సూపర్ ఫీచర్స్‌తో ఏఐ మొబైల్ టవర్ ఆవిష్కరణ- ఇక ఈజీగా జనసమూహాల నియంత్రణ
జనసమూహాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం మహారాష్ట్రలోని పుణెకు చెందిన సాకర్ రోబోటిక్స్ స్టార్టప్ సంస్థ ఏఐ ఆధారిత మొబైల్ టవర్‌ను అభివృద్ధి

Published : July 21, 2026 at 10:58 PM IST
AI Mobile Tower for Crowd Control : పండుగలు, ఊరేగింపులు, తీర్థయాత్రలు, మతపరమైన కార్యక్రమాల సమయంలో ఏర్పడే భారీ జనసమూహాల మధ్య శాంతిభద్రతలను నిర్వహించడం పోలీసులకు ఒక పెద్ద సవాలుగా నిలుస్తుంది. ఇలాంటి సమయాల్లో జనసమూహాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం మహారాష్ట్రలోని పుణెకు చెందిన సాకర్ రోబోటిక్స్ స్టార్టప్ సంస్థ ఏఐ ఆధారిత మొబైల్ టవర్‌ను అభివృద్ధి చేసింది. ఈ ఆవిష్కరణతో ముఖ్యంగా జనసమూహ నియంత్రణ వంటి వివిధ పోలీసు పనులను సులభతరం చేస్తుందని భావిస్తున్నారు. ఇటీవల పుణెలో జరిగిన సంత్ తుకారాం మహరాజ్, సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ ఉత్సవాల్లో దీనిని విజయవంతంగా పరీక్షించారు. ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో పోలీసులు పడే శ్రమను చూసే ఈ ఏఐ మొబైల్ టవర్‌ను అభివృద్ధి చేసినట్లు సాకర్ రోబోటిక్స్ తెలిపింది. ట్రాఫిక్ నియంత్రణకు కూడా దీనిని ఉపయోగించుకోవచ్చని చెప్పింది. భవిష్యత్‌లో ఈ టవర్లను డ్రోన్‌లకు అనుసంధానించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించింది.
ఏఐ టవర్ ప్రత్యేకతలు
దీనిని 4 మీటర్ల ఎత్తు వరకు పెంచవచ్చు. జనసమ్మర్థ ప్రాంతాల్లో ఉంచితే దానికి అమర్చిన ఏఐ కెమెరాల ద్వారా అక్కడ ఎంత మంది ఉన్నారో కనిపెడుతుంది. అనుమానాస్పద వ్యక్తులు, ప్రమాదకరమైన ఆయుధాలను కూడా గుర్తించి అప్రమత్తం చేస్తుంది. దీని సాఫ్ట్‌వేర్‌ను పోలీసులు నేరచరిత్ర కలిగిన వ్యక్తుల డేటాబేస్‌తో అనుసంధానం చేసుకునే అవకాశం ఉంది. ఒక వేళ నిందితుల ముఖాలు సరిపోలితే వెంటనే కంట్రోల్ రూమ్‌కు అలర్ట్ మెసేజ్‌ను పంపిస్తుంది. జన సమూహాల్లో ప్రజలకు సూచనలు చేసేందుకు ఇందులో అనౌన్స్‌మెంట్ మైక్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ టవర్‌ను ఎక్కడికైనా సులభంగా తరలించవచ్చు. అనంతరం కొద్ది నిమిషాల్లోనే అది పని చేసేలా సిద్ధం చేయవచ్చు. ఒకసారి పూర్తి ఛార్జింగ్ పెడితే దాదాపు 25 నుంచి 30 గంటల పాటు ఇది నిరంతరాయంగా పని చేస్తుంది. బ్యాటరీని కూడా సులువుగా మార్చుకునే వీలును కల్పించారు. ఏఐ కెమెరాలు దీని ప్రత్యేకత.
"గత సంవత్సరం ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాకు భారీ జనం వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో పోలీసు బలగాలు ఎంతటి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయో నేను చూశాను. ఆ తర్వాత వారి సవాళ్లను అర్థం చేసుకోవడానికి నేను పోలీసు అధికారులతో మాట్లాడను. దీంతో జన సమూహ నియంత్రణలో సహాయపడటానికి ఏఐని ఉపయోగించి ఒక సాంకేతికతను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాను. పోలీసులతో సంప్రదించిన తర్వాత మా బృందం కేవలం ఐదు నెలల్లోనే ఈ టవర్‌ను తయారు చేసింది. ఈ టవర్‌లో ఏఐ- సామర్థ్యం గల కెమెరాలు, అత్యాధునిక సాఫ్ట్‌వేర్, ప్రజలకు ప్రకటనలు చేయడానికి ఒక సౌండ్ సిస్టమ్ అమర్చాం. ఈ మొత్తం వ్యవస్థ బ్యాటరీ శక్తితో నడుస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ టవర్ 25 నుంచి 30 గంటల పాటు నిరంతరాయంగా పనిచేయగలదు. అంతేకాకుండా అవసరమైనప్పుడు బ్యాటరీని సులభంగా మార్చుకోవచ్చు, రీఛార్జ్ చేసుకోవచ్చు.
--కరణ్ పాటిల్, సాకర్ రోబోటిక్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ
భవిష్యత్తులో ఈ టవర్‌లో డ్రోన్‌లు, ఇతర అధునాతన సాంకేతిక ఫీచర్లను అనుసంధానించేందుకు ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని కరణ్ పాటిల్ తెలిపారు. ఈ టవర్‌ను నగరంలోని వివిధ కూడళ్లలో ఏర్పాటు చేయడం ద్వారా ట్రాఫిక్ నిర్వహణ చేయవచ్చని వివరించారు. పుణె గణేశోత్సవం, అంబేడ్కర్ జయంతి లాంటి కార్యక్రమాలతో పాటు పెద్ద సమావేశాలు, వివిధ మత, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల సమయంలో ఈ ఏఐ ఆధారిత మొబైల్ టవర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
తండ్రి ప్రాణాల్ని కాపాడిన 9ఏళ్ల కొడుకు- బాలుడి తెలివికి బ్రేవరీ అవార్డుకు సిఫార్సు!
తాత టైమ్‌లో భూవివాదంపై పోరాటం- మనవడి హయాంలో దక్కిన న్యాయం- 59 ఏళ్ల తర్వాత కేసు విజయం!

