ETV Bharat / bharat

ఆసియాలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్‌లో రామోజీ ఫిల్మ్‌సిటీ- టూరిజం, ఫిల్మ్ ప్రొడక్షన్, ఈవెంట్స్ హబ్‌గా ప్రదర్శన

భారీ ఈవెంట్ల నిర్వహణకు కేరాఫ్ అడ్రస్ రామోజీ ఫిల్మ్‌సిటీ- ఏప్రిల్ 23 నుంచి గ్రాండ్ హాలిడే కార్నివాల్‌- 46 రోజుల పాటు కొనసాగనున్న మహోత్సవం-రామోజీ ఫిల్మ్ సిటీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రుచి పంత్

Ramoji Film City At Satte 2026
Ramoji Film City At Satte 2026 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : February 25, 2026 at 9:25 PM IST

4 Min Read
Choose ETV Bharat

Ramoji Film City At Satte 2026 : 'దక్షిణాసియా ట్రావెల్ అండ్ టూరిజం ఎక్స్ఛేంజ్' (ఎస్‌ఏటీటీఈ- 2026) 33వ ఎగ్జిబిషన్ దిల్లీలోని యశోభూమిలో బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోగా రికార్డును సాధించిన రామోజీ ఫిల్మ్ సిటీ ఈ ఎగ్జిబిషన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఫిబ్రవరి 27 (శుక్రవారం) వరకు జరగనున్న ఈ ఎగ్జిబిషన్ వేదికగా రామోజీ ఫిల్మ్ సిటీలోని మౌలిక సదుపాయాలు, ఈవెంట్స్ నిర్వహణకు అవసరమైన ప్రపంచ స్థాయి సౌకర్యాలు, అద్భుతమైన స్టూడియో అనుభవాలను ప్రదర్శించనున్నారు.

రామోజీ ఫిల్మ్ సిటీ అంటే కేవలం స్టూడియో కాదని, అది వినోదం, టూరిజం, క్రియేటివిటీలతో అన్ని వయసుల వారిని అలరించే ప్రత్యేకత కలిగిన అద్భుతమైన ప్రపంచమని రామోజీ ఫిల్మ్ సిటీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రుచి పంత్ అన్నారు. ఎస్‌ఏటీటీఈ ఎగ్జిబిషన్ టూరిజం, ఈవెంట్స్ పరిశ్రమకు గణనీయమైన ఊతమిస్తుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఈ ఎగ్జిబిషన్‌లో రామోజీ ఫిల్మ్ సిటీని సమగ్ర టూరిజం, ఫిల్మ్ ప్రొడక్షన్, ఈవెంట్స్ హబ్‌గా ప్రదర్శిస్తున్నామని తెలిపారు. రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్దస్థాయిలో ఉన్న మౌలిక వసతులు, ప్రపంచ స్థాయి సౌకర్యాలు, అనుభవజ్ఞుల టీమ్ దాన్ని భారత్‌లోనే కాకుండా యావత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుపుతున్నాయని చెప్పారు.

ఏప్రిల్ 23 నుంచి గ్రాండ్ హాలిడే కార్నివాల్‌
రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానున్న గ్రాండ్ హాలిడే కార్నివాల్‌కు అందరూ విచ్చేయాలని రుచి పంత్ పిలుపునిచ్చారు. టూరిస్టులు, ఈవెంట్ ప్లానర్లు, సినిమా లవర్స్ ఈ ఈవెంట్‌కు రావాలని కోరారు. ఇప్పటివరకు రామోజీ ఫిల్మ్ సిటీలో 3,500కుపైగా సినిమాల చిత్రీకరణ జరిగిందని గుర్తు చేశారు. హిందీ, తెలుగు, తమిళ్ సహా ఎన్నో అంతర్జాతీయ మూవీ ప్రాజెక్టుల్లో రామోజీ ఫిల్మ్ సిటీ లొకేషన్లు, సెట్లకు చోటు లభించిందన్నారు. ఫిల్మ్ సిటీలో నిర్మించిన మూవీ సెట్లను చూస్తే సందర్శకులు మంత్రముగ్ధులు కావడం ఖాయమని రుచి పంత్ పేర్కొన్నారు. ఇప్పటివరకు రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మితమైన ప్రఖ్యాత సినిమాల సెట్లను దగ్గరి నుంచి చూసి, సినిమా మేకింగ్‌పై అవగాహనకు వచ్చే ఛాన్స్ సందర్శకులకు లభిస్తుందన్నారు.

