ఎర్రకోటకు పెరిగిన సందర్శకుల తాకిడి- బాంబు బెదిరింపులు తమను బయపెట్టలేవని వెల్లడి
ఎర్రకోటకు సందర్శకుల క్యూ- బాంబు పేలుడు తమను భయపెట్టలేకపోయిందని స్పష్టీకరణ- దేశ భద్రతా సంస్థలపై నమ్మకం ఉందని వెల్లడి- 'ఈటీవీ భారత్'తో మనసు విప్పి మాట్లాడిన టూరిస్టులు

Published : November 18, 2025 at 12:04 PM IST
Tourists Flow To Red Fort : బాంబు పేలుడు ఘటన తర్వాత కూడా దిల్లీలోని ఎర్రకోటకు సందర్శకుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు. నవంబరు 10న ఎర్రకోట సమీపంలో బాంబు పేలింది. దీంతో భద్రతా సంస్థలు ఎర్రకోటను ఐదు రోజుల పాటు మూసివేశాయి. ఆదివారం (నవంబరు 16) నుంచే రెడ్ ఫోర్ట్ సందర్శన తిరిగి ప్రారంభమైంది. ఆ రోజున పెద్దసంఖ్యలో టూరిస్టులు పోటెత్తారు. ప్రతి సోమవారం నిర్వహణ అవసరాల నిమిత్తం ఎర్రకోట సందర్శనకు అనుమతి ఉండదు. అయినప్పటికీ తాజాగా సోమవారం రోజున (నవంబరు 17) కూడా టూరిస్టులు ఎర్రకోటకు క్యూ కట్టారు. కోట పరిసరాల్లో నిలబడి సరదాగా సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా వారిని 'ఈటీవీ భారత్' పలకరించింది. దిల్లీ పేలుడు ఘటనను ఎర్రకోట సందర్శకులు ఖండించారు. దిల్లీలోని భద్రతా సంస్థలు, పోలీసులపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. భద్రతా వ్యవస్థలపై బలమైన నమ్మకం ఉండబట్టే, తాము నిర్భయంగా దిల్లీలోని పర్యాటక ప్రాంతాలన్నీ చుట్టేస్తున్నామని చెప్పుకొచ్చారు.
బాంబు పేలుళ్లకు భయపడం : సవిత
'నా పేరు సవిత. మేం దిల్లీలోనే ఉంటాం. ఎర్రకోటను చూడటానికి మా ఫ్యామిలీతో కలిసి వచ్చాం. సోమవారం రోజు ఎర్రకోట లోపలికి అనుమతించరని మాకు తెలుసు. అయినప్పటికీ ఎర్రకోట బయట నిలబడి ఫొటోలు దిగేందుకు మేమంతా వచ్చాం. ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు జరిగిందని విన్నాను. అలాంటి వాటికి మేం భయపడం. నగరంలోని భద్రతా సంస్థలపై మాకు నమ్మకం ఉంది. అందుకే నిర్భయంగా దిల్లీలోని పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నాం' అని సవిత తెలిపారు.

భయపడకుండా దిల్లీ టూర్‌కు వచ్చాను : శివపుత్ర
'నా పేరు శివపుత్ర. ఎర్రకోటను చూడటానికి బెంగళూరు నుంచి వచ్చాను. దిల్లీలో బాంబు పేలుడుకు కారణమైన వాళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకం మాకు ఉంది. ఉగ్రవాదం అనేది ఏ మతానికీ వ్యతిరేకం కాదు. అది మానవత్వానికి వ్యతిరేకం. ఉగ్రవాదంపై యావత్ ప్రపంచం పోరాడాలి. బాంబు పేలుడు జరిగిందని తెలిసినా, నేను భయపడకుండా దిల్లీ టూర్‌కు వచ్చాను. దిల్లీ అంతా నిర్భయంగా తిరుగుతున్నాను' అని శివపుత్ర చెప్పారు.

మాకేం భయం కలగలేదు : పార్థున్‌సేన్ చౌధరీ
'నా పేరు పార్థున్‌సేన్ చౌదరి. కోల్‌కతా నుంచి దిల్లీ టూర్‌కు వచ్చాను. దిల్లీ బాంబు పేలుడు ఘటనతో మాకేం భయం కలగలేదు. అందుకే ఎర్రకోట సందర్శనకు వచ్చాం. దిల్లీ సిటీ అందాలను, ఇక్కడి టూరిస్టు ప్రదేశాలను ఎంజాయ్ చేస్తాం. నగర పోలీసులు, భద్రతా సంస్థలపై మాకు నమ్మకం ఉంది. సిటీలో భారీ భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి' అని పార్థున్‌సేన్ తెలిపారు.
శాంతిభద్రతలను పోలీసులు కంట్రోల్‌లో ఉంచారు : శుభేందు భట్టాచార్య
'నా పేరు శుభేందు భట్టాచార్య. నా ఫ్రెండ్స్‌తో కలిసి ఎర్రకోటను చూడటానికి వచ్చాను. నవంబరు 10న దిల్లీలో బాంబు పేలుడు జరిగింది. అయినా మేం భయానికి గురికాలేదు. నగరంలోని శాంతిభద్రతలను పోలీసులు కంట్రోల్‌లో ఉంచారు. ఉగ్రవాదంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందనే పూర్తి నమ్మకం మాకు ఉంది' అని శుభేందు భట్టాచార్య పేర్కొన్నారు.
తగ్గేదేలే అంటున్న సందర్శకులు
మొత్తం మీద దిల్లీలోని భద్రతా ఏర్పాట్లపై సందర్శకులు పూర్తి విశ్వాసాన్ని వెలిబుచ్చుతున్నారు. నగరానికి టూరిస్టుల తాకిడి సైతం ఏమాత్రం తగ్గలేదు. దేశ, విదేశాల నుంచి పర్యాటకులు నగరానికి వస్తూనే ఉన్నారు. దిల్లీలోని ఎర్రకోట సహా అన్ని పర్యాటక ప్రదేశాల వద్ద సందర్శకుల తాకిడి స్పష్టంగా కనిపిస్తోంది. బాంబు పేలుళ్ల ద్వారా దిల్లీలో భయాందోళనలను రేకెత్తించాలని ఉగ్రవాదులు భావించారు. భారత రాజధానిలో పర్యటకాన్ని దెబ్బతీయాలని ఉగ్రమూకలు అనుకున్నారు. కానీ దేశ ప్రజల ఆత్మస్తైర్యం ఏమాత్రం చెక్కుచెదరలేదు. దేశభద్రతా సంస్థలపై వారి నమ్మకం కించిత్తు కూడా తగ్గలేదు. ప్రస్తుతం దిల్లీలో అత్యుత్తమ భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. సిటీలోని అన్ని ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలు, పోలీసులను పెద్దసంఖ్యలో మోహరించారు.
ఎర్రకోట ఉగ్రదాడి కేసులో ఉమర్ నబీ కీలక అనుచరుడు అరెస్టు
దిల్లీ పేలుడు కారకులు పాతాళ లోకంలో దాక్కున్నా తీసుకువచ్చి కఠినంగా శిక్షిస్తాం: అమిత్ షా

