ETV Bharat / bharat

రామోజీ యానిమేషన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026- తొలి పురస్కారాలు వీరికే- విజేతలకు నగదు బహుమతి, ఫిలింసిటీ టూర్ టికెట్స్

తొలిసారిగా రామోజీ యానిమేషన్ ఎక్సలెన్స్ అవార్డుల నిర్వహణ- యంగ్ యానిమేటర్ ఆఫ్ ది ఇయర్ 2026 గా వి. ఉన్నికృష్ణన్‌కు పురస్కారం- ఎంటాంగ్లెడ్ స్టూడియోకు బెస్ట్ స్టూడియో ఆఫ్ ది ఇయర్ 2026 అవార్డ్

Ramoji Animation Excellence Awards 2026
ETPL డైరెక్టర్ సుజయ్ చెరుకూరి చేతులమీదుగా అవార్డు అందుకుంటున్న విజేతలు (Source : ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : August 29, 2026 at 9:00 PM IST

3 Min Read
Choose ETV Bharat

Ramoji Animation Excellence Awards 2026 : భారతీయ యానిమేషన్ రంగంలో ప్రతిభావంతులైన యువ క్రియేటర్లను మరింత ప్రోత్సహించేందుకు, స్వతంత్ర స్టూడియోల సృష్టికర్తల కృషికి గుర్తింపు ఇవ్వడమే లక్ష్యంతో 'రామోజీ యానిమేషన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ (RAEA)' ను అధికారికంగా ప్రారంభించారు. ఆ అవార్డుల తొలి ఎడిషన్‌లో యువ యానిమేటర్ ఉన్నికృష్ణన్ వి తరఫున వైశాఖ్ వి.ఎం 'యంగ్ యానిమేటర్ ఆఫ్ ది ఇయర్ 2026' అవార్డును అందుకున్నారు. ఎంటాంగ్లెడ్ స్టూడియో బెస్ట్ ఇండీ స్డూడియో ఆఫ్ ది ఇయర్ 2026గా ఎంపికైంది. ముంబయిలోని నెస్కో ఎగ్జిబిషన్ సెంటర్‌లో శుక్రవారం అవార్డుల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.

ఈటీవీ డైరెక్టర్ సుజయ్ చెరుకూరి ఆ పురస్కారాలను విజేతలకు అందించారు. భారతదేశంలోని యానిమేషన్ రంగానికి చెందిన క్రియేటర్లు, స్టూడియోల ప్రతినిధులు, విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసాధారణమైన సృజనాత్మకత, కొత్త కొత్త ఆలోచనలు, కళాత్మకతను గుర్తించి గౌరవించడంతో పాటు కొత్త తరం ప్రతిభను ప్రోత్సహించేందుకు ఆ అవార్డులను ఏర్పాటు చేసినట్లు అవార్డుల నిర్వహణ కమిటీ తెలిపింది. మీడియా దిగ్గజం, దివంగత రామోజీ రావు దూరదృష్టి, సృజనాత్మక వారసత్వానికి ప్రతీకగా అవార్డులను ప్రారంభించినట్లు కమిటీ పేర్కొంది. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న యానిమేషన్ రంగంలో స్వతంత్ర క్రియేటర్లు, యువ ప్రతిభకు గుర్తింపు కల్పించడం అవార్డుల ప్రధాన ఉద్దేశంగా వివరించింది.

Ramoji Animation Excellence Awards 2026
అవార్డ్స్ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఈటీవీ డైరెక్టర్ సుజయ్ (Source : ETV Bharat)

విజేతలకు రూ. 1 లక్ష నగదు బహుమతి
రామోజీ యానిమేషన్ ఎక్సలెన్స్ అవార్డు పొందిన ప్రతి విజేతకు రూ.1 లక్ష నగదు బహుమతి అందించారు. ఇంకా దీనితో పాటు ప్రత్యేకంగా రూపొందించిన అవార్డ్స్ ట్రోఫీ (జ్ఞాపిక), ఈటీవీ బాల భారత్ కస్టమైజ్డ్ స్కార్ఫ్, బ్రోచ్‌ను అందించారు. అంతే కాకుండా వీటితో పాటు ఇక్కడ విజేతతో పాటు మరో వ్యక్తి కూడా ఉపయోగించుకునేలా రామోజీ ఫిల్మ్ సిటీ టూర్ టికెట్స్‌ను అందించారు. వీటిని కాంప్లిమెంటరీ కింద ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే అవార్డుల కార్యక్రమాన్ని యానిమేషన్ ఎక్స్‌ప్రెస్ (AnimationXPress) నిర్వహించింది. ఎనిమిదో యానిమేషన్ అండ్ మోర్ (AM) సమిట్, ANN అవార్డ్స్ 2026 లో భాగంగా ముంబయి నెస్కో ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

