దివ్యాంగుల కోసం స్పెషల్ 'సర్కార్' గ్యారేజ్- పరికరాలకు ఫ్రీగా రిపేర్లు- ఆరుగురికి ఉపాధి
ఛత్తీస్‌గఢ్ సర్కార్ కీలక చొరవ- రాయ్‌పుర్‌లో దివ్యాంగులకు ప్రత్యేక గ్యారేజ్- అక్కడ దివ్యాంగుల పరికరాలకు ఉచితంగా మరమ్మతులు- సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గ్యారేజ్

Published : March 1, 2026 at 5:15 PM IST
|Updated : March 1, 2026 at 5:27 PM IST
Special Garage For The Disabled : దివ్యాంగుల కోసం ఛత్తీస్‌గఢ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు అందించే ఎలక్ట్రిక్ వెహికల్ ట్రైసైకిళ్లు, మాన్యువల్ ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు, క్రచెస్ (ఊత కర్రలు) వంటి వాటిని ఉచితంగా రిపేర్ చేసేందుకు నడుం బిగించింది. అందుకోసం రాష్ట్ర రాజధాని రాయ్‌పుర్‌లో 'దివ్యాంగ్ గ్యారేజ్'ను ఏర్పాటు చేసింది. ఈ గ్యారేజ్ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ చొరవతో దివ్యాంగులకు భారీగా ఉపశమనం లభించనుంది. ఎందుకంటే ఈ గ్యారేజ్‌లో ఉచితంగా దివ్యాంగుల పరికరాలను రిపేర్ చేయడం వల్ల వారికి ఖర్చూ తగ్గుతుంది. అలాగే మెకానిక్ షాపుల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఉండదు.
ఆరుగురిలో ముగ్గురు ఉద్యోగులు దివ్యాంగులే
ఈ 'దివ్యాంగ్ గ్యారేజ్' స్పెషల్ ఏంటంటే ఇందులో ఉన్న ఆరుగురు ఉద్యోగులలో ముగ్గురు దివ్యాంగులే. వీరిలో ఒక ఆపరేటర్, ఇద్దరు మెకానిక్‌లుగా పనిచేస్తున్నారు. ఈ ఆరుగురు రిపేరైన దివ్యాంగుల ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు వంటి వాటికి మరమ్మతులు చేస్తారు. కాగా, ఈ గ్యారేజ్‌కు ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు వంటి వాటి రిపేర్ కోసం ప్రతిరోజూ 4-5 మంది దివ్యాంగులు వస్తారు. ఉచితంగా తమ వస్తువులను మరమ్మతులు చేయించుకుని వెళ్లిపోతారు.

మెకానిక్ ఏం చెప్పాడంటే?
దివ్యాంగుల కోసం రాయ్‌పుర్‌లో ఒక ప్రత్యేక గ్యారేజ్‌ను ప్రారంభించారని అందులో పనిచేస్తున్న మెకానిక్ కుల్దీప్ మింజ్ తెలిపాడు. ఈవీ ట్రైసైకిళ్లలో తరుచుగా బ్యాటరీ, యాక్సిలరేటర్, కంట్రోలర్‌లో సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నాడు. వాటిని రిపేర్ చేసి వినియోగదారుడికి ఈవీ ట్రైసైకిళ్లను అందిస్తామని స్పష్టం చేశాడు. వీల్ చైర్లలో నట్- బోల్ట్ సమస్య ఎక్కువగా ఉందన్నాడు. ఇక్కడ దివ్యాంగులకు సంబంధించిన అన్ని పరికరాలను ఉచితంగా రిపేర్ చేస్తామని వెల్లడించాడు.ఈ దివ్యాంగ్ గ్యారేజ్‌ను గతేడాది డిసెంబరులో ప్రాజెక్ట్ డిసేబుల్డ్ కింద ప్రారంభించామని ఈ గ్యారేజ్ ఇన్‌ఛార్జ్ కార్తికేయ కుమార్ తెలిపారు.

"దివ్యాంగులకు సాంఘిక సంక్షేమ శాఖ అందించే ఈవీ ట్రైసైకిళ్లు, మాన్యువల్ ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు వంటి వాటి రిపేర్ అంత ఈజీ కాదు. ఎందుకంటే కొన్నిసార్లు విడిభాగాలు దొరికినప్పుడు మెకానిక్ అందుబాటులో ఉండడు. మెకానిక్ అందుబాటులో ఉన్నప్పుడు విడి భాగాలు దొరకవు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ కొత్త పథకం ప్రారంభించాం. ఈ గ్యారేజ్ దివ్యాంగుల సమస్యలను పరిష్కరిస్తోంది. ఇందులో మొత్తం ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వీరిలో ముగ్గురు ఉద్యోగులు దివ్యాంగులే"
- కార్తికేయ కుమార్
ఉచితంగా రిపేర్
రాయ్‌పుర్‌లో దివ్యాంగుల గ్యారేజ్ ఏర్పాటు చేశామని సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ అరవింద్ గెడం తెలిపారు. అక్కడ దివ్యాంగుల ఈవీ ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు వంటి వాటిని ఉచితంగా రిపేర్ చేస్తారని వెల్లడించారు. బ్యాటరీలు, ఛార్జర్‌లు, వైరింగ్, కంట్రోలర్‌లు వంటి విడి భాగాలను ఈవీ ట్రైసైకిళ్లకు ఉచితంగా అమరుస్తారని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే దివ్యాంగులకు కొత్త పరికరాలు అందుతాయని, అందువల్ల అవి రిపేర్ అయినప్పుడు వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. "నిబంధనలకు విరుద్ధంగా దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, క్రచెస్ లేదా ఇతర పరికరాలను పదేపదే అందించలేం. ఇప్పుడు దివ్యాంగుల గ్యారేజ్ ప్రారంభించడంతో వారి ట్రైసైకిళ్లు, వీల్ చైర్లను ఉచితంగా రిపేర్ చేయించుకోవచ్చు." అని అరవింద్ పేర్కొన్నారు.

మరీ కొన్నిచోట్ల గ్యారేజ్ ప్రారంభించే అవకాశం
రాయ్‌పుర్‌లో ఉన్న ఈ దివ్యాంగ్ గ్యారేజీకి మంచి స్పందన వస్తే, వీటిని మరిన్ని ప్రాంతాల్లో విస్తరిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. భవిష్యత్తులో కృత్రిమ అవయవాలను తయారు చేయడం, మరమ్మతు చేయడం వంటి వాటిని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
బస్తర్ టు లద్ధాఖ్- యువకుడి 2,700 కిలోమీటర్ల సైకిల్ జర్నీ- అమరవీరులకు నివాళి అర్పించేందుకే!
చిన్నతనంలో చూపుకోల్పోయిన 'ఆమె'- కానీ వందల మంది మహిళలకు ఉపాధి- ప్రేమలత స్టోరీ ఇదే!

