బంగాల్‌లో అధికార మార్పు తీసుకురావాలి : ఆ రాష్ట్ర ప్రజలకు మోదీ లేఖ
త్వరలో బంగాల్ అసెంబ్లీ ఎన్నికలు- ఈ నేపథ్యంలో బంగాల్ ప్రజలకు ప్రధాని మోదీ లేఖ- బంగాల్‌లో అధికార మార్పు తీసుకురావాలని పిలుపు

Published : February 23, 2026 at 5:27 PM IST
Modi Letter To West Bengal Citizens : మరికొద్ది నెలల్లో బంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగాల్‌లో అధికార మార్పు తీసుకురావాలని (ప్రభుత్వాన్ని మార్చాలని) ప్రజలను కోరారు. బంగాల్‌ను 'సోనార్ బంగ్లా'గా మారుస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు బంగాల్ ప్రజలకు నరేంద్ర మోదీ సోమవారం లేఖ రాశారు. ఈ లెటర్లను బీజేపీ కార్యకర్తలు రాష్ట్ర ప్రజలకు అందించనున్నారు.
"మరికొద్ది నెలల్లో బంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయి. రానున్న తరం భవిష్యత్తు మీరు బాగా ఆలోచించి తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. నేడు 'సోనార్ బంగ్లా' గురించి కలలు కనే ప్రతి యువకుడు, వృద్ధుడు, మహిళలు చాలా బాధలో ఉన్నారు. వారి బాధ నా హృదయాన్ని తాకింది. అందువల్ల నేను నా గుండె లోతుల్లో నుంచి ఒక తీర్మానం చేస్తున్నాను. బంగాల్‌ను వికసిత్ (అభివృద్ధి చెందిన), సంపన్నమైన రాష్ట్రంగా మార్చాలనేది నా సంకల్పం" అని మోదీ లేఖలో పేర్కొన్నారు.
టీఎంసీపై విమర్శలు
గత 11 ఏళ్లుగా దేశ ప్రజల ఆశీర్వాద బలంతో తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రైతుల సంక్షేమం నుంచి యువత కలలను నెరవేర్చడం వరకు, మహిళలను సాధికారపరచడం నుంచి సమాజంలోని ప్రతి వర్గాన్ని చేరుకోవడం వరకు తమ ప్రభుత్వ విధానాలు, నిరంతర ప్రయత్నాల సానుకూల ఫలితాలు నేడు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలో బంగాల్‌లో అధికారంలో ఉన్న టీఎంసీ సర్కార్‌పై మోదీ మండిపడ్డారు.
"బంగాల్ ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోయినా రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మంది ప్రజల చేత 'జన్ ధన్ యోజన' ఖాతాలు ఓపెన్ చేయించాం. 'స్వచ్ఛ భారత్ అభియాన్' కింద రాష్ట్రంలో 85 లక్షల మరుగుదొడ్లు నిర్మించాం. బంగాల్‌ను పాలిస్తున్న టీఎంసీ సర్కార్ పేదల జీవనోపాధిని లాక్కుంటోంది. మేము మాత్రం చిరు వ్యాపారులు, వ్యవస్థాపకులకు రూ.2.82 లక్షల కోట్ల విలువైన రుణాలు అందించాం. 'అటల్ పెన్షన్ యోజన' కింద 56 లక్షల మంది సీనియర్ సీటిజెన్స్‌కు ఊరట కల్పించాం. 'ఉజ్వల యోజన' ద్వారా కోటి కుటుంబాలకు ఎల్‌పీజీ కనెక్షన్‌లను అందించాం. తద్వారా మాతృమూర్తులు, సోదరీమణులను పొగ నుంచి విముక్తి కల్పించాం."
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
అన్నదాతల ముఖాల్లో చిరునవ్వులు నింపాం!
బంగాల్ రైతులు దేశం మొత్తానికి ఆహారం సరఫరా చేస్తున్నారని, కానీ తమ కుటుంబాలను పోషించడానికి వారు కష్టపడుతున్నారని మోదీ అన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో 'కిసాన్ సమ్మాన్ నిధి' ద్వారా 52 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం చేస్తున్నామని అన్నారు. తద్వారా అన్నదాతల ముఖాల్లో చిరునవ్వులు నింపడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. "బంగాల్ దేశ ఆర్థిక వ్యవస్థ దిశను నిర్ణయించేది. పారిశ్రామిక అభివృద్ధిలో అగ్రగామిగా ఉండేది. కానీ నేడు ఈ అద్భుతమైన రాష్ట్రం దీనావస్థను చూసి నా మనసు బాధపడుతోంది. 6 దశాబ్దాల బుజ్జగింపు రాజకీయాల కారణంగా బంగాల్‌కు జరిగిన కోలుకోలేని నష్టాన్ని మాటల్లో వ్యక్తపరచలేం. ఓ వైపు యువత ఉపాధి లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తుంది. మరోవైపు రాష్ట్రంలోని మహిళలు తమకు భద్రత లేదని భావిస్తున్నారు. స్వామి వివేకానంద, రిషి అరబిందో కలలు కన్న బంగాల్ నేడు ఓటు బ్యాంకు రాజకీయాలు, హింస, అరాచకత్వంతో నిండిపోయింది" అని మోదీ పేర్కొన్నారు.
అక్రమ చొరబాట్లు, మహిళలపై హింసతో బంగాల్ మునిగిపోయిందని మోదీ ఆరోపించారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో నేడు జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని, పేదల ముఖాల్లో చిరునవ్వులు వికసించాయని అన్నారు. బంగాల్‌లో కూడా ఈ అభివృద్ధి, పురోగతిని తాను తీసుకొస్తానని తెలిపారు. భరతమాత ముద్దుబిడ్డలు కలలు గన్న బంగాల్‌ను పునర్నిర్మిద్దామని పిలుపునిచ్చారు. 2026 నాటికి రాష్ట్రాన్ని వికసిత్ బంగాల్‌గా మారుస్తామని ప్రమాణం చేద్దామని అన్నారు.
"మీకు సేవ చేసే అవకాశం నాకు లభిస్తే ప్రతి క్షణాన్ని మీ ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అవినీతి నుంచి ప్రజలను విముక్తి చేస్తాను. మహిళల భద్రత కోసం పాటుపడతాను. మన పిల్లలు (బంగాల్ యువత) ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మత హింసకు గురైన మన శరణార్థ సోదర సోదరీమణులు సీఏఏ ద్వారా పౌరసత్వం పొందుతారు" అని మోదీ స్పష్టం చేశారు.

'లంచం, అవినీతే సీఎం అసలైన స్నేహితులు'- స్టాలిన్‌పై విజయ్ ఫైర్
' 'భారత్ ట్యాక్సీ'తో కనీస ఆదాయం'- క్యాబ్ డ్రైవర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన అమిత్ షా

