ETV Bharat / bharat

ఎప్​స్టీన్​​ ఫైల్స్​తో అమెరికా ఒత్తిడి- ట్రేడ్​ డీల్ వల్ల మన రైతులే బలి : రాహుల్ గాంధీ

భారత్​, అమెరికా వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు- ట్రేడ్​ డీల్ వల్ల భారత రైతులు బలి అవుతున్నారని ఆరోపణలు

Rahul Gandhi On India Us Trade Deal
Congress MP Rahul Gandhi (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : February 26, 2026 at 2:54 PM IST

3 Min Read
Choose ETV Bharat

Rahul Gandhi On India Us Trade Deal : భారత్​-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై లోక్​సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని బెదిరించడానికి ఎప్​స్టీన్ ఫైళ్లను అమెరికా అధ్యక్షుడు ఉపయోగించారని ఆరోపించారు. ఈ ఒప్పంద వల్ల భారత రైతులు బలి అవుతున్నారని ఆరోపించారు. గురువారం కేరళ కన్నూర్​ జిల్లాలోని పెరవూరులో రైతుల మహాసభను నిర్వహించారు. ఈ సభలో మాట్లాడుతూ కేంద్రంపై ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

'రైతులే దేశానికి పునాది'
'రైతులే దేశానికి పునాది. ఈ సాధారణ వాస్తవాన్ని కేంద్రం అర్ధం చేసుకోవడం లేదు. ఐటీ వంటి ఇతర రంగాలపై సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ పునాది బలోపేతం చేయకుండా ఏం నిర్మించలేం. పునాదిని గౌరవించకపోతే ఏదీ నిలబడదు. పునాది వేసే వ్యక్తికి గౌరవం, రక్షణ ఉండాలి. మనం రోజూ ఆహారం తింటాం కానీ అది మన ముందుకు తీసుకొచ్చే రైతును గుర్తు చేసుకోము. ఇక అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఆ పునాది తవ్వినట్టే ఉంది. తక్కువ స్థాయిలో యాంత్రీకరణ కలిగిన చిన్న స్థాయి రైతులు మనవాళ్లు. అమెరికా రైతులకు విస్తారమైన భూములు, అధిక యాంత్రీకరణ ఉంది. ఇలాంటి పరిస్థితిలో అమెరికా కంపెనీలకు భారత మార్కెట్లను తెరవడం నేరపూరిత చర్య అవుతుంది' అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

గతంలో ఏ ప్రధాని అలా చేయలేదు : రాహుల్
గతంలో ప్రధానమంత్రులు ఎవరూ కూడా అమెరికా రైతులకు భారత్​లో సోయాబీన్స్, కూరగాయలు, పండ్లు వంటి ఉత్పత్తులను అమ్మడానికి అనుమతించలేదని రాహుల్ గాంధీ తెలిపారు. ఇది భారత వ్యవసాయ పునాది నాశనం చేస్తుందని ఆరోపించారు. హరిత, శ్వేత విప్లవాలు రైతుల కోసం జరిగాయని తెలిపారు. వ్యవసాయంపై భిన్నాభిప్రాయాల కారణంగా భారత్​-అమెరికా ఒప్పందం నాలుగు నెలలుగా నిలిచిపోయిందని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని అమెరికా కంపెనీలకు తెరవాలని భారత ప్రభుత్వం మొదట ఒప్పకోలేదని,చర్చలు కూడా ముందుకు సాగలేదని అన్నారు. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు ప్రధానిపై ఒత్తిడి తెచ్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

'ఎప్​స్టీన్​ ఫైల్స్, అదానీ ప్రస్తావన వల్లే'
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చిక్కుల్లో పడేసిన రెండు అంశాలను లేవనెత్తాలని ప్రయత్నించడం వల్లే రాష్ట్రపతి ప్రసంగం తర్వాత పార్లమెంట్​లో మాట్లాడటానికి తనను అనుమతించలేదని రాహుల్ గాంధీ తెలిపారు. '3.5 మిలియన్ ఎప్​స్టీన్ ఫైల్స్ ఇంకా బయటకు ఇంకా రాలేదు. అవి అమెరికా ప్రభుత్వ వద్ద రహస్యంగా ఉన్నాయని, అందులో భారత ప్రధానిపై సమాచారం ఉందని ఆరోపణలు ఉన్నాయి. రెండో అంశం అమెరికాలో అదానీ కేసు. అమెరికాలో అదానీ గ్రూప్‌పై కేసు నమోదైందని, అది ప్రధానితో సంబంధముంది. అదానీ సాధారణ కంపెనీ కాదు. ఇది బీజేపీ, ప్రధానమంత్రి ఆర్ధిక మౌలిక సదుపాయాలు. అందుకే బీజేపీ ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు ప్రధానమంత్రి భారత రైతులను బలి చేస్తున్నారు. భారత్, కేరళ రైతులను బలి ఇవ్వడాన్ని కాంగ్రెస్ అనుమతించదు'అని రాహుల్ గాంధీ అన్నారు.

కేరళపై ప్రత్యేక దృష్టి
కేరళలో ప్రజా సమస్యలను ప్రతిబింబించేలా మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నామని రాహుల్ తెలిపారు. భవిష్యత్తులో ఏర్పడే యూడీఎఫ్ ప్రభుత్వం రైతులు, కార్మికులే తమ పునాదిగా గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం రైతులకు సేవాదాతగా ఉండాలని అన్నారు. కనీస మద్దతు ధరలు, కోల్డ్ చెయిన్, నిల్వ సదుపాయాలు కల్పించాలని చెప్పారు. కష్టకాలంలో రక్షణ అవసరమని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో మనుషులు–వన్యప్రాణుల ఘర్షణ సమస్యను ప్రత్యక్షంగా చూసినట్లు తెలిపారు. దాన్ని సంక్లిష్ట సమస్యగా పేర్కొంటూ, పరిష్కారం సాధ్యమేనని చెప్పారు.