ETV Bharat / bharat

మోదీ అధ్యక్షతన CCS సమావేశం- పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చ

భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ- తమిళనాడు, పుదుచ్చేరిల్లో రెండ్రోజుల పర్యటన తర్వాత దిల్లీకి ప్రధాని- అనంతరం సేవా తీర్థ్‌లో సీసీఎస్‌ భేటీ

CCS Meeting PM Modi
CCS Meeting PM Modi (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : March 1, 2026 at 7:31 PM IST

|

Updated : March 2, 2026 at 7:03 AM IST

2 Min Read
Choose ETV Bharat

CCS Meeting PM Modi : పశ్చిమ ఆసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ-CCS చర్చించింది. రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరిలో రెండు రోజుల పర్యటన తర్వాత రాత్రి తొమ్మిదిన్నర గంటలకు దిల్లీ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను ఈ భేటీలో సమీక్షించారు. CCS సభ్యులు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శులు PK మిశ్రా, శక్తికాంతదాస్‌, CDS అనిల్‌ చౌహాన్‌, కేబినెట్‌ కార్యదర్శి సోమనాథన్‌, విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్త్రీ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, భారత్‌పై వాటి ప్రభావాన్ని ఉన్నతాధికారులు ఈ భేటీలో వివరించినట్లు సంబంధితవర్గాలు తెలిపాయి. పశ్చిమాసియాలోని భారతీయుల భద్రత, దుబాయ్‌, దోహా, ఆ ప్రాంతంలోని ఇతర విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన వారితోపాటు పరిస్థితులు మరింత విషమిస్తే ఎలా వ్యవహరించాలనే అంశంపై ప్రధానంగా చర్చించారు. ఈ మేరకు ఫిబ్రవరి 28న ఇరాన్‌లో సహా ఇతర అనేక గల్ఫ్ దేశాల్ల జరిగిన దాడులతో తదనంతరం పరిస్థితిపై CCS చర్చించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ ప్రవాస సమాజం భద్రతపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ ప్రాంతానికి రవాణా చేసే భారతీయ ప్రయాణికులు, షెడ్యూల్డ్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చర్చించింది. అలాగే ప్రాంతీయ భద్రత, ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలపై విస్తృత ప్రభావాలను కూడా CCS సమీక్షించింది. ఈ పరిణామాల వల్ల ప్రభావితమైన భారతీయ పౌరులకు సహాయం చేయడానికి అవసరమైన సాధ్యమయ్యే చర్యలు తీసుకోవాలని సంబంధిత అన్ని విభాగాలను ఆదేశించింది. శత్రుత్వాలను త్వరగా నిలిపివేసి చర్చలు దౌత్యానికి తిరిగి రావాలని పేర్కొంది.

దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలకు సీసీఎస్‌
దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలను క్యాబినెట్ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ (సీసీఎస్‌) సమావేశంలో తీసుకుంటారు. ఈ కేబినెట్​కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించగా హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సభ్యులుగా ఉన్నారు. ఇంకా పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అంతకుముందు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే క్యాబినెట్ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ (CCS) సమావేశమైంది.

గగనతలం మూసివేతతో భారత్ అప్రమత్తం
సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలలోని బహ్రెయిన్, కువైట్, ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. దుబాయ్, అబుదాబి, సౌదీ అరేబియా, దోహా, మనామాపై కూడా దాడులు చేస్తోంది. ఖమేనీ మృతికి కచ్చితంగా ప్రతీకారం ఉంటుందని ఇప్పటికే హెచ్చరించిన ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ అమెరికా, ఇజ్రాయెల్‌ బేస్‌లపై దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే దాడులను తీవ్రతరం చేసింది. మిడిల్‌ ఈస్ట్‌లోని 27 అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్నట్లు ఇరాన్‌ సైన్యం తెలిపింది. అటు ఇజ్రాయెల్​ కూడా దాడులు చేస్తుండండంతో పశ్చిమాసియాలోని గగనతలం దాదాపు మూతపడింది. ఈ క్రమంలోనే భారత్​ అప్రమత్తమైంది.

Last Updated : March 2, 2026 at 7:03 AM IST