ప్రపంచ శాంతి స్థాపనలో ప్రధాని మోదీ కీలక పాత్ర : ఉక్రెయిన్ రాయబారి
రాజ్‌కోట్‌లో జరిగిన వైబ్రెంట్ గుజరాత్ రీజినల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఉక్రెయిన్ రాయబారి- ప్రధాని మోదీ, భారత్‌ను ఉద్దేశించి డాక్టర్ ఒలేక్సాండర్ పొలిష్‌చుక్ కీలక వాఖ్యలు

Published : January 11, 2026 at 8:52 PM IST
Ukrainian ambassdor on PM Modi : ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉక్రెయిన్ రాయబారి ఒలేక్సాండర్ పొలిష్‌చుక్ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కీలక వాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పడంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. రాజ్‌కోట్‌లో జరిగిన 'వైబ్రెంట్ గుజరాత్ రీజినల్ కాన్ఫరెన్స్'లో ఆయన ఈ మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రాంతీయ స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన తీరు అద్భుతమని ఒలేక్సాండర్ కొనియాడారు. ప్రాంతీయ నాయకుడిగా, తర్వాత జాతీయ నాయకుడిగా ఎదిగి, ప్రస్తుతం ప్రపంచ వేదికపై శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
రష్యాతో యుద్ధం నడుస్తున్న క్లిష్ట సమయంలో 2024లో ఉక్రెయిన్‌లో పర్యటించిన అతికొద్ది మంది గ్లోబల్ సౌత్ నాయకుల్లో ప్రధాని మోదీ ఒకరని పొలిష్‌చుక్ గుర్తు చేశారు. శాంతి పునరుద్ధరణ ద్వారానే భారత్- ఉక్రెయిన్ మధ్య, ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంతో బలమైన ఆర్థిక సంబంధాలు ఏర్పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2023 నుంచి ఉక్రెయిన్ ఈ గ్లోబల్ ఫోరమ్‌లో భాగస్వామిగా ఉందని, ఇది ఇరు దేశాల మధ్య ఉన్న నమ్మకానికి నిదర్శనమని తెలిపారు. విద్యుత్, ఐటీ, ఇంజనీరింగ్, వ్యవసాయం, విద్య, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ఉక్రెయిన్ కంపెనీలు భారత సంస్థలతో చర్చలు జరుపుతున్నాయని వివరించారు.
'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా రక్షణ రంగంలో సాంకేతిక సహకారాన్ని విస్తరించుకోవాలని భావిస్తున్నట్లు పొలిష్‌చుక్ తెలిపారు. యుద్ధం తర్వాత ఉక్రెయిన్ పునర్నిర్మాణంలో భారతీయ వ్యాపారవేత్తలు భాగస్వాములు కావాలని, ఈ ఏడాది జరగబోయే 'ఉక్రెయిన్ రికవరీ కాన్ఫరెన్స్'కు రావాలని ఆయన ఆహ్వానించారు. 'మా దేశంలో శాంతి నెలకొనడం వల్ల భారత్-ఉక్రెయిన్ మధ్య ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంతో సంబంధాలు మరింత బలపడతాయన్న మాకు నమ్మకం ఉంది. ఈ విషయంలో అంతర్జాతీయ శాంతి ప్రయత్నాలకు భారత్ అందిస్తున్న మద్దతు, ఆర్థిక సహకారం, అభివృద్ధికి ఒక స్థిరమైన పునాదిని సృష్టిస్తుందని మేం ఆశిస్తున్నాం' అని ఒలేక్సాండర్ పొలిష్‌చుక్ తెలిపారు.
ఈ ఏడాదిలోనే భారత్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
ఈ ఏడాది చివర్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భారతదేశాన్ని సందర్శించే అవకాశం ఉందని ఒలేక్సాండర్ పొలిష్‌చుక్ వెల్లడించారు. వైబ్రెంట్ గుజరాత్ సదస్సు వ్యాపార ప్రాజెక్టులు, సహకారంపై చర్చించడానికి తమకు ఒక గొప్ప వేదిక అన్నారు. ఈ ఏడాది జెలెన్‌స్కీ పర్యటనలో భారత్- ఉక్రెయిన్ సంయుక్తంగా చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి చర్చించే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. మౌలిక సదుపాయాలు, తయారీ రంగం, సాంకేతికత, వాణిజ్యం వంటి రంగాలలో ఇరుదేశాల మధ్య సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ పర్యటన దోహదపడుతుందని ఇరు దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.
రువాండా రాయబారి ప్రశంసలు
సదస్సులో భారత్‌లో రువాండా రాయబారిగా ఉన్న జాక్వెలిన్ ముకాంగిరా కూడా ప్రసంగించారు. భారత్ - రువాండా మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలను ఆమె గుర్తు చేశారు. రువాండాలో భారత్ రెండో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా ఉందని చెప్పుకొచ్చారు. అలాగే, రువాండాకు భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని ఆమె తెలిపారు. వ్యాపార భాగస్వామ్యాలను నిర్మించుకోవడానికి వైబ్రెంట్ గుజరాత్ సదస్సు ఒక విలువైన వేదిక అని ఆమె కొనియాడారు.
ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా భారత్‌లో మాత్రం స్థిరత్వం : ప్రధాని మోదీ
కేరళలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే అంతిమ లక్ష్యం : అమిత్ షా

