నెతన్యాహు, UAE అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన మోదీ- పౌరుల రక్షణ అత్యంత ప్రాధాన్యమని స్పష్టం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన- UAEపై ఇరాన్ దాడులను ఖండించిన ప్రధాని నరేంద్ర మోదీ

Published : March 2, 2026 at 7:16 AM IST
PM Modi Speaks to Netanyahu : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాంతీయ భద్రత, పౌరుల రక్షణ అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక దేశాధినేతలతో వరుసగా ఫోన్ సంభాషణలు జరిపారు. ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులపై చర్చించి, ఘర్షణలు త్వరగా ముగియాలని భారత్ తరఫున స్పష్టం చేశారు.
శాంతి దిశగా చర్యలు చేపట్టాలన్న మోదీ
ముందుగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియాలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై భారత్ ఆందోళనలను వ్యక్తం చేశారు. ముఖ్యంగా యుద్ధ వాతావరణంలో సాధారణ ప్రజలే ఎక్కువగా నష్టపోతారని, కాబట్టి పౌరుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అలాగే శత్రుత్వ చర్యలను వీలైనంత త్వరగా నిలిపివేసి శాంతి దిశగా చర్యలు చేపట్టాలని పునరుద్ఘాటించారు.
Spoke with President of the UAE, my brother Sheikh Mohamed bin Zayed Al Nahyan. Strongly condemned the attacks on the UAE and condoled the loss of lives in these attacks. India stands in solidarity with the UAE in these difficult times.
— Narendra Modi (@narendramodi) March 1, 2026
Thanked him for taking care of the Indian…
ఈ విషయాన్ని మోదీ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో వెల్లడించారు. "ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితులపై చర్చించాం. తాజా పరిణామాలపై భారత ఆందోళనను తెలియజేశాం. పౌరుల రక్షణ అత్యంత ముఖ్యమని చెప్పాం. శత్రుత్వానికి త్వరగా ముగింపు పలకాలి" అని ఆయన పేర్కొన్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడితో మోదీ ఫోన్
ఇదిలా ఉండగా, అమెరికా– ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై క్షిపణి దాడులు చేపట్టిన తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ప్రతీకారంగా ఇరాన్ పలు ప్రాంతాలపై దాడులు చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణి దాడులు జరగడంతో అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో కూడా మోదీ ఫోన్‌లో మాట్లాడారు. యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. కష్టకాలంలో యూఏఈకి భారత్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Had a telephone call with PM Benjamin Netanyahu to discuss the current regional situation. Conveyed India's concerns over recent developments and emphasised the safety of civilians as a priority. India reiterates the need for an early cessation of hostilities.@netanyahu
— Narendra Modi (@narendramodi) March 1, 2026
యూఏఈలో లక్షలాది మంది భారతీయులు నివసిస్తున్న నేపథ్యంలో వారి రక్షణకు ఆ దేశ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ధన్యవాదాలు తెలిపారు. "భారతీయుల భద్రతకు తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి భారత్ మద్దతిస్తుంది" అని మోదీ పేర్కొన్నారు.
గత రెండు రోజులుగా యూఏఈపై ఇరాన్ జరిపిన దాడుల్లో ముగ్గురు మృతి చెందగా, దాదాపు 58 మంది గాయపడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో ఒక భారతీయుడు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో భారత రాయబార కార్యాలయం అప్రమత్తమై, అక్కడి భారతీయులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తోంది. అవసరమైన సహాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఇక దేశ భద్రతా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం కూడా సమీక్ష చేపట్టింది. ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పశ్చిమాసియా పరిణామాలు, భారత ప్రయోజనాలు, విదేశాల్లోని భారతీయుల భద్రత, చమురు సరఫరాలు, వ్యూహాత్మక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రాంతీయ ఉద్రిక్తతలు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపవచ్చో సమగ్రంగా విశ్లేషించారు.
పశ్చిమాసియాలో శాంతి భద్రతలు క్షీణిస్తే గ్లోబల్ మార్కెట్లపై, ముఖ్యంగా చమురు ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ, అవసరమైతే తక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొత్తం మీద పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత్ సమతుల్య దౌత్య విధానాన్ని అవలంబిస్తోంది. అన్ని పక్షాలతో సంభాషణలు కొనసాగిస్తూ శాంతి, స్థిరత్వం కోసం కృషి చేస్తోంది. ఘర్షణలు కాకుండా చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం కనుగొనాలని భారత్ స్పష్టమైన సందేశం ఇస్తోంది. ప్రాంతీయ శాంతి, పౌరుల రక్షణే తమ ప్రధాన లక్ష్యమని ప్రధాని మోదీ తాజా సంభాషణలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

