రాఖీలను భద్రంగా దాచుకున్న అమరవీరుడు- 20ఏళ్ల తర్వాత వెలుగులోకి- కన్నీళ్లు పెట్టుకున్న కుటుంబం
మరణం తర్వాత కూడా రాఖీను భద్రంగా ఉంచుకున్న మేజర్ సుధీర్ వాలియా- కార్గిల్ యుద్ధంలో 'జులు టాప్ను' స్వాధీనం చేసుకున్న పారా ఎస్ఎఫ్ వీరుడు- 1999 ఆగస్టు 29న ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం

Published : August 28, 2026 at 9:38 AM IST
Brother Keeps Rakhi Safe For Years : సాధారణంగా సోదరి కట్టిన రాఖీని ఎవరైనా కొన్ని రోజులు చేతికి ఉంచుకుని, ఆ తర్వాత దాన్ని తీసి భద్రపరుస్తారు లేదా నిమజ్జనం చేస్తారు. కానీ ఓ జవాన్ మాత్రం తన సోదరి కట్టిన ప్రతి రాఖీని ఎంతో అపురూపంగా దాచుకున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన మరణించిన దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆ రాఖీలు సోదరి కంటపడ్డాయి. వాటిని చూసిన కుటుంబ సభ్యుల కళ్లలో కన్నీళ్లు ఆగలేదు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో పాలంపుర్‌లోని బనూరి గ్రామానికి చెందిన సుబేదార్ మేజర్ రూలియా రామ్ కుమారుడైన మేజర్ సుధీర్ వాలియా, హమీర్‌పూర్ జిల్లాలోని సుజన్‌పూర్ తిహ్రాలో ఉన్న ప్రతిష్ఠాత్మక సైనిక్ పాఠశాలలో విద్యనభ్యసించారు. చిన్న వయస్సులోనే నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)కి ఎంపికయ్యారు. ఎన్‌డీఏ నుంచి శిక్షణ పూర్తిచేసుకున్న అనంతరం 1987 మే 30న భారత సైన్యంలో తన సేవలను ప్రారంభించారు.

పారా ఎస్ఎఫ్‌లో చేరాలని కల
ప్రారంభంలో సుధీర్ వాలియాను 4 జాట్ బెటాలియన్‌కు నియమించారు. భారత ప్రభుత్వం శ్రీలంకకు శాంతి పరిరక్షక దళాలను పంపిన సమయంలో ఆయనకు అక్కడ సేవలందించే అవకాశం వచ్చింది. ఆ సమయంలో పారా ఎస్ఎఫ్ కమాండోలతో కలిసి పనిచేసే అవకాశం ఆయనకు లభించింది. ఆ అనుభవం ఆయనలో పారా ఎస్ఎఫ్‌పై మరింత ఆసక్తిని పెంచింది. చివరకు తన కలను నెరవేర్చుకుని 'మెరూన్ బెరెట్' సంపాదించి పారా ఎస్ఎఫ్‌లో చేరారు. 1990లో 9 పారా ఎస్ఎఫ్‌లో విధులు ప్రారంభించారు. అయితే ప్రతి ఏడాది రాఖీ పండుగ సమీపిస్తున్నప్పుడు తన సోదరిని రాఖీ పంపాలని మేజర్ సుధీర్ ముందుగానే గుర్తుచేసేవారని ఆమె అన్నారు. సోదరి కూడా ప్రేమతో రాఖీలు పంపించేవారని తెలిపారు. అయితే వాటిని కొంతకాలం చేతికి ఉంచుకుని తీసేయడం కాకుండా, సుధీర్ వాటిని జాగ్రత్తగా దాచేవారని చెప్పారు.

