పంట వ్యర్థాలపైనే బంగాళాదుంప సాగు- దిగుబడి అదుర్స్- జీరో టిల్లేజ్‌తో తగ్గిన ఖర్చు
రైతన్నకు ‘జీరో టిల్లేజ్’ నేర్పిన పాఠం- పంట వ్యర్థాలపైనే బంగాళాదుంప సాగుతో భారీ దిగుబడి- సాగు వ్యయం రూ.1200, రూ.10వేల దాకా రాబడి వచ్చే ఛాన్స్- వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకున్న రైతు విజేంద్ర చౌదరి

Published : January 18, 2026 at 6:34 PM IST
Potato Cultivation On Crop Wastes : వరి, గోధుమ లాంటి పంటల వ్యర్థాలు పనికిరావు అని రైతులు భావించేవారు. పంట చేతికొచ్చాక వాటికి కాల్చేసేవారు. దీనివల్ల వాయుకాలుష్యం పెరిగిపోయేది. కానీ దున్నకం లేని (జీరో - టిల్లేజ్) పంటసాగు పద్ధతి అందుబాటులోకి వచ్చాక చాలామంది రైతులకు అసలు విషయం బోధపడింది. పంటల వ్యర్థాలూ తదుపరి పంటకు ప్రయోజనకరంగా పనికొస్తాయని గ్రహించారు. ఈ కోవకు చెందిన ఓ రైతు తన పొలంలోని వరి పంట వ్యర్థాలపైనే బంగాళాదుంపలను పండించి తోటి రైతులందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఎరువులు, విత్తనాలు, డ్రిల్ యంత్రం అద్దె వంటి మూడు ఖర్చులతోనే పంటసాగును ఆయన పూర్తి చేశారు. ఎండిపోయిన వరి కాండాలపై నేరుగా విత్తనాలు, ఎరువులను చల్లి బంగాళాదుంప సాగు చేస్తున్న ఆ రైతును మనమూ కలుద్దాం.
అలా పరిచయమైంది
బిహార్‌లోని నలంద జిల్లా కుకుర్‌బర్ గ్రామం అది. 55 ఏళ్ల విజేంద్ర చౌదరి, 40 ఏళ్ల యశోదా కుమారి దంపతులకు ప్రధాన జీవనాధారం వ్యవసాయం. వారిది మధ్యతరగతి కుటుంబం. విజేంద్ర ఇద్దరు పిల్లల్లో ఒకరు టెన్త్, మరొకరు ఇంటర్ చదువుతున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలనే తాపత్రయం విజేంద్ర దంపతులకు మొదటి నుంచీ ఉండేది. వ్యవసాయంలో ఎల్లప్పుడూ ఏదో ఒకటి కొత్తగా చేసేందుకు ప్రయత్నించేవారు. ఈక్రమంలో 2016 సంవత్సరంలో వారు బిహార్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ‘జీవికా గ్రూప్’లో చేరారు. దాని నుంచి ఆర్థిక సహాయాన్ని పొందారు. ఆర్థిక అక్షరాస్యతను సాధించారు. ఇటీవలే రాష్ట్రంలోని రాజ్‌గిర్ పట్టణంలో నిర్వహించిన రైతు శిక్షణా శిబిరానికి కూడా విజేంద్ర దంపతులు హాజరయ్యారు. అక్కడే వారికి జీరో టిల్లేజ్ టెక్నిక్ పరిచయమైంది.
జీరో టిల్లేజ్ : ఏమిటి ? ఎందుకు ?
జీరో టిల్లేజ్ అనేది ఒక వ్యవసాయ పద్ధతి. ఈ పద్ధతిలో పొలాన్ని దున్నరు. పొలంలోని పంట వ్యర్థాలను తొలగించరు. నేరుగా పొలంలోని పంట వ్యర్థాల మీదుగానే విత్తనాలు, ఎరువులను చల్లుతారు. ఇందుకోసం ఒక ప్రత్యేక డ్రిల్ యంత్రాన్ని ఉపయోగిస్తారు. దీనివల్ల నేల కోత జరగదు. నేలలోని తేమ అలాగే నిలిచి ఉంటుంది. నేలసారం దెబ్బతినదు. వ్యవసాయ కూలీల ఖర్చులు ఉండవు. దున్నకం ఛార్జీలు ఉండవు. ఇంధన ఖర్చులు ఉండవు. నీటి అవసరం తగ్గిపోతుంది. విత్తనాలకు రక్షణ కల్పించే పైకప్పులా పంట వ్యర్థాలను వినియోగంలోకి తేవచ్చు. పంట వ్యర్థాల కింద ఉండటం వల్ల విత్తనాలకు తగినంత తేమ, ఉష్ణోగ్రత లభిస్తాయి. పొలంలో కలుపు మొక్కల పెరుగుదలకు అవకాశాలు తగ్గుతాయి.
