మోదీ నా సవాల్ స్వీకరించకుండా- సైలెంట్‌గా ఇజ్రాయెల్ వెళ్లిపోయారు: రాహుల్ గాంధీ
అమెరికా ఒప్పందాన్ని రద్దు చేయాలని నేను సవాల్ చేశా- కానీ మోదీ చల్లగా జారుకున్నారు- ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు

Published : February 25, 2026 at 8:32 PM IST
Rahul Dig At PM Modi : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత్-అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని తాను సవాల్ విసిరి 24 గంటలు దాటినా మోదీ స్పందించలేదని అన్నారు. తన సవాల్ స్వీకరించలేక, మోదీ మరోసారి నిశ్శబ్దంగా ఇజ్రాయెల్ వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.
"నరేంద్ర 'సరెండర్' మోదీ, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని నేను మీకు సవాల్ విసిరి 24 గంటలు దాటింది. కానీ మీరు మాత్రం చడీచప్పుడు లేకుండా ఇజ్రాయెల్ వెళ్లిపోయారు."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత ఎక్స్ పోస్ట్
नरेंद्र “सरेंडर” मोदी, आपको US Trade Deal रद्द करने की चुनौती दिए हुए 24 घंटे से ज़्यादा हो गए - आप फिर खामोशी से Israel निकल गए।
— Rahul Gandhi (@RahulGandhi) February 25, 2026
एक बार तो आप Epstein के कहने पर Israel में ‘dance and sing' कर ही चुके - अबकी बार वहां किसके कहने पर देश के हितों के ख़िलाफ़ सौदा कर के आएंगे?… pic.twitter.com/EpvXFOelcJ
ఎప్స్టీన్ ఆదేశాలు!
"గతంలో ఒకసారి ఎప్స్టీన్ ఆదేశాల మేరకు మీరు ఇజ్రాయెల్‌లో ఆటపాటలతో గడిపారు. మరి ఈసారి ఎవరి ఆదేశాల మేరకు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఒప్పందం కుదుర్చుకొని వస్తారు?" అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
మంగళవారం భోపాల్‌లో జరిగిన కిసాన్ మహాచౌపాల్ ర్యాలీ ప్రసంగించిన రాహుల్, 'భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తీవ్ర ఒత్తిడి మధ్య జరిగిందని ఆరోపించారు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఆ రైతు వ్యతిరేక ఒప్పందాన్ని రద్దు చేసే ధైర్యం ప్రధాని మోదీకి ఉందా?' అని సవాల్ విసిరారు. ఈ ఒప్పందం రైతుల గుండెల్లో గుచ్చిన బాణంగా రాహుల్ అభివర్ణించారు.
అమెరికా సుప్రీంకోర్టు తీర్పు
ట్రంప్ తన రెండో విడత పదవీకాలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఆర్థిక ఎజెండాకు అమెరికా సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని, ఆయన తన పరిధిని దాటి ఈ నిర్ణయం తీసుకున్నారని సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో తీర్పునిచ్చింది.
కాంగ్రెస్ విమర్శలు
కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాని మోదీని ఎప్స్టీన్ కేసుతో ముడిపెడుతూ తీవ్ర ఆరోపణలు చేసింది. 2014 తర్వాత భారత్-ఇజ్రాయెల్ సంబంధాల రూపకల్పనలో ఎప్స్టీన్ కీలక పాత్ర పోషించాడని పేర్కొంది.
"ఇజ్రాయెల్-పాలస్తీనా విషయంలో భారత్ విదేశీ విధానం ఎప్పుడూ ద్వి-దేశ సిద్ధాంతంపైనే ఆధారపడి ఉండేది. అయితే 'అమెరికా-ఇజ్రాయెల్ లాబీ' దశాబ్దాల నాటి మన విదేశాంగ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. సామాన్య ప్రజలకు జెఫ్రీ ఎప్స్టీన్ ఒక ఘోరమైన లైంగిక నేరగాడు కావచ్చు. కానీ మోదీ ప్రభుత్వ విదేశీ విధానానికి అతడొక హీరో. చనిపోయిన తరువాత కూడా ఎప్స్టీన్ మోదీ ప్రభుత్వ నిర్ణయాల్లో, విధానాల్లో జీవించి ఉన్నాడు" అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు.
రోబో నరేంద్ర మోదీ
"ఇటీవల ప్రధాని మోదీ తాను చిన్నతనంలో ఒక రోబోను తయారు చేశానని, దానికి మెడల్ కూడా వచ్చిందని చెప్పారు. ఇదే మాట ట్రంప్, నెతన్యాహు, ఎప్స్టీన్ కూడా చెబుతున్నారు. మేము 'నరేంద్ర మోదీ' అనే పేరుతో ఒక రోబో తయారు చేశాం. ఆయనే భారత ప్రధాని అని వారు అనుకుంటున్నారు." అని పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం.
हाल ही में मैंने सुना कि नरेंद्र मोदी ने कहा- मैंने बचपन में एक रोबोट बनाया था, जिसके लिए मुझे मेडल भी मिला था।
— Congress (@INCIndia) February 25, 2026
यही बात ट्रंप, नेतन्याहू और Epstein भी कहता है कि हमने एक रोबोट बनाया है, जिसका नाम नरेंद्र मोदी है और वो भारत का प्रधानमंत्री है।
4 जनवरी 2017 को हरदीप सिंह पुरी,… pic.twitter.com/DVr27BsML3
కాగా, రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ ఇజ్రాయెల్ వెళ్లారు. బుధవారం సాయంత్రం టెల్ అవీన్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సతీసమేతంగా ఘనస్వాగతం పలికారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రధాని మోదీకి రెడ్ కార్పెట్‌తో సైనిక గౌరవ వందనం సమర్పించింది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా నెతన్యాహుతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆవిష్కరణ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యవసాయం, సాంకేతికత, రక్షణ, భద్రత, వాణిజ్య అంశాల్లో ఒప్పందాలపై రెండు దేశాల బృందాలు చర్చించనున్నాయి.

