ETV Bharat / bharat

అగ్నివీర్‌లు, ఆర్మీ సిబ్బందికి రిటైరయ్యాక రైల్వేలో జాబ్స్- రైల్వే శాఖ, ఆర్మీ ‘ఫ్రేమ్ వర్క్’

భారత రైల్వేశాఖతో భారత ఆర్మీ జట్టు- రిటైర్ అయ్యే అగ్నివీర్‌లు, ఆర్మీ సిబ్బందికి రైల్వేశాఖలోని ఉద్యోగ అవకాశాలపై అవగాహనా కార్యక్రమాలు

Railway Jobs for EX Army Person
Railway Jobs for EX Army Person (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : February 27, 2026 at 9:36 AM IST

3 Min Read
Choose ETV Bharat

Railway Jobs for EX Army Person : అగ్నివీర్‌‌లు భారత ఆర్మీ నుంచి రిటైరయ్యాక ఉద్యోగ అవకాశాలను కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇందుకోసం భారత రైల్వేశాఖతో భారత ఆర్మీ జట్టు కట్టింది. రైల్వే శాఖ, ఆర్మీ కలిసి సహకార ముసాయిదా (ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ కోఆపరేషన్)‌ను అమల్లోకి తెచ్చాయి. ఇందులో భాగంగా రిటైర్డ్ అగ్నివీర్‌లు, ఆర్మీ సిబ్బందికి రైల్వేశాఖలో ఉద్యోగ అవకాశాల కల్పన జరగనుంది. రిటైర్ అయ్యే అగ్నివీర్‌లు, ఆర్మీ సిబ్బందికి రైల్వేశాఖలోని ఉద్యోగ అవకాశాలపై అవగాహనా కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్ లైన్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తేనున్నారు. ఈమేరకు వివరాలతో రైల్వేశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఎక్స్ - అగ్నివీర్లకు అదనపు కోటా
ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ కోఆపరేషన్‌లో భాగంగా మాజీ ఆర్మీ సిబ్బందికి రైల్వేశాఖలోని లెవల్-2, అంతకంటే ఎక్కువ స్థాయి పోస్టుల్లో 10శాతం రిజర్వేషన్లను అమలు చేస్తారు. రైల్వేలోని లెవల్-1 పోస్టుల్లో మాజీ సైనిక సిబ్బందికి 20 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. అయితే ఎక్స్ - అగ్నివీర్‌లకు లెవల్-2, అంతకంటే ఎక్కువ స్థాయి పోస్టుల్లో అదనంగా 5 శాతం, లెవల్ -1 పోస్టుల్లో అదనంగా 10 శాతం కేటాయిస్తామని రైల్వేశాఖ వెల్లడించింది. లెవల్-1 స్థాయి పోస్టులను ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డీ పోస్టులు అని కూడా పిలుస్తారు. లెవల్-1, లెవల్-2 , అంతకంటే పెద్దస్థాయి పోస్టుల భర్తీ రైల్వే రిక్రూట్‌మెంట్ సెంటర్లు, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల ద్వారా జరుగుతుంది. ఇందుకోసం ఉద్యోగ పరీక్షలను, ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.

పాయింట్స్‌మెన్లుగా మాజీ ఆర్మీ సిబ్బందికి అవకాశాలు
రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ పూర్తయ్యే వరకు వేగవంతమైన భర్తీలు చేసేందుకుగానూ మాజీ ఆర్మీ సిబ్బందిని కాంట్రాక్టు ప్రాతిపదికన పాయింట్స్‌మెన్‌గా నియమించుకుంటామని రైల్వేశాఖ వెల్లడించింది. ఇందుకోసం సంబంధిత భారత ఆర్మీ సంస్థలతో 9 రైల్వే డివిజన్లు అవగాహనా ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకున్నాయని తెలిపింది. ప్రస్తుతం 5వేలకుపైగా లెవల్-1 రైల్వే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ రైల్వే జోనల్, డివిజనల్ స్థాయుల్లో జరుగుతోందని పేర్కొంది. రైల్వేశాఖలో ఏర్పడే వివిధ ఖాళీలను భర్తీ చేసే అంశంపై ఇకపై భారత ఆర్మీకి చెందిన నియామక సంస్థలతో రైల్వే డివిజన్లు కలిసి పనిచేస్తాయని స్పష్టం చేసింది. 2024, 2025 సంవత్సరాల్లో మొత్తం 14,788 రైల్వే పోస్టులను మాజీ సైనిక సిబ్బంది కోసం రిజర్వ్ చేశామని చెప్పింది. వీటిలో 6,485 లెవల్-1 పోస్టులు, 8,303 లెవల్-2, అంతకంటే పెద్దస్థాయి పోస్టులు ఉన్నాయని పేర్కొంది.

రైల్వేశాఖ, ఆర్మీ కీలక ఎంఓయూ
‘‘భారత రైల్వే, భారత ఆర్మీలోని సిబ్బందికి ఉమ్మడిగా కొన్ని విలువైన నైపుణ్యాలు ఉంటాయి. వారు క్రమశిక్షణగా పనిచేస్తారు. సాంకేతిక అవగాహనా సామర్థ్యాలు ఉంటాయి. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. దేశ నిర్మాణానికి దోహదపడాలనే వైఖరిలో వారిలో ఉంటుంది. ఆర్మీ నుంచి రిటైరయ్యే సైనికుల వయసు తక్కువగానే ఉంటుంది. వారికి అద్భుతమైన నిర్వాహక, పర్యవేక్షక అనుభవం ఉంటుంది. అందుకే ఆర్మీ సిబ్బంది, అగ్నివీర్‌లు రిటైరయ్యాక ఉద్యోగ అవకాశాలను కల్పించే విషయంలో కలిసి పనిచేయాలని రైల్వేశాఖ, భారత ఆర్మీ నిర్ణయించాయి. పరస్పరం నైపుణ్యాలను పంచుకునే అంశంపై ఇరువిభాగాలు గుజరాత్‌లోని వడోదరలో ఉన్న గతిశక్తి విశ్వవిద్యాలయంతో అవగాహనా ఒప్పందాలను (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. భారత మాజీ సైనికుల సామర్థ్యాన్ని దేశ మౌలిక సదుపాయాల బలోపేతం కోసం, భద్రతా సమన్వయం కోసం వినియోగించాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. రైల్వే శాఖ నిర్మిస్తున్న ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు, ఉధమ్‌పూర్ - శ్రీనగర్ - బారాముల్లా రైల్ లింక్ వంటివి సైనిక మోహరింపులో, వాణిజ్యంలో దేశానికి వేగాన్ని అందిస్తాయి ’’ అని రైల్వేశాఖ తెలిపింది.