వచ్చే 10ఏళ్లలో 100 కొత్త విమానాశ్రయాలు- రూ.30 వేల కోట్లతో నిర్మాణం: రామ్మోహన్ నాయుడు
'ఉడాన్' పథకం కింద దేశవ్యాప్తంగా విమానాశ్రయాల విస్తరణ- 2014లో 74 ప్రస్తుతం 166కి చేరిన విమానాశ్రయాల సంఖ్య- అహ్మదాబాద్ నుంచి మూడో 'హబ్ అండ్ స్పోక్' కార్యకలాపాలు ప్రారంభం

Published : September 2, 2026 at 10:11 AM IST
Ram Mohan Naidu On Airports : దేశంలో విమాన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విమానాశ్రయాల సంఖ్యను మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రానున్న పదేళ్లలో దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలను నిర్మించేందుకు సుమారు రూ.30 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. 'ఉడాన్' పథకం ద్వారా ఇప్పటికే విమానయాన రంగంలో వచ్చిన మార్పులను మరింత విస్తరించనున్నట్లు చెప్పారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి దేశంలో మూడో 'హబ్ అండ్ స్పోక్' కార్యకలాపాలను మంగళవారం రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"దేశంలో విమానాశ్రయాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2014లో భారత్‌లో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 166కు చేరింది. గత 12 ఏళ్లలో దాదాపు ప్రతి 40 రోజులకు ఒక కొత్త విమానాశ్రయం లేదా కొత్త టెర్మినల్ నిర్మాణం పూర్తయింది. గత దశాబ్ద కాలంలో 'ఉడాన్' పథకం ద్వారా పౌర విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇప్పుడు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 100 విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది."
- కె. రామ్మోహన్ నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి
రూ.28,840 కోట్లతో సవరించిన ఉడాన్
ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి కేంద్రం 'ప్రాంతీయ అనుసంధాన పథకం-సవరించిన ఉడాన్'ను అమలు చేయనుంది. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ ఏడాది మార్చిలో ఆమోదం తెలిపింది. 2026-27 నుంచి 2035-36 ఆర్థిక సంవత్సరం వరకు పదేళ్ల పాటు ఈ పథకం కొనసాగనుంది. కేంద్ర బడ్జెట్ మద్దతుతో మొత్తం రూ.28,840 కోట్ల వ్యయాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. దేశాన్ని ప్రపంచ స్థాయి విమానయాన కేంద్రంగా మార్చడమే ఈ వ్యూహం ప్రధాన ఉద్దేశం. ఈ పథకం ద్వారా ఇప్పటికే విమాన ప్రయాణానికి దూరంగా ఉన్న అనేక ప్రాంతాలకు కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు దాన్ని మరింత విస్తరించాలని కేంద్రం భావిస్తోంది.
విమానాశ్రయం కోసం డిమాండ్
భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పౌర విమానయానం ఒకటని రామ్మోహన్ నాయుడు అన్నారు. గతంలో ప్రజలు తమ ప్రాంతంలో రైల్వే స్టేషన్ లేదా రైలు ఆగే సదుపాయం కోసం డిమాండ్ చేసేవారని, ఇప్పుడు తమ సొంత పట్టణంలో విమానాశ్రయం ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారని చెప్పారు. ఈ డిమాండ్ కేవలం ప్రధాన నగరాలకే పరిమితం కాలేదని మంత్రి పేర్కొన్నారు. టైర్-2, టైర్-3 నగరాలు, హిమాలయ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, లక్షద్వీప్, అండమాన్ దీవుల నుంచి కూడా విమాన కనెక్టివిటీ కోసం ప్రజలు కోరుతున్నారని తెలిపారు. ఆధునిక భారతదేశంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధానాలను రూపొందిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.
'హబ్ అండ్ స్పోక్'తో అంతర్జాతీయ కనెక్టివిటీ
దేశంలో కొత్త విమానాశ్రయాలను నిర్మించడం మాత్రమే కాకుండా, వాటిని సమర్థవంతంగా అనుసంధానించడం కూడా కీలకమని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ నేపథ్యంలో 'హబ్ అండ్ స్పోక్' విధానంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. సాధారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు దేశంలోని కొన్ని ప్రధాన నగరాల నుంచే ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు దిల్లీ నుంచి 54 అంతర్జాతీయ గమ్యస్థానాలకు నేరుగా విమాన కనెక్టివిటీ ఉందని మంత్రి వివరించారు. అయితే దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా తమ ప్రాంతాల నుంచి అంతర్జాతీయ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునే అవకాశం కోరుకుంటున్నారని చెప్పారు. ఈ అవసరాన్ని తీర్చేందుకు ప్రధాన విమానాశ్రయాలను 'హబ్'లుగా ఉపయోగించుకుని ఇతర నగరాలను వాటితో అనుసంధానించే 'స్పోక్' విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
వారణాసి, అమృత్‌సర్ తర్వాత అహ్మదాబాద్
'హబ్ అండ్ స్పోక్' కార్యకలాపాలను తొలుత వారణాసి, అమృత్‌సర్‌లో ప్రారంభించినట్లు రామ్మోహన్ నాయుడు చెప్పారు. అక్కడి నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. తాజాగా అహ్మదాబాద్‌ను మూడో కేంద్రంగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. గుజరాత్‌కు చెందిన ప్రవాస భారతీయులు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్నారని, ఈ ప్రాంతం నుంచి అంతర్జాతీయ విమాన కనెక్టివిటీ కోసం మంత్రిత్వ శాఖకు అనేక విజ్ఞప్తులు వస్తున్నాయని మంత్రి చెప్పారు. అందుకే అహ్మదాబాద్‌ను ఈ కార్యక్రమానికి అనువైన కేంద్రంగా ఎంచుకున్నట్లు వివరించారు. అహ్మదాబాద్ నుంచి ప్రారంభమైన ఈ కార్యకలాపాలు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రయాణికుల సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తూ విమానయాన వ్యవస్థను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
విమానయానం ఉపాధి, ఆర్థికాభివృద్ధికి కీలకం
పౌర విమానయాన రంగం కేవలం ప్రయాణ సౌకర్యానికే పరిమితం కాదని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇది భారీగా ఆర్థిక కార్యకలాపాలను, ఉపాధి అవకాశాలను సృష్టించే సామర్థ్యం కలిగిన రంగమని చెప్పారు. ఒక విమానాశ్రయం ఏర్పాటుతో దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక రంగాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. విమానాశ్రయాలు, విమానయాన రంగం అభివృద్ధి చెందితే యావత్ దేశ అభివృద్ధికి అది దోహదపడుతుందని అన్నారు. జాతీయ పౌర విమానయాన విధానంలో గుజరాత్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి తదితరులు పాల్గొన్నారు.
దేవుడి ఊరేగింపులో హ్యూమనాయిడ్ రోబో- మంత్రాలు పఠిస్తూ, డ్యాన్స్ చేస్తూ సందడి
క్యాన్సర్‌తో మాట పోయినా కళను వదల్లేదు- పెయింటింగ్, కాలిగ్రఫీతో భావాలకు ప్రాణం

