ETV Bharat / bharat

రిటైర్మెంట్ రోజు గొప్ప నిర్ణయం- శరీర, నేత్ర దానానికి ముందుకొచ్చిన టీచర్ ఫ్యామిలీ

ఉజ్జయిన్‌కు చెందిన 62 ఏళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయుడు శైలేంద్ర వ్యాస్ వినూత్న నిర్ణయం- రిటైర్మెంట్ రోజున కుటుంబంతో కలిసి శరీర దానం, నేత్రదానం ప్రతిజ్ఞ- కలాం ఆలోచనలే స్ఫూర్తి అని వ్యాఖ్యలు

Ujjain Teacher Family Body Donation
Ujjain Teacher Family Body Donation (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : July 5, 2026 at 7:37 AM IST

3 Min Read
Choose ETV Bharat

Ujjain Teacher Family Body Donation : విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు- జీవితాంతం విలువలు, క్రమశిక్షణ, సేవాభావాన్ని బోధించిన ఓ ఉపాధ్యాయుడు తన పదవీ విరమణ రోజును సమాజ సేవకు అంకితం చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శైలేంద్ర వ్యాస్ (స్వామి ముస్కురాకే) రిటైర్మెంట్ సందర్భంగా దేహ/శరీర దానం, నేత్ర దానం చేస్తానని ప్రకటించారు. అంతేకాదు, ఆయన నిర్ణయానికి మద్దతుగా భార్య, కుమారుడు, కుమార్తె కూడా 'బాడీ, ఐ' డొనేట్ చేసేందుకు ముందుకొచ్చి అధికారికంగా నమోదు చేసుకున్నారు.

62 ఏళ్ల శైలేంద్ర వ్యాస్ ఉజ్జయిన్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల్లో 39 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా సేవలందించారు. విద్యతో పాటు క్రమశిక్షణ, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, సానుకూల ఆలోచనలను వేలాది మంది విద్యార్థులకు బోధించారు. రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. 2026, జూన్ 30న పదవీ విరమణ చేసిన ఆయన, సాధారణ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించకుండా ప్రత్యేకంగా సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

దాదాపు ఏడాది కిందట తనకు దేహదానం చేయాలన్న ఆలోచన వచ్చిందని శైలేంద్ర వ్యాస్ తెలిపారు. 'జీవితమంతా నవ్వులు, జ్ఞానం, విలువలు పంచాం. మరణం తర్వాత కూడా మన శరీరం సమాజానికి ఉపయోగపడాలి. మన వల్ల ఇంకొకరి జీవితంలో వెలుగు రావాలి' అనే ఆలోచనను కుటుంబ సభ్యులతో పంచుకోగా వారు వెంటనే అంగీకరించారని చెప్పారు. ఆయన భార్య హేమలతా వ్యాస్, కుమారుడు స్వామి వ్యాస్, కుమార్తె సాహిబా కూడా శైలేంద్రతోనే కళ్లు, శరీరం దానం చేసేందుకు ముందుకొచ్చారు. రిటైర్మెంట్ రోజునే కుటుంబ సభ్యులంతా ఈ నిర్ణయాన్ని అందరిముందు ప్రకటించారు.

Ujjain Teacher Family Body Donation
కుటుంబ సమేతంగా దేహ దానం (ETV Bharat)

స్వామి ముస్కురాకేగా ప్రత్యేక గుర్తింపు
ఉజ్జయిన్ జిల్లా బద్‌నగర్‌కు చెందిన శైలేంద్ర వ్యాస్‌ను ప్రజలు 'స్వామి ముస్కురాకే' పేరుతో పిలుస్తుంటారు. హాస్యంతో కూడిన ప్రసంగాలు, సానుకూల సందేశాలు ఇస్తూ సమాజంలో ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక ముస్కురాకే అంటే చిరునవ్వుతో అనే అర్థం వస్తుంది. ముఖ్యంగా తనదైన హాస్య శైలితో అందరినీ నవ్విస్తుండటం కారణంగానే అలా ముస్కురాకే అని పిలుచుకుంటారు. ఇంకా విభిన్నమైన వస్త్రధారణ, తన వాహనానికి 420 నంబర్ ఉండటం, ఇంట్లోనే భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కళాఖండాల మ్యూజియం ఏర్పాటు చేసుకోవడం వంటి తన జీవనశైలి ద్వారా ఆయన అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు.

Ujjain Teacher Family Body Donation
నేత్ర దానానికి ముందుకొచ్చిన ఉపాధ్యాయుడు (ETV Bharat)

ఇక దేహదానం వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరిస్తూ శైలేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాంప్రదాయ దహన సంస్కారాలకు పెద్ద ఎత్తున కట్టెలు అవసరమవుతాయని, పర్యావరణంపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు. మరోవైపు దేహదానం వల్ల వైద్య విద్యార్థులకు మానవ శరీరంపై ప్రయోగాలు చేసే అవకాశం లభిస్తుందని, వైద్య పరిశోధనలకు ఉపయోగపడుతుందని వివరించారు. నేత్రదానం వల్ల అంధుల జీవితాల్లో వెలుగు నింపొచ్చని, తాము లేనప్పటికీ మరొకరి జీవితాల్లో చిరునవ్వు తీసుకురావడం కంటే గొప్ప సేవ మరొకటి లేదన్నారు.

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తి
2004లో రాష్ట్రపతి డాక్టర్ APJ అబ్దుల్ కలాంను కలిసిన సందర్భమే తన జీవితంలో కీలక మలుపు అని వ్యాస్ తెలిపారు. అప్పుడు కలాం చేతుల మీదుగా పురస్కారం అందుకున్న శైలేంద్ర వ్యాస్- కలాం వ్యక్తిత్వం, సేవాభావం తనపై తీవ్ర ప్రభావం చూపాయని, అదే దేహదానం నిర్ణయానికి బలమైన ప్రేరణగా నిలిచిందన్నారు. హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న కుమారుడు స్వామి వ్యాస్, ఇండోర్‌లో కాలేజ్ లెక్చరర్‌గా ఉన్న కుమార్తె సాహిబా కూడా తమ తల్లిదండ్రుల నిర్ణయాన్ని గర్వంగా స్వీకరించారు.

'తల్లిదండ్రులు చేసే పనుల్నే పిల్లలు అనుసరిస్తారు. కుటుంబం సమాజ హితం కోసం నిర్ణయాలు తీసుకుంటే ఆ విలువలు తర్వాతి తరాలకు కూడా చేరతాయి' అని శైలేంద్ర వ్యాస్ దంపతులు తెలిపారు. శైలేంద్ర వ్యాస్ భార్య హేమలతా వ్యాస్ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలే. 2027 జూన్‌లో ఈమె రిటైర్ కానున్నారు. ఆమె మాట్లాడుతూ- 'ప్రస్తుతం ఎంతోమంది కిడ్నీ, లివర్ సంబంధిత తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నారని, మన శరీరం ఎవరికైనా ఉపయోగపడితే అంతకంటే పుణ్యం మరొకటి లేదన్నారు.

కీమోథెరపీతో ప్లేట్‌లెట్స్ తగ్గుతున్నాయా? బొప్పాయి ఆకుల సారంతో క్యూర్​!

'భారత్, అమెరికా భాగస్వామ్యం కొత్త శిఖరాలకు చేరాలి'- యూఎస్ 250వ స్వాతంత్య్ర దినోత్సవం వేళ మోదీ కీలక వ్యాఖ్యలు