ETV Bharat / bharat

"పీఆర్​తో GDP చిత్రాన్ని అందంగా చూపించవచ్చు- కానీ ఆర్థిక వ్యవస్థను కాదు"- మోదీ సర్కార్​పై కాంగ్రెస్ ఘాటు విమర్శలు

మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్​ చంద్ర గార్గ్​ వ్యాఖ్యలను ప్రస్తావించిన కాంగ్రెస్​- మోదీ ప్రభుత్వం​ వాస్తవ జీడీపీ గణాంకాలను పాలిష్ చేసిందని ఎద్దేవా

Jairam Ramesh
Jairam Ramesh (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : September 2, 2026 at 1:33 PM IST

3 Min Read
Choose ETV Bharat

Cong Slams Modi Govt Over GDP : జీడీపీ గణాంకాలపై మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్​ చంద్ర గార్గ్​ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్​ పార్టీ బుధవారం మోదీ సర్కార్​పై విమర్శలు గుప్పించింది. "పీఆర్​ ద్వారా జీడీపీ గణాంకాలను అందంగా మార్చవచ్చేమో కానీ, అసలు ఆర్థిక వ్యవస్థను మార్చలేరు. ఈ విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి" అని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్​ ఎక్స్​ వేదికగా గార్గ్​ మాట్లాడిన వీడియోను పంచుకుంటూ ఈ ఘాటు విమర్శలు చేశారు.

జైరాం రమేశ్ పోస్టు చేసిన వీడియోలో గార్గ్ మాట్లాడుతూ, "గతేడాది జీడీపీని దాదాపు రూ.6 లక్షల కోట్లు తగ్గించి చూపించారు. దీని వల్ల ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు సుమారు 10.3 శాతం పెరిగినట్లు కనిపిస్తోంది. ఒక వేళ గతేడాది జీడీపీని మార్చకుండా అలానే ఉంచి ఉంటే, ప్రస్తుత ధరల ప్రకారం వృద్ధి రేటు కేవలం 2.6 శాతంగా ఉండేది" అని అన్నారు.

ఎంత డబ్బుకొట్టుకున్నా నో యూజ్​!
జైరాం రమేశ్ హిందీలో చేసిన ఈ పోస్టులో మోదీ ప్రభుత్వంపై తనదైన రీతిలో విమర్శలు గుప్పించారు. "మోదీ ప్రభుత్వం, వారి మీడియా ఎంతగా డప్పు కొట్టుకున్నా, అంకెల గారిడీతో సృష్టించిన జీడీపీ వృద్ధి అసలు నిజం త్వరలో బయటపడుతుంది. ఎందుకంటే వారు చెబుతున్న దానికి, సామాన్య ప్రజలు అనుభవిస్తున్న పరిస్థితులకు అస్సలు పొంతన లేదు. మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్​ గార్గ్​ ఇప్పుడు ఈ అబద్ధపు ప్రచారాన్ని బట్టబయలు చేశారు. ఆయన అంచనా ప్రకారం, దేశ నిజమైన జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతం కాదు, కేవలం 2.6 శాతం మాత్రమే. అయితే ఆర్థిక వ్యవస్థ నిజంగా బలంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ బలమైన ఆర్థిక వ్యవస్థ అనేది అబద్ధాల పునాదిపై సృష్టించిన అంకెలను అందంగా చూపించడం ద్వారా రాదు. నిజాన్ని ఒప్పుకోవడం ద్వారానే వస్తుంది. అందువల్ల ప్రభుత్వం మొదట మన అసలు ఆర్థిక పరిస్థితిని అంగీకరించి, ఆ తర్వాత తగు సంస్కరణలు చేపట్టాలి. ఇందుకోసం యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. చిన్న పరిశ్రమలను, ప్రైవేటు పెట్టుబడులను పెంచాలి. ప్రజల ఆదాయం, వస్తువుల కొనుగోళ్లు పెరగాలి. పేద-ధనిక వ్యత్యాసాలు తగ్గాలి. మోదీ ప్రభుత్వం కొద్ది మంది పారిశ్రామికవేత్తలకే కొమ్ముకాయకుండా, మార్కెట్లో అందరికీ సమాన పోటీ ఉండేలా చూడాలని" అని జైరాం రమేశ్ అన్నారు.

పీఆర్​ స్ట్రాటజీలు వద్దు!
"మోదీ ప్రభుత్వం ఒకటి అర్థం చేసుకోవాలి. పీఆర్​ ద్వారా జీడీపీ చిత్రాన్ని అందంగా మార్చవచ్చు. కానీ ఆర్థిక వ్యవస్థను కాదు. ఏ జీడీపీని చూసి ప్రజలందరినీ దీపావళి జరుపుకోవాలని, పటాకులు కాల్చాలని మిస్టర్​ మోదీ కోరుతున్నారో, అదే జీడీపీపై ఆయన ప్రభుత్వంలో పనిచేసిన మాజీ ఆర్థిక కార్యదర్శే తీవ్రమైన ప్రశ్నలు అడుగుతున్నారు" అని జైరాం రమేశ్​ విమర్శించారు.

సామాన్య ప్రజల పరిస్థితి ఇదీ!
ఇక కాంగ్రెస్ మీడియా విభాగం హెడ్​ పవన్​ ఖేరా కూడా మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జీడీపీ గురించి సుభాష్​ గార్గ్ చెప్పిన విషయాలు సామాన్య భారతీయుల నిజ జీవిత పరిస్థితులకు దగ్గరగా ఉన్నాయని అన్నారు. దేశంలో పెరుగుతున్న ధరలు, ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం, పొదుపు తగ్గడం, ఉద్యోగాలు లేకపోవడం, కుటుంబాలపై అప్పుల భారం పెరగడం వంటివి దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. "గార్గ్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు దేశానికి స్పష్టమైన సమాధానం చెప్పాలి. గతేడాది జీడీపీ అంకెలను ఎందుకు తగ్గించారు? అంకెలను ఎందుకు తారుమారు చేస్తున్నారు? అసలైన జీడీపీ వృద్ధి ఎంత? అనేది ప్రజలకు తెలియజేయాలి" అని పవన్ ఖేరా ప్రశ్నించారు.

అది అంకెల గారడీ!
ఇంతకు ముందు ప్రభుత్వం విడుదల చేసిన జీడీపీ గణాంకాలను కాంగ్రెస్​ 'అంకెల గారడీ'గా అభివర్ణించింది. మోదీ ప్రభుత్వం 'మేక్ ఇన్ ఇండియా' సాధించింది చాలా తక్కువ. కానీ వారి సొంత పథకమైన 'ఫేక్ ఇన్ ఇండియా' మాత్రం నిరంతరాయంగా సాగుతోందని ఎద్దేవా చేసింది.

వచ్చే 10ఏళ్లలో 100 కొత్త విమానాశ్రయాలు- రూ.30 వేల కోట్లతో నిర్మాణం: రామ్మోహన్ నాయుడు

ఆయుర్వేదంలోనూ AI- వీఆర్, సిమ్యులేటర్లతో మెడికల్ స్టూడెంట్స్‌కు క్లాసులు- సంప్రదాయ గ్రంథాలు డిజిటలైజ్