'నాన్నా కాపాడు- వీళ్లు నన్ను చంపేస్తారు'- డెలివరీ రూమ్ నుంచి ఏడుస్తూ బయటకు గర్భిణి- కాసేపటికే తల్లీబిడ్డలు మృతి
ఆస్పత్రిలో విషాదం- డెలివరీకి ముందు తండ్రిని కాపాడమని వేడుకున్నట్లు తెలిపిన కుటుంబ సభ్యులు- రూ.30 వేలు డిమాండ్ చేశారని ఆరోపణ- ప్రసవం అనంతరం నవజాత శిశువుతో పాటు తల్లి మృతి

Published : August 28, 2026 at 1:38 PM IST
Rewa Pregnant Woman Death : ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన ఓ గర్భిణి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన మధ్యప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. రేవాలోని ప్రభుత్వ గాంధీ మెమోరియల్ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం తల్లితో పాటు నవజాత శిశువు కూడా మృతిచెందారు. అయితే డెలివరీకి ముందు తన కుమార్తె డెలివరీ రూమ్ నుంచి ఏడుస్తూ బయటకు వచ్చి, 'నాన్నా వీళ్లు నన్ను చంపేస్తారు నన్ను కాపాడు' అంటూ వేడుకుందని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ ఆమెను డెలివరీ రూమ్‌కు తీసుకెళ్లారని, ఆపరేషన్ అనంతరం పాప పుట్టినా కొద్దిసేపటికే శిశువు, తల్లి ఇద్దరూ మృతి చెందారని ఆరోపించారు.
ఈ ఘటన ఆగస్టు 25న (మంగళవారం) రేవాలోని బైకుంఠ్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మంగళవారం హత్వా గ్రామానికి చెందిన కల్పనా మిశ్రాకు ప్రసవ నొప్పులు రావడంతో ఆమెను రేవాలోని ప్రభుత్వ గాంధీ మెమోరియల్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే డెలివరీ కోసం వైద్యులు, నర్సులు రూ.30 వేలు అడిగారు. డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పగా, గర్భిణిని ఆసుపత్రి నుంచి తీసుకెళ్లాలని సిబ్బంది చెప్పినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే ఏం జరిగిందో ఆ తర్వాత ప్రసవం కోసం కల్పనను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారని తెలిపారు. కొద్దిసేపటికే ఆమె ఏడుస్తూ బయటకు వచ్చిందని చెప్పారు. 'నాన్నా వీళ్లు నన్ను చంపేస్తారు. నన్ను కాపాడు' అంటూ ఆమె భయంతో కేకలు వేసిందని తండ్రి రామ్‌శిరోమణి మిశ్రా పేర్కొన్నారు.
'ఆపరేషన్ చేసిన వైద్యురాలు కనిపించలేదు'
'డెలివరీకి ముందు ఓ నర్సు, డబ్బులు లేవని చెబితే గర్భిణిని తీసుకెళ్లాలని, లేదంటే విషం ఇంజెక్షన్ ఇస్తామని చెప్పింది. తన కుమార్తెను డెలివరీ రూమ్ నుంచి బయటకు వచ్చిన సమయంలో చూసి ఆమె పరిస్థితి గురించి ఆందోళన చెందాం. ఆమె మాటలను బట్టి ఆసుపత్రి సిబ్బందిపై అనుమానం కలిగింది. తర్వాత కల్పనను మళ్లీ డెలివరీ రూమ్‌లోకి తీసుకెళ్లారు. ఆపరేషన్ అనంతరం శిశువు జన్మించినప్పటికీ, అప్పటికే శిశువు మృతిచెందింది. కొద్దిసేపటికే కల్పన కూడా ప్రాణాలు కోల్పోయింది. ఆపరేషన్ చేసిన అనంతరం సంబంధిత వైద్యురాలు, సిబ్బంది అక్కడ లేకుండా పోయారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చేందుకు ఆసుపత్రి యాజమాన్యం ప్రయత్నిస్తోంది. ఆగస్టు 25 సాయంత్రం 4 గంటల వరకు తన కుమార్తె పరిస్థితి బాగానే ఉందని, ఆ తర్వాత ఆరోగ్యం క్రమంగా క్షీణించింది' అని రామ్ శిరోమణి తెలిపారు.
కుటుంబం నిర్లక్ష్యం చేసిందన్న ఆస్పత్రి
అయితే కుటుంబసభ్యుల ఆరోపణలను ఆస్పత్రి యాజమాన్యం ఖండించింది. ఘటన దురదృష్టకరమని జీఎంహెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ మిశ్రా తెలిపారు. గర్భిణికి అవసరమైన వైద్య పరీక్షలు సక్రమంగా జరగలేదని ఆయన ఆరోపించారు. గర్భిణికి మొత్తం కనీసం ఎనిమిదిసార్లు వైద్య పరీక్షలు జరగాల్సి ఉండగా, అందుకు సంబంధించిన రికార్డుల్లో కేవలం రెండుసార్లు మాత్రమే పరీక్షలు చేసినట్లు ఉందని తెలిపారు. అవి కూడా ప్రైవేటు ఆస్పత్రిలో చేయించినవేనని పేర్కొన్నారు. గర్భధారణకు సంబంధించిన అనారోగ్యం కారణంగా మహిళకు మానసిక స్థితిలో మార్పులు వచ్చాయని డాక్టర్ రాహుల్ మిశ్రా తెలిపారు. ఆమె రక్తపోటు, గుండె వేగం పెరిగాయని, ప్రసవానికి ముందు స్పృహలో కూడా లేదని పేర్కొన్నారు. మస్తిష్క సంబంధిత సమస్య కారణంగా కల్పన ఆందోళనకు గురై అసాధారణంగా ప్రవర్తించిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ చెప్పారు. కొన్నిసార్లు అటూ ఇటూ తిరగడం, పరుగెత్తడం, భయపడటం వంటి లక్షణాలు కనిపించాయని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ఆమె అలా స్పందించి ఉండొచ్చని వివరించారు.
'తల్లీబిడ్డను కాపాడలేకపోయాం'
కల్పన ఆస్పత్రికి రాత్రి సమయంలో వచ్చిందని, సుమారు గంటలోనే ప్రాథమిక పరీక్షలు పూర్తి చేశామని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. ఆమె పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో పాటు కుటుంబసభ్యులకు కూడా పరిస్థితిని వివరించామని పేర్కొంది. వైద్య బృందం అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ ప్రసవం అనంతరం తల్లి, నవజాత శిశువును కాపాడలేకపోయామని సూపరింటెండెంట్ తెలిపారు.
పాముకాటుతో అన్నాచెల్లెలు మృతి - రక్షాబంధన్‌కు ముందురోజు కుటుంబంలో తీవ్ర విషాదం
తమ్ముడికి అక్క కిడ్నీ దానం- రాఖీ పండుగకు ముందే 'జీవిత కానుక'

