ETV Bharat / bharat

'ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'- ప్రధాని మోదీ సూచనలు

దాహంతో ఉన్నవారికి తమవంతుగా సహాయం అందించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి- డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని సూచన

PM Modi on Heat Wave
PM Modi on Heat Wave (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 27, 2026 at 12:55 PM IST

3 Min Read
Choose ETV Bharat

PM Modi on Heat Wave : దేశవ్యాప్తంగా రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వడగాల్పుల ప్రభావం వల్ల దైనందిన జీవితాల్లో ఇబ్బందులు పెరుగుతున్నాయని, డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలని ఎక్స్‌ వేదికగా తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లొద్దన్నారు. ఖాళీ దొరికితే కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలన్నారు. ప్రజలు తగినంత నీళ్లు తాగుతూ ఉండాలని బయటకు వెళ్లేటప్పుడు తమవెంట నీళ్లు తీసుకెళ్లాలని మోదీ సూచించారు. వీలైతే దాహంతో ఉన్నవారికి తమవంతుగా సహాయం చేయాలని కోరారు. బాటసారుల కోసం ఇళ్లు, దుకాణాల బయట తాగునీరు ఏర్పాటు చేస్తున్న వారిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు.

"దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతున్నాయి. దీంతో పాటు రోజువారీ జీవితంలో వేడి కారణంగా ఎదురయ్యే అనేక ఇబ్బందులు కూడా పెరుగుతున్నాయి. పౌరులందరూ సాధ్యమైనన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. దయచేసి తగినంత నీరు తాగండి. మీ ఇళ్ల నుంచి బయటకు వెళ్లేటప్పుడు మీతో నీటిని తీసుకెళ్లండి. వీలైతే దాహంతో ఉన్న ఎవరికైనా ఒక గ్లాసు నీరు ఇవ్వండి. ఎవరైనా తాగడానికి వీలుగా తమ ఇళ్ల, దుకాణాల బయట కుండల్లో నీళ్లు ఉంచే వారిని కూడా నేను అభినందిస్తున్నాను."

--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బయట పనిచేసేవారు తీవ్రమైన వేడికి ముఖ్యంగా గురయ్యే అవకాశం ఉందని ప్రధాని మోదీ హెచ్చరించారు. వడదెబ్బ హెచ్చరిక సంకేతాలను ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదని, అది త్వరగా ప్రమాదకరంగా మారవచ్చని అన్నారు. వేడిమితో బాధపడుతున్న వారికి సహాయపడాలని, వారికి ఉపశమనం కలిగించేలా నీరు, ఓఆర్ఎస్ మొదలైనవి అందేలా చూడాలని కూడా మోదీ పౌరులను కోరారు. "తల తిరగడం, వికారం లేదా తీవ్రమైన అలసట వంటి వడదెబ్బ లక్షణాల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఉన్నవారిలో ఎవరైనా అనారోగ్యంగా, నీరసంగా అనిపిస్తే లేదా తలనొప్పి వస్తే, వారిని వెంటనే చల్లని, నీడ ఉన్న ప్రదేశానికి తరలించి సహాయపడండి." అని ఆయన అన్నారు. వడగాలుల సమయంలో వీలైనప్పుడల్లా వృద్ధులైన తల్లిదండ్రులు, తాతామామ్మలు, ప్రియమైన వారికి ఫోన్ చేసి వారి యోగక్షేమాలు తెలుసుకోవాలని ప్రధానమంత్రి పౌరులను కోరారు.

ఈ కఠినమైన వాతావరణంలో పక్షులు, జంతువులను కూడా గుర్తుంచుకోవాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. "ఈ తీవ్రమైన వేడిలో మన చుట్టూ ఉన్న పక్షులు, జంతువులను కూడా గుర్తుంచుకుందాం. మీ ఇల్లు, బాల్కనీలు, టెర్రస్‌లు, దుకాణాలు లేదా కార్యాలయాల బయట ఉంచిన ఒక చిన్న గిన్నెడు నీరు దాహంతో ఉన్న పక్షికి ప్రాణదాత కాగలదు. ఈ కష్టకాలంలో కరుణ మనకు మార్గదర్శకం కావాలి." అని ప్రధాని మోదీ అన్నారు.

భారత వాతావరణ శాఖ ప్రకారం, దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు సంభవిస్తున్నాయి. రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల పాటు మధ్య, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు వడగాలుల నుంచి తీవ్రమైన వడగాలుల పరిస్థితుల్లో కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలుల పరిస్థితులు నెలకొనగా, తూర్పు ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్‌లోని అక్కడక్కడా కూడా తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్, హరియాణ, రాజస్థాన్, బిహార్, ఒడిశా, తెలంగాణ సహా తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా వడగాలుల పరిస్థితులు నమోదయ్యాయి. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని బండాలో 47.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మైదాన ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటితే హీట్​వేవ్​గా ప్రకటిస్తారు; అదే ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే వాటిని 'తీవ్రమైన వడగాలులు'గా వర్గీకరిస్తారు.

ఎస్‌ఐఆర్‌ నిర్వహించేందుకు ఈసీకి పూర్తి అధికారం ఉంది: సుప్రీంకోర్టు

ఉగాండా నుంచి వచ్చిన మహిళకు ఎబోలా? బెంగళూరులో ఐసోలేషన్- వ్యాక్సిన్ తయారు చేసిన రష్యా!