NCERT బుక్ వివాదంపై ప్రధాని మోదీ అసహనం: పీఎంవో వర్గాలు
ఎన్సీఈఆర్టీ పుస్తకం వివాదం వేళ- వీటన్నింటినీ ఎవరు పర్యవేక్షిస్తున్నారు?- ఎవరినైనా బాధ్యులను చేశారు?- ప్రధాని మోదీ ప్రశ్నించినట్లు సమాచారం!

Published : February 26, 2026 at 8:27 PM IST
PMO Not Happy Over NCERT Book Issue : ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పుస్తకంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, ఆ సంస్థపై (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) తీరుపై ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ వర్గాలు ఈటీవీ భారత్‌కు తెలిపిన వివరాల ప్రకారం, "మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ ఈ విషయంపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. 8వ తరగతి విద్యార్థులకు న్యాయవ్యవస్థలో అవినీతి గురించి మనం ఏం బోధిస్తున్నాం? వీటన్నింటినీ ఎవరు పర్యవేక్షిస్తున్నారు? దీనికి సంబంధించి ఎవరినైనా బాధ్యులను చేశారా?" అని మోదీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఆ పుస్తకంపై నిషేధం
న్యాయవ్యవస్థలో అవినీతి సంబంధించిన అంశాలు ఉన్న ఈ పాఠ్యపుస్తకంపై సుప్రీంకోర్టు పూర్తిస్థాయి నిషేధం విధించింది. ఈ పుస్తకం భౌతిక ప్రతులన్నింటినీ సీజ్ చేయాలని, డిజిటల్ రూపంలో ఉన్న కంటెంట్‌ను కూడా తొలగించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
కేంద్రం స్పందన ఇదే!
సుప్రీంకోర్టు ఆదేశాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. "మేను న్యాయవ్యవస్థను గౌరవంతో చూస్తాం. న్యాయస్థానం ఏం చెప్పినా అది మాకు శిరోధార్యం. దానిని పూర్తిగా అమలు చేస్తాం. జరిగిన దానికి నేను ఎంతగానో విచారిస్తున్నాను. ఈ విషయం నా దృష్టికి రాగానే, వెంటే ఆ పుస్తకాలన్నింటినీ ఉపసంహరించుకోవాలని, పంపిణీ చేయకుండా చూడాలని ఎన్సీఈఆర్టీని ఆదేశించాను. న్యాయవ్యవస్థను అవమానించాలనే ఉద్దేశం మాకు లేదు. ఈ ఘటనను మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. దీని విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుుకుంటాం. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తాం" అని తెలిపారు.
క్షమాపణలు చెప్పిన ఎన్సీఈఆర్టీ
న్యాయవ్యవస్థపై తమకు అత్యంత గౌరవం ఉందని, రాజ్యాంగాన్ని, ప్రాథమిక హక్కులను కాపాడేది న్యాయవ్యవస్థేనని ఎన్సీఈఆర్టీ పేర్కొంది. ఈ పొరపాటు పూర్తిగా అనుకోకుండా జరిగిందని, ఆ అధ్యాయంలో అనుచిత అంశాలను చేర్చినందుకు విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెబుతున్నామని పేర్కొంది.
"నిర్ణీత ప్రక్రియ ప్రకారం 2026 ఫిబ్రవరి 24న 8వ తరగతి కోసం 'ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్, వాల్యూమ్ 2' అనే సామాజిక శాస్త పుస్తకాన్ని తీసుకువచ్చాం. అయితే అందులో 4వ అధ్యాయం 'ది రోల్ ఆఫ్ జ్యుడీషియరీ ఇన్ అవర్ సొసైటీ' ఛాప్టర్ (పేజీలు 125-142)లో కొన్ని అనుచితమైన అంశాలు, పొరపాట్లు దొర్లినట్లు మేము గమనించాం. విద్యాశాఖ కూడా దీనిని గుర్తించి, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ పుస్తకం పంపిణీని నిలిపివేయాలని ఆదేశించింది. ఇది పూర్తిగా అనుకోకుండా జరిగిన పొరపాటు. ఇందుకు మేము క్షమాపణలు చెబుతున్నాం."
- ఎన్సీఈఆర్టీ
రాజ్యాంగబద్ధమైన సంస్థల అధికారాన్ని ప్రశ్నించే ఉద్దేశం తమకు లేదని ఎన్సీఈఆర్టీ స్పష్టం చేసింది. ఈ అంశంపై సమీక్ష నిర్వహించి, సంబంధిత అధికారులతో సంప్రదించి ఆ అధ్యాయాన్ని తిరిగి రాస్తామని చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి సవరించిన పుస్తకాలను అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. సంస్థాగత పవిత్రతను కాపాడతామని పునరుద్ఘాటిస్తూ ఎన్సీఈఆర్టీ మరోసారి క్షమాపణలు చెప్పింది.
బాధ్యులను గుర్తించే పనిలో!
ప్రస్తుతం ఈ పొరపాటు ఏ దశలో జరిగిందనే అంశంపై ఎన్సీఈఆర్టీ ఆరా తీస్తోంది. ముఖ్యంగా పాఠ్యపుస్తకాల తయారీలో అనుసరించిన ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఈ వివాదాస్పద అంశాన్ని పాఠ్యపుస్తకంలో చేర్చడానికి బాధ్యులైన వ్యక్తులను గుర్తించే పనిలో కౌన్సిల్ నిమగ్నమైంది.
"ఈ తప్పుడు నిర్ణయానికి దారితీసిన పుస్తక తయారీ ప్రక్రియను ఎన్సీఈఆర్టీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. దానికి బాధ్యులైన వారిని కూడా గుర్తిస్తున్నాం. భవిష్యత్‌లో ఇలాంటి అనుచిత ఘటనలు పునరావృతం కాకుండా చూడడమే మా లక్ష్యం. ఈ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం" అని అధికారిక వర్గాలు తెలిపాయి.
NCERT వివాదం- బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం: కేంద్ర విద్యాశాఖ మంత్రి
'కుట్రదారులకు శిక్ష పడాలి- ఆ కాపీలను వెంటనే జప్తు చేయాలి'- NCERT వివాదంలో కేంద్రంపై సీజేఐ ఫైర్

