ETV Bharat / bharat

SIR ఒక కుట్ర- తక్షణమే ఉపసంహరించుకోవాలి: ప్రకాశ్​రాజ్ డిమాండ్

అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించొద్దని ప్రకాశ్ రాజ్ డిమాండ్- ఆధార్‌ వంటి పత్రాలున్నా అనుమానంతో చూడటం సరికాదన్న ప్రకాశ్‌రాజ్‌- ఆరు నెలల పాటు అభ్యంతరాలు, అప్పీళ్లకు అవకాశం ఇవ్వాలని నిరసనకారుల డిమాండ్‌

Prakash Raj On SIR
నటుడు ప్రకాశ్ రాజ్ (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : September 1, 2026 at 8:07 PM IST

3 Min Read
Choose ETV Bharat

Prakash Raj On SIR : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్​ఐఆర్)పై కర్ణాటకలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియను నటుడు ప్రకాశ్ రాజ్​ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎస్​ఐఆర్​ను ఓ కుట్రగా అభివర్ణించారు. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశ పౌరులుగా ఓటు హక్కు కలిగిన వారు ప్రతిసారీ తమ అర్హతను నిరూపించుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బెంగళూరులోని ఫ్రీడమ్‌ పార్క్‌లో 'యాంటీ-ఎస్‌ఐఆర్‌ కర్ణాటక' వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఎలక్షన్‌ కమిషన్‌ ఛలో' కార్యక్రమంలో పాల్గొన్న ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

'ఆధార్ సహా అవసరమైన గుర్తింపు పత్రాలు ఉన్నప్పటికీ పౌరులను అనుమానంతో చూడటం సరికాదు. మేం దొంగలం కాదు. మేము కూడా ఈ దేశ పౌరులం. మా హక్కుల కోసం పోరాడుతున్నాం. భారత్‌ మా ఇల్లు. మేం ఇక్కడే పుట్టాం. మళ్లీ ఈ దేశానికి చెందిన వారమని నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది' అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. అంతకుముందు బెంగళూరులోని విజయనగర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నరసింహయ్య కాలనీలోని ఓ పోలింగ్‌ బూత్‌ను ప్రకాశ్‌రాజ్‌ సందర్శించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలతో మాట్లాడారు. ఈ సవరణ ప్రక్రియ ప్రజల గౌరవం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించారు.

'నా ఓటు కూడా తొలగించారు'
దాదాపు 1.5 కోట్ల మంది కన్నడిగులు ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ప్రకాశ్​రాజ్ ఆరోపించారు. తాను కూడా ప్రభావితమైన వారిలో ఉన్నానని చెప్పారు. అక్రమంగా ఓటర్ల జాబితాలో చేరిన పేర్లను తొలగించడంపై తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే చట్టబద్ధంగా ఓటు హక్కు కలిగి, ఇప్పటికే ఓటర్లుగా ఉన్న వారి పేర్లను ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే ఓటర్లుగా ఉన్నవారు మరోసారి తమ అర్హతను ఎందుకు నిరూపించుకోవాలి అని ప్రకాశ్ రాజ్ నిలదీశారు. ఎస్​ఐఆర్​ను రద్దు చేసి ఓటర్లు జాబితా సవరణను అందరికీ అందుబాటులో ఉండేలా ఎవరూ అనవసరంగా ఓటు హక్కు కోల్పోని విధంగా నిర్వహించాలని కోరారు.

'ఎస్‌ఐఆర్‌ ఎందుకు? ఎవరి ఆదేశాలతో?'
ఎస్​ఐఆర్​ను ఇంత అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రకాశ్​ రాజ్ ప్రశ్నించారు. ఈ ప్రక్రియను ప్రారంభించింది ఎవరు? దాని వెనక ఉన్న కారణాలేంటి? అనే విషయాల్లో పూర్తి పారదర్శకత ఉండాలని డిమాండ్ చేశారు. బంగాల్​లో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ, అక్కడ ఎన్నికల సిబ్బంది పేర్లు కూడా ఓటర్ల జాబితాలో లేకుండా పోయినట్లు ఆరోపణలు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. 'షిఫ్టెడ్‌', 'డెడ్‌', 'అదర్స్‌' వంటి వర్గీకరణల ఆధారంగా ఓటర్లను తొలగించడంపైనా ఆయన ప్రశ్నలు సంధించారు.

నటుడు కిశోర్‌ కూడా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ఉద్దేశంతో అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటక జనశక్తి రాష్ట్ర అధ్యక్షుడు నూర్‌ శ్రీధర్‌ కూడా పలు డిమాండ్లు చేశారు. ఓటర్ల పేర్ల తొలగింపుపై అభ్యంతరాలు, అప్పీళ్లు దాఖలు చేసేందుకు కనీసం ఆరు నెలల సమయం ఇవ్వాలని కోరారు. జాబితా నుంచి పేర్లు తొలగించబడిన వారికి అవసరమైన పత్రాలు సమర్పించి, తమ పేర్లను తిరిగి చేర్చుకునే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

నిరసన కార్యక్రమానికి రావాలని ఎన్నికల సంఘం ప్రతినిధులను ఆహ్వానించినప్పటికీ వారు అక్కడికి రాలేదు. దీంతో ఆందోళనకారులు ఎన్నికల సంఘం కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నటుడు ప్రకాశ్‌రాజ్‌, నటుడు కిశోర్‌, కర్ణాటక జనశక్తి రాష్ట్ర అధ్యక్షుడు నూర్‌ శ్రీధర్‌, దళిత నాయకుడు ఎన్‌. వెంకటేశ్‌తో పాటు రైతు, మహిళా, దళిత, భాషా ఉద్యమాలకు చెందిన పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో బెంగళూరులో ఎస్‌ఐఆర్‌ అంశంపై రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ మరింత వేడెక్కింది.

'ఎకానమీపై మోదీ చేస్తున్న ప్రచారం 'లెట్స్, కెమెరా, ఇన్‌యాక్షన్' అన్నట్లుగా ఉంది'- ప్రధానిపై ఖర్గే ఫైర్

'బీజేపీ, ఓట్ చోరీ ఆయోగ్ వ్యూహాలు మార్చుకుంటూనే ఉంటాయ్​'- మహారాష్ట్ర SIRపై రాహుల్ ఆరోపణలు