ETV Bharat / bharat

అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్‌లా కాంగ్రెస్ మారింది: విపక్షపార్టీపై మోదీ ఫైర్

విపక్ష పార్టీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ ప్రధాని నరేంద్ర మోదీ- పుదుచ్చేరి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ స్పీడ్ బ్రేకర్‌లా మారిందని ఆరోపణలు

PM Modi
PM Modi (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : March 1, 2026 at 1:24 PM IST

3 Min Read
Choose ETV Bharat

PM Modi Puducherry Visit : పుదుచ్చేరి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ స్పీడ్ బ్రేకర్‌లా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి, నేరాలు, పేదరికంతో ప్రజలు బాధపడ్డారని విమర్శించారు. ఇప్పుడు తమ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ పుదుచ్చేరి వృద్ధికి మరింత ఊపునిస్తుందని తెలిపారు. మునుపటి కాంగ్రెస్-డీఎంకే పాలనలో పుదుచ్చేరి ప్రజలు అపారమైన కష్టాలను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పుదుచ్చేరిలో రాజకీయ అస్థిరత ఏర్పడిందని అన్నారు. అవినీతి ఆరోపణలు, నేరాలు పెరిగిపోయాయని దుయ్యబట్టారు. పేదలను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. పుదుచ్చేరి జరిగిన ఓ సభలో మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

పుదుచ్చేరికి రావడం గౌరవంగా ఉంది : ప్రధాని మోదీ
"నేను ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఉత్తమ (బెస్ట్) పుదుచ్చేరి అనే మంత్రాన్ని ఇచ్చాను. ఉత్తమం అంటే వ్యాపారం, విద్య, ఆధ్యాత్మికత, పర్యాటకం అన్ని రంగాల్లో దూసుకెళ్లాలి. గత నాలుగున్నరేళ్లలో పుదుచ్చేరిలో ఈ దార్శనికత కనిపిస్తోంది. పుదుచ్చేరి సుపరిపాలన, అభివృద్ధిని చూసింది. కేంద్రం, యూటీ ఒకే దార్శనికత, అంకితభావంతో పనిచేసినప్పుడు ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. పుదుచ్చేరిలో ఉండటం గౌరవంగా ఉంది. ఇది సిద్ధ సాధువులు, కవులు, స్వాతంత్ర్య సమరయోధుల భూమి. ఇక్కడి నుంచే సుబ్రమణ్య భారతి జాతీయవాద జ్వాలను రగిలించారు. శ్రీ అరబిందో ప్రపంచానికి కొత్త ఆధ్యాత్మిక దృక్పథాన్ని ఇచ్చారు" అని తెలిపారు.

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రికార్డు స్థాయిలో రూ. 12 లక్షల కోట్లు కేటాయించామని మోదీ తెలిపారు. దీనివల్ల పుదుచ్చేరి ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. గతంలో రాష్ట్రాలకు మాత్రమే అందుబాటులో ఉండే మూలధన పెట్టుబడి పథకం (స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌)లో పుదుచ్చేరిని చేర్చామని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలకు ఎక్కువ నిధులు అంటే మెరుగైన రోడ్లు, నీటి సరఫరా, తీరప్రాంత మౌలిక సదుపాయాలు, పాఠశాలలు, ఆస్పత్రులు వంటి అనేక ప్రాజెక్టులని నిధులు కేటాయించడమేనని పేర్కొన్నారు. ఈ సౌకర్యాలు ప్రజల జీవితాలను నేరుగా మెరుగుపరుస్తాయని వెల్లడించారు.

'పుదుచ్చేరి తలసరి ఆదాయం పెరిగింది'
కేంద్రం, పుదుచ్చేరి సర్కార్ కలిసి ఒకే లక్ష్యంతో పనిచేయడం వల్ల పుదుచ్చేరి మంచి పాలన, అభివృద్ధిని చూసిందని మోదీ అభిప్రాయపడ్డారు. "కేంద్రం, యూటీ ఒకే దార్శనికత, అంకితభావంతో పనిచేసినప్పుడు ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. పుదుచ్చేరి తలసరి ఆదాయంలో అద్భుతమైన పెరుగుదలను చూపించింది. డబుల్ ఇంజిన్ సర్కార్ పుదుచ్చేరి వృద్ధికి మరింత సాయం అందిస్తోంది. పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. కొత్త లెక్చర్ హాళ్లు, బాలికల హాస్టల్, ఇతర సౌకర్యాలు విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఆయుష్మాన్ భారత్ పథకం ఇప్పటికే కోట్లాది కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణను అందిస్తోంది. పుదుచ్చేరి వైద్య పర్యాటక కేంద్రంగా మారగలదని విశ్వసిస్తున్నాను. ఇక్కడ ఇప్పటికే తొమ్మిది వైద్య కళాశాలలు ఉన్నాయి. ఈవీలు మన జీవితంలో కీలక భాగమైపోయాయి. పుదుచ్చేరి వంటి పర్యాటక కేంద్రంలో ఎలక్ట్రిక్ బస్సులు కాలుష్యాన్ని తగ్గించడంలో గేమ్ ఛేంజర్ కావచ్చు" అని మోదీ పేర్కొన్నారు.

పుదుచ్చేరిలో గ్రామీణ, పట్టణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని మోదీ స్పష్టం చేశారు. విద్యార్థులు, రైతులు, వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేలా వందల కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. పుదుచ్చేరి పట్టణంలో రద్దీని తగ్గించడానికి రూ.140 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్‌ నిర్మించినట్లు పేర్కొన్నారు. అలాగే మరో రూ.1,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రకటించారు. పుదుచ్చేరి ఇప్పటికే వేలాది మంది పర్యాటకులకు వీకెండ్ ట్రిప్‌లకు ఆకర్షిస్తుందని కొనియాడారు. ఆధ్యాత్మిక, పర్యావరణ, పర్యాటక రంగంలో మరిన్ని పెట్టుబడులతో ఈ ప్రాంతం కొత్త శిఖరాలను అధిరోహించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, మోదీ పుదుచ్చేరిలో రూ.2700 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. వాటిని జాతికి అంకితం చేశారు. అలాగే మరికొన్ని కొత్త పనులకు శంకుస్థాపన చేశారు.