునిక సౌకర్యాలున్న వ్యాన్ల కోసం ఆ సంస్థను ఆశ్రయిస్తున్నాయి.
"గతంలో రాజకీయ నాయకులు తమ ఎన్నికల ప్రచారం కోసం ఎక్కువగా 'టెంపో ట్రావెలర్ల'ను ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు మార్కెట్లోకి 'ఫోర్స్ అర్బానియా' వ్యాన్లు వచ్చేశాయి. ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అందుకే వారి అవసరాలకు అనుగుణంగా వీటిని అప్‌గ్రేడ్ చేస్తున్నాం. మేము రీమోలింగ్ చేసిన వాహనాలను పరిశీలిస్తే, అందులో అత్యాధునిక సాంకేతికతతో, లగ్జరీ ఫిట్టింగ్‌లతో అద్భుతంగా ఉంటుంది."
- రియాస్, ఎన్నికల ప్రచార వాహనాలను రీమోడలింగ్ చేసే ప్రైవేటు సంస్థ యజమాని
డిజైన్ చేశారిలా!
"రాజకీయ నాయకులు ఎన్నికల కోసం దీర్ఘకాలంపాటు ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే వారికి సౌకర్యవంతంగా ఉండేందుకు, ఫోర్స్ అర్బానియాను రీడిజైన్ చేశాం. అందులో నేతలు కూర్చునేందుకు 'స్వివెల్ మెకానిజం'తో కూడిన సీట్లు అమర్చాం. దీని వల్ల వారు సౌకర్యవంతంగా కూర్చొని ప్రసంగించవచ్చు. అంతేకాదు వాహనంలోనే సులభంగా అటూఇటూ కదలవచ్చు. ఇక బహిరంగ సభల కోసం ఈ వ్యాన్లలో హైడ్రాలిక్/ మాన్యువల్ లిఫ్ట్ సిస్టమ్‌తో కూడిన స్టేజ్ ఏర్పాటు చేశాం. లిఫ్ట్ ఇష్టం లేనివారు కదిలే మెట్లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ వల్ల నేతలు ఎత్తైన వేదికపై నుంచి నేరుగా ప్రజలతో మాట్లాడే అవకాశం ఏర్పడుతుంది.
ఇక నేతల సుదీర్ఘ ప్రచారయాత్రలను దృష్టిలో ఉంచుకుని, వాహనంలో విశ్రాంతి తీసుకోవడానికి బెర్త్‌లు ఏర్పాటు చేశాం. పార్టీ కార్యకర్తలతో, ముఖ్యులతో సమావేశం నిర్వహించడానికి సోఫా సెట్లు కూడా పొందుపరిచాం. అంతేకాదు ఈ ప్రచార వాహనాల్లో ప్రత్యేకమైన లైటింగ్ సిస్టమ్ పెట్టాం. దీని వల్ల నాయకులు వాహనం లోపల ఉన్నప్పటికీ, బయట ఉన్న కార్యకర్తలు వారిని స్పష్టంగా చూడవచ్చు. అలాగే నాయకులు ఇచ్చే ప్రసంగాలు ప్రజలందరికీ స్పష్టంగా వినిపించేలా దీనిలో అత్యాధునిక ఆడియో సిస్టమ్‌లను ఏర్పాటు చేశాం. నేతల వెంట వచ్చే భద్రతా సిబ్బంది కోసం వాహన బయట హ్యాండ్రైల్స్, మెట్లు పెట్టాం. దీని వల్ల సుమారు 15 మంది సిబ్బంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు" అని రియాస్ పేర్కొన్నారు.
అడ్వాన్స్డ్ ఫీచర్స్
గత ఎన్నికల్లో వాడిన ప్రచార వాహనాల కంటే, ఈసారి తయారు చేస్తున్న వాహనాల్లో అత్యాధునిక ఫీచర్లను పొందుపరిచినట్లు రియాస్ పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రచార రథాల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు, 24 గంటల ఇంటర్నెట్ సౌకర్యం, రెండు స్మార్ట్ ఎల్ఈడీ టీవీలు, బయటివైపు ఒక పెద్ద ఎల్ఈడీ డిస్ప్లే స్క్రీన్, ప్రచార కార్యక్రమాలను రికార్డ్ చేయడానికి కెమెరాలు అమర్చినట్లు తెలిపారు.
"ఇక లగ్జరీల విషయానికి వస్తే, టచ్ సెన్సార్స్‌తో పనిచేసే రెక్లైనర్ సీట్లు, రోల్స్ రాయిస్ కార్ల తరహాలో ప్రీమియం యాంబియెంట్ సీలింగ్ లైటింగ్, అధునాతన గ్రీన్ రెస్ట్రూమ్ సౌకర్యాలు ఉంటాయి. అయితే ఈ హై-ఎండ్ ప్రచార వాహనాల తయారీకి అయ్యే ఖర్చు, వాటిలో పొందుపరిచే ఫీచర్లు, స్పెసిఫికేషన్లను బట్టి సుమారు రూ.7 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉంటుంది. వివిధ రాజకీయ పార్టీలు నుంచి, ముఖ్యంగా చెన్నై నుంచి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. జనవరి నెలలోనే మేము 7 వాహనాలను డెలివరీ చేశాం. మరికొన్ని తయారీ దశలో ఉన్నాయి." అని రియాస్ చెప్పారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ తరహా వాహనాలకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.
'న్యాయ వ్యవస్థలో అవినీతి'పై NCERT బుక్‌లో ఛాప్టర్- సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు
'గ్రీన్ గోల్డ్'తో స్వయం ఉపాధి- రూ.120తో రూ.50వేల ఆదాయం- ఈ పనిని నేర్చుకుంటే జీవితం మారిపోతుంది!

