ETV Bharat / bharat

నేడు దేశవ్యాప్తంగా HPV వ్యాక్సినేషన్ ప్రారంభించనున్న మోదీ- ఏడాదికి 1.15 కోట్ల మంది బాలికలకు టీకాలు

దేశవ్యాప్తంగా శనివారం HPV వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ- రాజస్థాన్‌లోని అజ్​మేర్​ వేదికగా వ్యాక్సినేషన్‌ షురూ- దేశవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ

PM Modi Launch HPV Vaccine
PM Modi Launch HPV Vaccine (Getty Images, ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : February 28, 2026 at 7:04 AM IST

3 Min Read
Choose ETV Bharat

PM Modi Launch HPV Vaccine : భారత మహిళా ఆరోగ్య రంగంలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ప్రాణాంతకమైన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం ఉద్దేశించిన దేశవ్యాప్త హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ శనివారం రాజస్థాన్‌లోని అజ్​మేర్ వేదికగా ప్రారంభించనున్నారు. దేశంలోని ఆడబిడ్డల భవిష్యత్తును సురక్షితం చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం, ఆరోగ్య సంరక్షణలో భారత్ వేస్తున్న అతిపెద్ద ముందడుగు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏటా 1.15 కోట్ల మంది బాలికలకు టీకా
ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా సుమారు 1.15 కోట్ల మంది 14 ఏళ్ల వయస్సు గల బాలికలకు టీకాలు వేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ డ్రైవ్ ప్రారంభం కానుంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వస్థ నారి' విజన్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ప్రైవేట్ మార్కెట్‌లో వేల రూపాయల ఖరీదు చేసే ఈ టీకాను, ప్రభుత్వం పూర్తి ఉచితంగా అందిస్తోంది. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ టీకా లభిస్తుంది. నిర్దేశిత కేంద్రాల్లో రోజూ టీకాలు వేయించుకోవచ్చు. మొదటి మూడు నెలల పాటు ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తారు. ఈ 90 రోజుల కాలంలో అర్హులైన బాలికలకు రోజూ టీకా వేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత, ఇది దేశవ్యాప్త సాధారణ రోగనిరోధక షెడ్యూల్‌లో చేర్చుతారు.

తల్లిదండ్రుల అనుమతితోనే టీకాలు
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌లో భాగంగా 'గార్డసిల్ 4' అనే క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్‌ను వేయనున్నారు. ఇది క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్‌పీవీ రకాలు 16, 18తో పాటు, ఇతర వైరల్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత జాతీయ సాంకేతిక సలహా బృందం సిఫార్సుల మేరకు, 14 ఏళ్ల బాలికలకు ఒక్క డోస్ టీకా కూడా సరిపోతుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఈ టీకా కార్యక్రమాన్ని శిక్షణ పొందిన మెడికల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. టీకా వేసిన తర్వాత తలెత్తే సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్ కేంద్రాలను అత్యవసర సదుపాయాలున్న ఆసుపత్రులతో అనుసంధానించారు. అయితే తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుంచి 'ఇన్ఫార్మ్డ్ కన్సెంట్' తీసుకున్న తర్వాతే టీకా ఇస్తారు.

ఎందుకు ఈ టీకా అత్యవసరం?
దేశంలోని మహిళల్లో సంభవిస్తున్న క్యాన్సర్ మరణాల్లో గర్భాశయ క్యాన్సర్ రెండో అతిపెద్ద కారణం. 2022 గ్లోబోకాన్ డేటా ప్రకారం, భారత్‌లో ఏటా 1.2 లక్షల కొత్త కేసులు నమోదవుతుండగా, సుమారు 80,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గర్భాశయ క్యాన్సర్‌ను టీకా, ముందస్తు స్క్రీనింగ్ ద్వారా 100శాతం నివారించవచ్చని మెజారిటీ ప్రజలకు తెలియకపోవడమే ఈ మరణాలకు ప్రధాన కారణం. ఈ అంతరాన్ని పూడ్చేందుకే ప్రభుత్వం ఈ జాతీయ స్థాయి ప్రచారాన్ని చేపట్టింది. ఈ మరణాలను అడ్డుకోవడానికి వ్యాక్సినేషన్, ముందస్తు పరీక్షలే ఏకైక మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 50 కోట్ల డోస్‌ల హెచ్‌పీవీ వ్యాక్సిన్ విజయవంతంగా పంపిణీ చేశారు. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఫోగ్సీ (FOGSI) పూర్తి మద్దతు తెలిపాయి. ఇప్పటికే 30,000 మంది వైద్యులకు ఈ టీకా కౌన్సెలింగ్‌పై శిక్షణ ఇచ్చారు.

టీకా సరఫరాలో ఎటువంటి కొరత రాకుండా ఉండేందుకు గ్లోబల్ వ్యాక్సిన్ అలయన్స్ సహకారంతో ప్రభుత్వం ముందే తగినన్ని డోసులను సేకరించింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు వారి జనాభా ప్రాతిపదికన టీకా డోసులను సరఫరా చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు ఈ కార్యక్రమంపై పూర్తి అవగాహన కల్పించారు.