ETV Bharat / bharat

ఖమేనీ మృతికి వ్యతిరేకంగా కశ్మీర్‌లో నిరసనలు- 444 విమానాలు రద్దు చేసిన కేంద్రం!

ఇజ్రాయెల్‌-అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం- ఆయన హత్యకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్‌లో నిరసనలు- పశ్చిమాసియా ఉద్రిక్తతలు నేపథ్యంలో పలు విమానాలు రద్దు

Protests Against Killing Khamenei In Jk
Protests Against Killing Khamenei In Jk (PTI screengrab)
author img

By ETV Bharat Telugu Team

Published : March 1, 2026 at 9:50 AM IST

3 Min Read
Choose ETV Bharat

Protests Against Killing Khamenei In JK : ఇజ్రాయెల్‌-అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో నిరసనలు జరిగాయి. ఖమేనీ హత్యకు వ్యతిరేకంగా శ్రీనగర్‌ సహా జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో షియా ముస్లింలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వందలాది మంది నిరసనకారులు వీధుల్లో శాంతియుతంగా కవాతు చేశారు. లాల్‌చౌక్ వద్దకు భారీగా చేరుకున్న షియా ముస్లింలు ఖమేనీకి సంతాపం తెలియజేశారు. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మేరకు అధికారులు తెలిపారు.

ఫొటోలు, బ్యానర్ల ప్రదర్శన
ఈ నిరసనల్లో పాల్గొన్నవారు ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ ఫొటోలు, ఇరాన్‌కు మద్దతుగా పోస్టర్లను ప్రదర్శించారు. నల్ల జెండాలను చేత పట్టుకున్నారు. అలాగే సంప్రదాయ సంతాప గీతాలను (నౌహా) ఆలపించారు. "ఈ రోజు (ఆదివారం) మా ప్రియమైన నాయకుడు అలీ ఖమేనీ అమరుడయ్యారు. ఆయనకు శాంతియుతంగా సంతాపం తెలియజేస్తున్నాం." అని ఓ నిరసనకారుడు అన్నాడు. విప్లవాత్మక సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ ఇక లేరని వార్త తెలిసిన నుంచి తామందరం చాలా బాధపడ్డామని మరో నిరసనకారుడు తెలిపాడు. ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దారుణంగా హత్య చేశాయని ఆరోపించాడు. అలాగే, ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన షియా మతాధికారి మౌలానా యూసుబ్ అబ్బాస్ సైతం ఖమేనీ మృతిపై స్పందించారు. తాము బలిదానాలకు భయపడమని తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్‌లకు వారు ఎల్లప్పుడూ గుర్తుంచుకునే విధంగా తగిన సమాధానం ఇస్తామని ఇరాన్ గట్టిగా చెప్పిందని గుర్తు చేసుకున్నారు.

ఇరాన్ జెండా అవనతం
మరోవైపు, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం నేపథ్యంలో దిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన మృతికి సంఘీభావంగా ఇరాన్ జెండాను అవనతం (జెండాను కర్రకు సగం ఎత్తులో ఎగరెయ్యడం) చేసింది. ఈ విధంగా తమ దేశాధినేతకు నివాళులర్పించింది. కాగా, ఇజ్రాయెల్, అమెరికా కలిసి చేసిన దాడుల్లో ఖమేనీ మరణించారు. అలాగే ఆయన కూతురు, అల్లుడు, మనవరాలు చనిపోయారు. ఈ విషయాన్ని ఇరాన్‌ మీడియా ఆధివారం ఉదయం ధ్రువీకరించింది. ఖమేనీ మృతికి 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

444 విమానాల రద్దు!
మరోవైపు, పశ్చిమాసియాలో గగనతల ఆంక్షల నేపథ్యంలో భారత పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం (మార్చి 1) 444 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉందని ప్రకటించింది. "ఇరాన్, పశ్చిమాసియాలోని కొన్ని ప్రాంతాలపై గగనతల పరిమితుల కారణంగా ఫిబ్రవరి 28న దేశీయ విమానయాన సంస్థల 410 విమానాలు రద్దు అయ్యాయి. మార్చి 1న 444 విమానాలు రద్దు అయ్యే అవకాశం ఉంది." అని పౌర విమానయాన శాఖ ఎక్స్ పోస్టులో పేర్కొంది.

"ప్యాసింజర్ అసిస్టెన్స్ కంట్రోల్ రూమ్ (PACR) ప్రయాణీకుల సమస్యలను పర్యవేక్షిస్తూ సత్వర పరిష్కారాన్ని అందిస్తుంది. ఫిబ్రవరి 28న ఎయిర్‌సేవా 216 ఫిర్యాదులను అందుకుంది. అదే సమయంలో 105 ఫిర్యాదులను పరిష్కరించాం. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థల సిబ్బంది సాయపడతారు " అని కేంద్ర విమానయాన శాఖ పేర్కొంది.

విమానాశ్రయాల్లో ప్రయాణికులు
మరోవైపు, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విమానాల రద్దవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంబయి విమానాశ్రయంలో ప్రయాణికులు చిక్కుకున్నారు. మరోవైపు, జైపుర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు వెళ్లే రెండు విమానాలు ఆదివారం రద్దయ్యాయి.

ఇండియన్ ఎంబసీ ప్రకటన
మరోవైపు, సౌదీ అరేబియాలో ప్రయాణ అంతరాయాలు ఎదుర్కొంటున్న భారతీయ ప్రయాణికులు వివిధ హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చని రియాద్‌లోని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. "గగనతల మూసివేతలు, విమానాల రద్దు కారణంగా ప్రయాణ అంతరాయాలను ఎదుర్కొంటున్న సౌదీ అరేబియాలోని ఏ భారతీయ ప్రయాణీకుడైనా 24గంటలు అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. భారతీయ ప్రయాణీకులకు సహాయం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివిధ భారతీయ విమానయాన సంస్థలు హామీ ఇచ్చాయి. " అని ఇండియన్ ఎంబసీ తెలిపింది.

పశ్చిమాసియా ప్రాంతంలో ఘర్షణ పరిస్థితుల నేపథ్యంలో ఇండియాలో చిక్కుకున్న ఫారినర్స్ కోసం భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలనుకున్నవారు, వీసా పొడిగింపు వంటి సహాయం అవసరమైన విదేశీయులు ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసును(FRRO) సంప్రదించాలని స్పష్టం చేసింది. సంబంధిత ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసు వారికి సహాయం చేస్తుందని పేర్కొంది.