ETV Bharat / bharat

దేశంలోనే మొదటి 'దివ్యాంగ్ థియేటర్ స్కూల్'- నటన, నృత్యంలో శిక్షణ-​ దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు!

దివ్యాంగ విద్యార్థుల అభివృద్ధికి పాటుపడుతున్న రాజీవ్ కుమార్- వారి కోసం ప్రత్యేకంగా ఓ స్కూల్ ఏర్పాటు- అందులో శని, ఆదివారాల్లో పాఠాలు బోధన

Indias First Divyang Drama School
Indias First Divyang Drama School (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : February 25, 2026 at 7:45 PM IST

3 Min Read
Choose ETV Bharat

Indias First Divyang Drama School : శారీరక లోపాలతో చాలా దివ్యాంగులు ఇబ్బందులు పడుతుంటారు. కొందరు దివ్యాంగులకు జీవితంలో ఏదైనా సాధించాలనే కోరిక ఉంటుంది. కానీ వారికి కుటుంబం, సమాజం నుంచి సరైన సహకారం లభించకపోవచ్చు. అయితే దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నారు అసోంకు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ రాజీవ్ కుమార్ సౌద్. దివ్యాంగ విద్యార్థులకు నటనలో మెళుకువలు నేర్పించడమే కాకుండా, ఇతర రంగాలలో కూడా వారు స్వావలంబన పొంది సమాజంలో గౌరవంగా జీవించేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు.

2019లో దేశంలో మొదటి దివ్యాంగ్ థియేటర్ స్కూల్
రాజీవ్ కుమార్ సౌద్ మామ దివ్యాంగుడు. అందుకే రాజీవ్‌కు దివ్యాంగుల ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులు పరిస్థితులన్నింటిపైనా స్పష్టమైన అవగాహన ఉంది. ఈ క్రమంలో 2019లో దేశంలోనే మొట్టమొదటి దివ్యాంగ్ థియేటర్ స్కూల్‌ను అసోం రాజధాని గువాహటిలో స్థాపించారు. ఈ పాఠశాల ద్వారా వివిధ వయసులున్న దివ్యాంగులకు (విద్యార్థులకు కూడా) నటన (నాటకాలు మొదలైనవి) నేర్పిస్తున్నారు. ఈ క్రమంలో దివ్యాంగులకు కళల పట్ల మక్కువను పెంచుతున్నారు.

ఈ థియేటర్ స్కూల్‌లో నటనతో పాటు విద్యార్థులకు పలు రంగాల్లో నైపుణ్యాలను నేర్పిస్తారు. డ్యాన్స్, సింగింగ్, యోగా, ధ్యానం, పేపర్ క్రాఫ్ట్ వంటి వాటిని పాఠశాలలో నేర్పిస్తారు. విద్యార్థులను పర్యావరణంతో అనుసంధానం చేయడానికి ఈ స్కూల్ క్లాసులను నదీ తీరాల వద్ద నిర్వహిస్తారు. ఈ చొరవ ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రశంసలను అందుకుంది. కాగా, గువాహటి నడిబొడ్డున ఉన్న ఈ పాఠశాలలో ప్రతి శనివారం, ఆదివారం క్లాసులు జరుగుతాయి. ఇక్కడ ప్రతి విద్యార్థికి నటనపై మంచి ఆసక్తి ఉంటుంది. కొందరు నటనలో రాణిస్తున్నారు. మరికొందరు సింగింగ్, డ్యాన్స్‌లో అదరగొడుతున్నారు. ఈ స్కూల్ విద్యార్థులు ఇప్పటికే దిల్లీ సహా పలు ప్రదేశాల్లో నాటక ప్రదర్శనలు ఇచ్చారు. ఈ క్రమంలో ప్రేక్షకుల నుంచి వీరికి విశేషమైన మద్దతు లభించింది. అలాగే ప్రశంసలు దక్కాయి.