"మేజర్ సుధీర్ సెలవుపై ఇంటికి వచ్చినప్పుడల్లా తన పర్సు, ఇతర వస్తువులను తల్లి చేతిలో పెట్టేవారు. విధులకు వెళ్లే ముందు నాతో తిలకం దిద్దించుకుని, కలవా(ఎర్ర దారం) కట్టమని అడిగేవారు. భోజనం చేసేటప్పుడు పక్కనే కూర్చోబెట్టుకునేవారు. ఆయన ప్రేమ, ఆప్యాయతలను ఎప్పటికీ మర్చిపోలేం"
- మేజర్ సుధీర్ వాలియా సోదరి
మేజర్ సుధీర్ వాలియా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సుమారు 20, 21 ఏళ్ల తర్వాత రాఖీ పండుగ సమయంలో ఆయన కుటుంబ పరిచయస్థుడు అభిషేక్ గౌతమ్ పాలంపూర్‌లోని వారి ఇంటికి వచ్చారు. మేజర్‌కు సంబంధించిన వస్తువుల గురించి కుటుంబ సభ్యులతో చర్చ జరుగుతుండగా, వాటిని తెరిచి చూశారు. అప్పుడు పుస్తకాల మధ్య ఎంతో భద్రంగా దాచిన రాఖీలు కనిపించాయి. అవి చూసిన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. మేజర్ సుధీర్ వాలియా బావ ప్రవీణ్ అహ్లువాలియా మాట్లాడుతూ, ఆయన వీరగాథ పాలంపుర్, హిమాచల్‌ప్రదేశ్‌కే కాకుండా దేశం మొత్తానికీ గర్వకారణమని తెలిపారు.

ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో సాహసం
కీర్తి చక్ర, సేనా మెడల్ గ్రహీత, 9 పారా ఎస్ఎఫ్ దళానికి చెందిన 'సింహం'గా పేరుగాంచిన సుబేదార్ మేజర్ మహేంద్ర సింగ్, మేజర్ సుధీర్ వాలియాను గుర్తుచేసుకుంటే ఇప్పటికీ భావోద్వేగానికి గురవుతారు. 1992 నుంచి 1996 వరకు సుధీర్ వాలియాతో కలిసి అనేక ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నానని ఆయన తెలిపారు. సుధీర్ తన ట్రూప్ కమాండర్ అని, తాను ఆయనకు బడ్డీగా పనిచేశానని చెప్పారు. ప్రమాదం పొంచి ఉందని అనిపించిన ప్రతిసారీ సుధీర్ స్వయంగా ముందుండి బృందాన్ని నడిపించేవారని గుర్తుచేశారు. చిన్న ఆధారాన్ని కూడా ఆయన వదిలిపెట్టేవారు కాదని తెలిపారు. ఒక చిన్న మిఠాయి కాగితం కనిపించినా అక్కడ ఎవరి కదలికలు జరిగాయో అంచనా వేయగలిగేంత పరిశీలనా శక్తి ఆయనకు ఉండేదన్నారు.

రెండుసార్లు సేనా మెడల్
1993 జులైలో రాజౌరీలోని కండి గ్రామంలో మేజర్ సుధీర్ వాలియా తన తొలి ఆపరేషన్ నిర్వహించారు. ఆ మిషన్‌లో ముగ్గురు ప్రమాదకర ఉగ్రవాదులను హతమార్చారు. ఆ ఆపరేషన్‌కు నాయకత్వం వహించినందుకు, అప్పట్లో కెప్టెన్‌గా ఉన్న సుధీర్ వాలియాకు 1994లో తొలిసారి సేనా మెడల్ లభించింది. ఆ తర్వాత 'బ్రహ్మ-2' ఆపరేషన్‌లో ఉగ్రవాదులపై చూపిన అసాధారణ ధైర్యసాహసాలకు మరోసారి సేనా మెడల్ అందుకున్నారు. రెండోసారి సేనా మెడల్ అందుకోవడాన్ని 'బార్ టు సేనా మెడల్'గా పిలుస్తారు. ఈ సాహసాల తర్వాత ఆయనకు 'రాంబో' అనే మారుపేరు వచ్చింది. సియాచిన్ గ్లేసియర్ వద్ద రెండుసార్లు విధులు నిర్వర్తించారు.

