ETV Bharat / bharat

32,000 అడుగుల ఎత్తు నుంచి ఫ్రీ-ఫాల్ జంప్ సక్సెస్​- DRDOపై రాజ్​నాథ్ ప్రశంసలు

స్వదేశీ మిలిటరీ కంబాట్ పారాచూట్ వ్యవస్థ అభివృద్ధి-- 32,000 అడుగుల ఎత్తు నుంచి ఎంసీపీఎస్ పారాషూట్ పరీక్ష సక్సెస్

Rajnath Singh hails DRDO
Rajnath Singh hails DRDO (PTI)
author img

By ETV Bharat Telugu Team

Published : October 16, 2025 at 5:47 PM IST

3 Min Read
Choose ETV Bharat

Rajnath Singh hails DRDO : స్వదేశీ మిలిటరీ కంబాట్ పారాచూట్ వ్యవస్థను అభివృద్ధి చేసినందుకు డీఆర్​డీఓపై రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ఈ పారాచూట్ వ్యవస్థను రక్షణ సాంకేతికతలో స్వావలంబన వైపునకు ఒక అద్భుతమైన మైలురాయిగా అభివర్ణించారు. ఈ మేరకు డీఆర్​డీఓను అభినందిస్తూ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్​లో రాజ్​నాథ్ సింగ్ పోస్ట్ చేశారు.

డీఆర్​డీఓపై రాజ్​నాథ్ సింగ్ ప్రశంసలు
"దేశానికి గర్వకారణమైన క్షణం! డీఆర్​డీఓ స్వదేశీ మిలిటరీ కంబాట్ పారాచూట్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీంతో భారత్ 32,000 అడుగుల నుంచి ఫ్రీ-ఫాల్ జంప్​ను విజయవంతంగా పూర్తి చేసింది. కీలకమైన రక్షణ సాంకేతికతలో స్వావలంబన వైపునకు ఇదొక అద్భుతమైన మైలురాయి." అని రాజ్​నాథ్ ఎక్స్ పోస్ట్​లో పేర్కొన్నారు. అలాగే తాము అభివృద్ధి చేసిన మిలిటరీ కంబాట్ పారాచూట్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించామని డీఆర్​డీఓ సైతం ఓ ప్రకటనలో తెలిపింది.

ట్రయల్ సక్సెస్
దేశీయంగా మిలిటరీ కంబాట్ పారాచూట్ వ్యవస్థను డీఆర్​డీఓ అభివృద్ధి చేయడంతో భారత్‌ మరో ప్రధాన రక్షణ మైలురాయిని అందుకున్నట్లు అయ్యింది. స్వదేశీ మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్ (ఎంసీపీఎస్)ను 32,000 అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా పరీక్షించారు. భారత వైమానిక దళానికి చెందిన ధైర్యవంతులైన సైనికులు ఈ ఎత్తు నుంచి ఫ్రీఫాల్ జంప్ చేశారు. ఈ క్రమంలో మిలిటరీ కంబాట్ పారాచూట్ వ్యవస్థ సామర్థ్యం, అధునాతన డిజైన్‌, విశ్వనీయతను ప్రదర్శించారు. ఇది 25,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉపయోగించగల భారతదేశంలోని మొట్టమొదటి పారాచూట్ వ్యవస్థగా నిలిచింది.

దీన్ని ఎక్కడ అభివృద్ధి చేశారంటే?
స్వదేశీ మిలిటరీ కంబాట్ పారాచూట్ వ్యవస్థను డీఆర్​డీఓ ప్రయోగశాలలు, ఆగ్రాలోని ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్‌ మెంట్ ఎస్టాబ్లిష్‌ మెంట్, బెంగళూరులోని డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్‌ ఎలక్ట్రో మెడికల్ ల్యాబరేటరీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ పారాచూట్ తక్కువ వేగ ల్యాండింగ్ సామర్థ్యం, ​​మెరుగైన దిశాత్మక నియంత్రణ, నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్ ఇంటిగ్రేషన్ వంటి కొత్త సాంకేతికతలను కలిగి ఉంది. ఈ సాంకేతికతలు సైనికులు ఏ పరిస్థితుల్లోనైనా కచ్చితమైన ల్యాండింగ్​లను నిర్వహించడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ వ్యవస్థను ప్రవేశపెట్టడంతో భారత్ ఇకపై విదేశీ పారాచూట్ వ్యవస్థలపై ఆధారపడవలసిన అవసరం తగ్గుతుంది. దీని నిర్వహణ కూడా దేశంలో త్వరగా, ఈజీగా అయిపోతుంది. యుద్ధం లేదా సంక్షోభ సమయాల్లో దాని పూర్తి కార్యాచరణ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. పారాచూట్ వ్యవస్థ కోసం ఇతర దేశాలపై భారత్ ఆధారపడడాన్ని తగ్గిస్తుంది.

డీఆర్​డీఓ ప్రకటన
"కీలకమైన రక్షణ సాంకేతికతలో డీఆర్​డీఓ ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. స్వదేశీ మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్ (ఎంసీపీఎస్) 32,000 అడుగుల ఎత్తు నుంచి ఫ్రీఫాల్ జంప్​ను విజయవంతంగా పూర్తి చేసింది. పారాచూట్ వ్యవస్థను 30,000 అడుగుల ఎత్తులో మోహరించారు. టెస్ట్ జంపర్లు Wg Cdr విశాల్ లకేశ్, VM (G), MWO ఆర్జే సింగ్ అండ్ MWO వివేక్ తివారీ ఫ్రీఫాల్ జంప్ చేశారు. స్వదేశీ వ్యవస్థ సామర్థ్యం, ​​విశ్వసనీయత, అధునాతన రూపకల్పనను ప్రదర్శించారు." అని డీఆర్​డీఓ పోస్ట్ చేసింది.

డీఆర్​డీఓ ఛైర్మన్ సైతం హర్షం
మరోవైపు, స్వదేశీ మిలిటరీ కంబాట్ పారాచూట్ వ్యవస్థను అభివృద్ధి చేసినందుకు డీఆర్​డీఓను ఆ సంస్థ ఛైర్మన్ సమీర్ వి కామత్ అభినందించారు. ఈ విజయాన్ని వైమానిక డెలివరీ వ్యవస్థల రంగంలో స్వావలంబన వైపు ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించారు. యుద్ధ సమయంలో కూడా ఇది సైన్యానికి బలంగా మారుతుందన్నారు.