లాలూకు రాహుల్ ఫోన్ కాల్- సీట్ల పంపకాలపై చర్చ- ఇండియా కూటమిలో ఏం జరుగుతోంది?
లాలూ ప్రసాద్‌కు ఫోన్ చేసిన రాహుల్ గాంధీ- తొలివిడత పోల్ జరిగే స్థానాల్లో సీట్ల సర్దుబాటుపై డిస్కషన్- ఆర్‌జేడీ బలంగా ఉన్న స్థానాలను ఇచ్చేది లేదంటున్న లాలూ- తొలి విడత నామినేషన్లకు మిగిలింది ఒక్కరోజే

Published : October 16, 2025 at 5:20 PM IST
Rahul Phone Call To Lalu : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై విపక్ష ఇండియా (మహాఘట్బంధన్) కూటమిలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో గురువారం కీలక పరిణామం జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు నేరుగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూప్రసాద్ యాదవ్‌కు ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. విపక్ష పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని వీలైనంత త్వరగా కొలిక్కి తెచ్చేందుకు అందుబాటులో ఉన్న మార్గాలపై వారు చర్చించారు.
తొలి విడత పోలింగ్ జరిగే స్థానాల్లో నామినేషన్ల దాఖలుకు మరొక రోజు (అక్టోబరు 17 వరకే) గడువు ఉంది. ఈ నేపథ్యంలో తొలివిడత పోల్ జరగనున్న సీట్ల పంపకాలను పూర్తి చేసుకొని, అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరంపై డిస్కషన్ జరిగింది. పార్టీలవారీగా కేటాయించే సీట్ల సంఖ్య, బలాబలాల ఆధారంగా పార్టీలకు స్థానాల కేటాయింపు అనే అంశాలపైనా రాహుల్, ఖర్గే, లాలూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఇండియా కూటమికి పెద్దదిక్కుగా ఉన్న కాంగ్రెస్, ఆర్‌జేడీలు ఐక్యంగా కలిసి నడవాల్సిన ఆవశ్యకతపైనా వారు మాట్లాడుకున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు విపక్ష అగ్రనేతల ఫోన్ కాల్ సంభాషణ వివరాలు ఇంకా అధికారికంగా బయటికి రాలేదు.
కాంగ్రెస్‌కు 61 సీట్లు- కానీ!
బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్‌కు 52 సీట్లే ఇస్తామని ఆర్‌జేడీ తొలుత ప్రతిపాదించింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీచేసి 19 చోట్లే గెలిచిందనే విషయాన్ని గుర్తు చేసింది. కానీ తాము ప్రస్తుతం రాష్ట్రంలో బలంగా ఉన్నామని కాంగ్రెస్ వాదించింది. కనీసం 61 సీట్లను తమకు కేటాయించాలని డిమాండ్ చేసింది. ఈ అంశంపై రాష్ట్రస్థాయి ఆర్‌జేడీ, కాంగ్రెస్ నేతల మధ్య చర్చలు జరిగాయి. అయితే అవి అనుకున్న ఫలితాన్ని సాధించలేదు. సీట్ల పంపకాలపై ఇరుపార్టీల మధ్య సయోధ్య కుదరలేదు. చివరకు కాంగ్రెస్, ఆర్‌జేడీ అగ్రనేతలు రంగంలోకి దిగి దీనిపై చర్చలు జరిపినట్లు తెలిసింది. దీంతో కాంగ్రెస్‌కు 61 సీట్లు ఇచ్చేందుకు ఆర్‌జేడీ అంగీకరించిందని అంటున్నారు. కానీ కహల్‌గావ్, నర్కాతియాగంజ్, వాసాలీగంజ్, చైన్‌పుర్, బచ్వారా అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్‌కు ఇచ్చేది లేదని ఆర్‌జేడీ తేల్చి చెప్పిందని చెబుతున్నారు.
మెజారిటీ సీట్లు ఆర్‌జేడీకే!
మొత్తం మీద విపక్ష ఇండియా కూటమిలో మెజారిటీ సీట్లను ఆర్‌జేడీ దక్కించుకోవడం దాదాపు ఖాయమైంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ 144 స్థానాల్లో పోటీ చేసి, 75 చోట్ల విజయఢంకా మోగించింది. ఈసారి ఆర్‌జేడీకి 75 కంటే కాస్త తక్కువగా సీట్లు దక్కొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ 61 సీట్లు, ఆర్‌జేడీ 70-75 సీట్లు మినహా మిగతా వాటిని వామపక్షాలు, వీఐపీ పార్టీల మధ్య పంచనున్నారు.
కాంగ్రెస్ అలా- ఆర్‌జేడీ ఇలా!
ఇండియా కూటమిలో సీట్ల పంపకాల వ్యవహారం కొలిక్కి రాకముందే బుధవారం(అక్టోబరు 15న) రాత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఆర్‌జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ రాఘోపుర్ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ వేసిన కొన్ని గంటల్లోనే ఈ లిస్ట్‌ను కాంగ్రెస్ రిలీజ్ చేయడం గమనార్హం. మరోవైపు రాబ్రీదేవి నివాసంలో పలువురు ఆర్‌జేడీ అభ్యర్థులకు పార్టీ చిహ్నాలను లాలూ ప్రసాద్ యాదవ్ పంపిణీ చేశారనే వార్తలు వచ్చాయి. అయితే తేజస్వి యాదవ్ దిల్లీలో రాహుల్‌గాంధీతో భేటీ అయి, పాట్నాకు తిరిగొచ్చాక ఆర్‌జేడీ అభ్యర్థులకు లాలూ పంపిణీ చేసిన పార్టీ చిహ్నాలను వెనక్కి తీసుకున్నారని తెలిసింది. తాజాగా లాలూకు రాహుల్, ఖర్గే కాల్ చేసి మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు యత్నించారు. ఇండియా కూటమి ఐక్యత చెదిరిపోకుండా ఉండేలా జాగ్రత్తపడ్డారు.
బిహార్ ఎన్నికలు- 44 మంది అభ్యర్థులతో JDU రెండో జాబితా విడుదల
మహాఘట్బంధన్లో అంతర్గత కుమ్ములాటలు- అందుకే సీట్ల సర్దుబాటు కాలేదు : బీజేపీ చీఫ్