80 దేశాల అధికారుల మధ్య అగ్రస్థానం
1997లో అమెరికాలో నిర్వహించిన ప్రత్యేక సైనిక శిక్షణలో 80 దేశాలకు చెందిన కమాండో అధికారులతో కలిసి పాల్గొనే అవకాశం సుధీర్ వాలియాకు లభించింది. తన వృత్తిపరమైన నైపుణ్యం, శారీరక దృఢత్వం, యుద్ధ పరిజ్ఞానంతో ఆ శిక్షణలో ఆయన అగ్రస్థానంలో నిలిచారు. దీంతో ఇతర దేశాల అధికారులు ఆయనను ఆప్యాయంగా 'కల్నల్' అని పిలిచేవారు. కోర్సులో ప్రథమ స్థానం సాధించిన అనంతరం అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌లో ప్రసంగించేందుకు ఆయనను ఆహ్వానించారు. ఆయన ప్రసంగం అనంతరం అక్కడి అధికారులు నిలబడి చప్పట్లతో అభినందించినట్లు కుటుంబ సభ్యులు, సహచరులు గుర్తుచేసుకున్నారు.
కార్గిల్‌లో 'జులు టాప్' విజేత
1999లో కార్గిల్ యుద్ధం సమయంలో సుధీర్ వాలియా యుద్ధరంగంలో పాల్గొనాలని పట్టుబట్టారు. అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ వి.పీ. మాలిక్‌ను ఒప్పించి కార్గిల్‌కు వెళ్లారు. అక్కడ 'జులు టాప్'ను స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. కార్గిల్ యుద్ధం అనంతరం కూడా పారా ఎస్ఎఫ్‌లోనే కొనసాగుతూ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారు. 1999 ఆగస్టు 29న హఫ్రుదా అడవుల్లో జరిగిన ఓ ఆపరేషన్‌లో ఉగ్రవాదులను వెంబడిస్తున్న సమయంలో ప్రవహిస్తున్న నీటిలో తాజా టూత్‌పేస్ట్ నురుగును గుర్తించారు. దాంతో ఉగ్రవాదులు సమీపంలోనే ఉన్నారని వెంటనే అంచనా వేశారు. కేవలం ఐదుగురు సభ్యులతో కూడిన చిన్న బృందానికి ఆయన నాయకత్వం వహించారు. ఈ ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ప్రత్యక్ష కాల్పుల్లో అనేక బుల్లెట్ గాయాలు తగిలినా, ఆయన రేడియో ద్వారా తన బృంద సభ్యులకు సూచనలు ఇస్తూనే ఉన్నారు. చివరకు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు.
అమూల్యమైన వారసత్వం
మేజర్ సుధీర్ వాలియా మేనకోడళ్లు రిషిక, నందిని వాలియా, తమ మామయ్య వీరగాథలను వింటూ పెరిగామని చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్‌సీసీలో సభ్యులుగా ఉన్న వారు రక్షణ దళాల్లో చేరాలని ఆకాంక్షిస్తున్నారు. అమరవీరుడి వర్ధంతి లేదా అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆయన విగ్రహాన్ని శుభ్రం చేసి నివాళులర్పిస్తామని తెలిపారు. మేజర్ సుధీర్ వాలియా యూనిఫాం, పతకాలు, ఆయనకు సంబంధించిన వస్తువులు తమకు అమూల్యమైన వారసత్వమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయన జీవిత కథ దేశ యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొంటున్నారు.
ప్రతిభకు వైకల్యం అడ్డు కాదు- పండగ వేళ ఈ పిల్లలు చేసిన రాఖీలు వెరీ స్పెషల్- ధర చాలా తక్కువే!
పాముకాటుతో అన్నాచెల్లెలు మృతి - రక్షాబంధన్‌కు ముందురోజు కుటుంబంలో తీవ్ర విషాదం