కార్నివాల్‌‌లో ఇవన్నీ చూడొచ్చు!
రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ హాలిడే కార్నివాల్‌ ఏప్రిల్ 23 నుంచి 46 రోజుల పాటు జరుగుతుందని రుచి పంత్ వెల్లడించారు. ఈ వ్యవధిలో సందర్శకులు రాత్రి టైంలోనూ ఫిల్మ్ సిటీ అందాలను చూడొచ్చని తెలిపారు. రాత్రి 9 గంటల వరకు ఫిల్మ్ సిటీ తెరిచే ఉంటుందన్నారు. ఈ కార్నివాల్‌లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, లైవ్ ప్రదర్శనలు, ఫుడ్ ఫెస్టివల్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, కార్నివాల్ పరేడ్, మ్యూజికల్ గ్లో గార్డెన్, మాయాలోక్‌లను సందర్శకులు చూడొచ్చని ఆమె చెప్పారు. జూన్ 7 వరకు గ్రాండ్ హాలిడే కార్నివాల్‌ కొనసాగుతుందన్నారు. కొత్తగా రామోజీ ఫిల్మ్ సిటీలో అందుబాటులోకి వచ్చిన విశేషాల జాబితాలో మాయా లోక్, వర్చువల్ షూట్స్, మోషన్ క్యాప్చర్ ఉన్నాయని పేర్కొన్నారు.

అన్ని బడ్జెట్లలోనూ హోటళ్లు
"రామోజీ ఫిల్మ్ సిటీ కాంప్లెక్సులోనే సితార, తార, శాంతి నికేతన్, గ్రీన్స్ ఇన్, సహారా, వసుంధరా విల్లాస్ అనే హోటళ్లు ఉన్నాయి. సందర్శకులు వారివారి బడ్జెట్లు, అవసరాలకు అనుగుణమైన హోటల్‌‌లను ఎంచుకోవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ నుంచి అల్ట్రా లగ్జరీ హోటల్ దాకా అన్నీ ఫిల్మ్ సిటీలోనే ఉన్నాయి. ఆహ్లాదాన్ని అందించే పచ్చటి గార్డెన్లతో పాటు ఈవెంట్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, కార్పొరేట్ మీటింగ్స్ కోసం బహిరంగ మైదానాలు కూడా ఉన్నాయి. 25 మంది నుంచి మొదలుకొని 25వేల మంది దాకా ఎంతమంది అతిథులనైనా ఈవెంట్స్‌కు పిలవొచ్చు. భారీ ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించిన ఘనత రామోజీ ఫిల్మ్ సిటీకి ఉంది. కాన్సెప్ట్ డెవలప్‌మెంట్ నుంచి క్యూరేషన్, ఇన్‌స్టాలేషన్, ప్రొడక్షన్ దాకా అన్నీ ఒక ప్రొఫెషనల్ టీమ్ చూసుకుంటుంది. ఏఆర్ రహ్మాన్ సహా పలువురు అంతర్జాతీయ పాప్ స్టార్‌ల గ్రాండ్ కాన్సర్ట్‌లకు ఫిల్మ్ సిటీ ఆతిథ్యం ఇచ్చింది" అని రుచి పంత్ వివరించారు.

ప్రధాన ఆకర్షణ బాహుబలి మూవీ సెట్
"రామోజీ ఫిల్మ్ సిటీలో అత్యంత ప్రధాన ఆకర్షణ బాహుబలి మూవీ సెట్. ఈ సెట్‌ను చూడటానికి దేశ, విదేశాల నుంచి టూరిస్టులు వస్తుంటారు. ఈ సెట్‌లోనే బాహుబలి సినిమాకు సంబంధించిన పెద్దపెద్ద రాజభవనాలు, యుద్ధ క్షేత్రాలు, అబ్బురపరిచే నిర్మాణాలు ఉన్నాయి. ఫిల్మ్ సిటీలో థీమ్ బేస్డ్ లొకేషన్లు కూడా చాలానే ఉన్నాయి. పట్టణ మార్కెట్‌లు, ఎయిర్ పోర్ట్‌లు, రైల్వే స్టేషన్‌లు, ప్యాలస్‌లు, గ్రామీణ వీధులు, విశాలమైన గార్డెన్లను ఫిల్మ్ సిటీలో చూడొచ్చు. ఈ లొకేషన్లలో ఈజీగా సినిమా షూటింగ్, వెబ్ సిరీస్ షూటింగ్ చేసుకోవచ్చు" అని రుచి పంత్ తెలిపారు.

వింటేజ్ బస్సుల్లో ఫిల్మ్ సిటీ యాత్ర
"రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చే సందర్శకులు వింటేజ్ బస్సుల్లో సరదాగా మొత్తం స్టూడియోలో చక్కర్లు కొట్టొచ్చు. ఈక్రమంలో వివిధ సెట్లు, షూటింగ్ స్పాట్లు, మూవీ ప్రొడక్షన్ కేంద్రాల దగ్గర బస్సును ఆపుతారు. సినిమాల మేకింగ్‌ను క్లోజ్‌గా చూసే ఛాన్స్‌ సందర్శకులకు లభిస్తుంది. ఖాళీ స్థలాలను ఫిల్మ్ లొకేషన్‌‌లుగా ఎలా మార్చారు అనేది సందర్శకులకు గైడెడ్ టూర్లు వివరిస్తారు. తద్వారా సినిమాను షూట్ చేసే కెమెరా వెనుక ఎంతమంది శ్రమిస్తారు అనేది సందర్శకులకు తెలిసొస్తుంది" అని రామోజీ ఫిల్మ్ సిటీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్​ రుచి పంత్ చెప్పారు.