Ramoji Animation Excellence Awards 2026
రామెజీ ఎక్సలెన్స్ అవార్డు సర్టిఫికేట్ (Source : ETV Bharat)

ఆ కార్యక్రమానికి ఈటీవీ బాల భారత్ ఇండస్ట్రీ పార్ట్‌నర్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, ఎక్స్‌టెండెడ్ రియాల్టీ (AVGC- XR) రంగాల్లో ప్రతిభను గుర్తించడంలో ఏఎన్ఎన్ అవార్డ్స్ ఇప్పటికే కీలక వేదికగా నిలిచిందని యానిమేషన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. రామోజీ యానిమేషన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రారంభంతో పరిశ్రమలోని ప్రముఖుల సేవలను గుర్తించడంతో పాటు భవిష్యత్తు తరానికి చెందిన యువ ప్రతిభను ప్రోత్సహించే దిశగా మరింత ముందడుగు పడుతుందని పేర్కొంది. భారతదేశంలో AVGC-XR రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇలాంటి అవార్డులు కొత్త ఆలోచనలకు, స్వతంత్ర క్రియేటర్లకు మరింత ప్రోత్సాహాన్ని అందించగలవని భావిస్తున్నారు. యానిమేషన్, డిజిటల్ స్టోరీటెల్లింగ్ రంగాల్లో భారత్‌ ప్రపంచస్థాయి కేంద్రంగా ఎదుగుతున్న సమయంలో యువ యానిమేటర్లు, చిన్న స్టూడియోలకు గుర్తింపు లభించడం పరిశ్రమకు కీలక పరిణామంగా నిలుస్తోంది.

Ramoji Animation Excellence Awards 2026
ఎంటాగిల్డ్ సీఈఓ శుభ్రాన్షు సింగ్​కు అవార్డు అందిస్తున్న సుజయ్ చెరుకూరి, పక్కన యానిమేషన్ ఎక్స్‌ప్రెస్ ఫౌండర్ అనిల్​ ఎన్​ఎం (Source : ETV Bharat)

ఇప్పటికే 7 విభాగాల్లో రామోజీ ఎక్సలెన్స్ అవార్డులు, ఇప్పుడు యానిమేషన్ కూడా!
రామోజీ గ్రూప్ 2025లో రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రకటించగా, దానికి ఏడాది తర్వాత ఇప్పుడు రామోజీ యానిమేషన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమం కూడా ప్రారంభమైంది. రామోజీ ఎక్సలెన్స్ అవార్డులను జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, మానవ సేవ, కళలు- సంస్కృతి, యూత్ ఐకాన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మహిళా సాధికారత వంటి మొత్తం 7 విభాగాల్లో ప్రకటించారు. గతేడాది నవంబర్ 16న అవార్డుల ప్రదానోత్సవం రామోజీ ఫిలింసిటీలోనే ఘనంగా నిర్వహించారు. భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఇప్పుడు కొత్తగా ప్రారంభమైన RAEA ద్వారా భారత యానిమేషన్ ఇండస్ట్రీలో ప్రతిభ, ప్రయోగాత్మక ఆలోచనలు, సొంత సృజనాత్మకతకు మరింత గుర్తింపు లభించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Ramoji Animation Excellence Awards 2026
సుజయ్ చేతుల మీదుగా యానిమేటర్ వి.ఉన్నికృష్ణన్ తరఫున అవార్డు అందుకుంటున్న వైశాఖ్ వి.ఎం (కార్మాండ్ ఇన్ఫినిటీ సంస్థ యానిమేషన్ డైరెక్టర్, ఉన్నికృష్ణన్ మెంటార్)- సుజయ్​కు ఎడమవైపు యానిమేషన్ ఎక్స్‌ప్రెస్ ఫౌండర్ అనిల్​ ఎన్​ఎం (Source : ETV Bharat)