ఆశ్చర్యపోయారు, ప్రశ్నించారు, మందలించారు
రాజ్‌గిర్ పట్టణంలో వ్యవసాయ నిపుణుల నుంచి జీరో టిల్లేజ్ టెక్నిక్ గురించి తెలుసుకున్నాక విజేంద్ర చౌదరి, యశోదా కుమారి దంపతుల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. స్వగ్రామం కుకుర్‌బర్‌కు తిరిగొచ్చాక, వాళ్లు జీరో టిల్లేజ్ టెక్నిక్‌లో పంటసాగుకు శ్రీకారం చుట్టారు. అప్పటికే తన పొలంలో ఉన్న వరిపంట వ్యర్థాలను అలాగే వదిలేశారు. జీరో టిల్లేజ్ డ్రిల్ యంత్రాన్ని అద్దెకు తీసుకొని, 1361 చదరపు అడుగుల (0.03124426 ఎకరాలు) విస్తీర్ణంలోని పొలంలో 30 కిలోల బంగాళాదుంప విత్తనాలను విత్తించారు. వరిపంట వ్యర్థాల మీదుగా విత్తనాలు, ఎరువులను చల్లే ప్రక్రియను పూర్తి చేశారు.
విత్తనాలను మట్టితో కాకుండా 10 అంగుళాల వరి గడ్డితో కప్పారు. ఇదంతా చూసి పరిసర పొలాల రైతులు ఆశ్చర్యపోయారు. ఇలా ఎందుకు చేస్తున్నావ్ అంటూ విజేంద్ర చౌదరిని ప్రశ్నించారు. పంట వ్యర్థాలను తొలగించకుండానే విత్తనాలను విత్తితే ఎలా అని మందలించారు. కానీ విజేంద్ర ఇవేవీ పట్టించుకోలేదు. పంట వ్యర్థాలు తదుపరి పంటకు కంపోస్ట్ కట్ చేస్తే, ఇప్పుడు విజేంద్ర చౌదరికి చెందిన పొలం పచ్చని బంగాళాదుంప మొక్కలతో కళకళలాడుతోంది. చాలా బంగాళాదుంప మొక్కలు పువ్వులు పూసే దశకు చేరాయి.
బంగాళాదుంప సాగులో ఈ ఫలితాన్ని సాధించడానికి పంట సీజన్‌లో ఇప్పటివరకు తాను రూ.1200 మాత్రమే ఖర్చు పెట్టానని విజేంద్ర చౌదరి తెలిపారు. దున్నకం ఛార్జీలు లేకపోవడం, వ్యవసాయ కూలీల ఖర్చులు లేకపోవడం అనే అంశాలు పంటసాగు వ్యయాన్ని తగ్గించాయన్నారు. తాను ఒకేఒకసారి మొక్కలకు స్ప్రేతో నీటిని అందించానని చెప్పారు. పంట చేతికొచ్చాక, పొలంలోని వరిపంట వ్యర్థాలు కుళ్ళిపోయి కంపోస్ట్‌గా మారుతాయన్నారు. ఈ కంపోస్ట్ తదుపరి పంటకు సేంద్రీయ ఎరువులా ప్రయోజనాన్ని అందిస్తుందని ఆయన వివరించారు.
సాగు వ్యయం రూ.1200 - రూ.10వేల దాకా రాబడి
"నేను ఈసారి 1361 చదరపు అడుగుల (0.03124426 ఎకరాలు) విస్తీర్ణంలో 30 కిలోల బంగాళాదుంప విత్తనాలు వేశాను. నాకు 6 క్వింటాళ్ల బంగాళాదుంప దిగుబడి వచ్చే అవకాశం ఉంది. 1 క్వింటాలు బంగాళాదుంప ధర రూ.1600 దాకా ఉంది. ఈ లెక్కన నాకు రూ.10వేల దాకా చేతికొస్తాయి. పంట సాగు వ్యయం రూ.1200 మాత్రమే. జీరో టిల్లేజ్ టెక్నిక్ వల్ల పంట వ్యర్థాలను కాల్చాల్సిన అవసరం తప్పుతుంది. వాటిని సద్వినియోగంలోకి తేవచ్చు" అని రైతు విజేంద్ర చౌదరి తెలిపారు.