Indias First Divyang Drama School
దివ్యాంగ విద్యార్థుల నటనా ప్రతిభ (ETV Bharat)

తండ్రి అండగా దివ్యాంగులకు సేవ
రాజీవ్ కుమార్ సౌద్ తండ్రి అభిరామ్ సౌద్ రిటైర్డ్ టీచర్. ఆయన మంచి ఆర్టిస్టు కూడా. రాజీవ్‌ను ఆయన తండ్రి అభిరామ్ చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో ప్రోత్సహించారు. అలాగే అండగా నిలిచారు కూడా. ఈ క్రమంలో రాజీవ్ 2019లో దివ్యాంగ విద్యార్థుల కోసం దివ్యాంగ్ థియేటర్ స్కూల్ స్థాపించారు. వారికి నటన, సింగింగ్, డ్యాన్స్ వంటి వాటిని నేర్పిస్తున్నారు.

Indias First Divyang Drama School
దివ్యాంగ విద్యార్థుల నటనా ప్రతిభ (ETV Bharat)

విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం
అయితే దివ్యాంగ్ థియేటర్ స్కూల్‌ వల్ల విద్యార్థులు నటనలో మార్పు ఏమో గానీ, వారి దైనందిన జీవితాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంతో పోలిస్తే దివ్యాంగ విద్యార్థులు తమ తల్లిదండ్రులతో ఇప్పుడు మంచి కమ్యూనికేషన్‌ను కలిగి ఉంటున్నారు. ఒకప్పుడు మౌనంగా, సైలెంట్‌గా ఉన్న పిల్లలు ఇప్పుడు చకచక మాట్లాడేస్తున్నారు. మరికొందరు ఎవరు తోడు లేకుండా ఒంటరిగా స్కూల్‌కు వెళ్తున్నారు. అంతలా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు. దీంతో దివ్యాంగుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగ్ థియేటర్ స్కూల్‌లో జాయిన్ తర్వాత తమ పిల్లల్లో చాలా మార్పులు వచ్చాయని చెబుతున్నారు. వారిలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగిందని అంటున్నారు.

Indias First Divyang Drama School
దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్కూల్​ (ETV Bharat)

"మా మామ దివ్యాంగుడు. కానీ ఆయన స్వతంత్రంగా వ్యవహరించేవాడు. నేను మొదట అంతర్జాతీయ సంస్థ యూనిసెఫ్‌లో శిక్షణ పొందాను. ఆ తర్వాత గువాహటిలో ఉన్న లాభాపేక్షలేని సంస్థ అయిన శిశు సారథి కోసం పనిచేయడం ప్రారంభించాను. ఆ తర్వాత నా తండ్రి అభిరామ్ సౌద్ ఆర్థిక సాయం అందించడం వల్ల 2019లో నేను దివ్యాంగ్ థియేటర్ స్కూల్‌ను స్థాపించాను. నేను గణేష్‌గురి నర్సరీలోని మాణిక్ నగర్‌లో 30 మంది విద్యార్థులతో ఈ స్కూల్‌ను ప్రారంభించాను. కానీ కొవిడ్ సమయంలో స్కూల్ రెండేళ్లు మూతపడింది. ఆ తర్వాత స్కూల్‌ను జోనాలికి మార్చాం. నేను యాక్టింగ్ నేర్చుకుని, హీరోగా మారడానికి ఈ రంగంలోకి వచ్చాను. కానీ పరిస్థితులు నా నిర్ణయాన్ని మార్చాయి. నేను హీరోగా మారడం ముఖ్యం కాదు. ఈ దివ్యాంగులు హీరోలుగా మారితే అప్పుడు నేను హీరోగా మారినట్లే" అని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.

భావ్‌నగర్ రైతు కొత్త ప్రయోగం- బ్రోకలీ, పర్పుల్ క్యాబేజీ సాగుతో లాభాల పంట!

'గ్రీన్ గోల్డ్‌'తో స్వయం ఉపాధి- రూ.120తో రూ.50వేల ఆదాయం- ఈ పనిని నేర్చుకుంటే జీవితం మారిపోతుంది!