HPV టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
రాజస్థాన్‌లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ- బాలికల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం

Published : February 28, 2026 at 11:59 AM IST
PM Modi Launched HPV Vaccine : రాజస్థాన్‌లోని అజ్మేర్లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తోపాటు, నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 14, 15 ఏళ్ల బాలికలకు 'గార్డాసిల్' అనే టీకాను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇవ్వనున్నారు. దేశంలో 1.15 కోట్ల మంది బాలికలకు టీకాలు వేయనున్నారు. ఈ సందర్భంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌కు సంబంధించి ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
"దేశంలోని ఆడబిడ్డలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడానికి మేం ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టం. వారు సంపన్నంగా ఉండేలా చూసుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఆ దిశగా రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో HPV టీకా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించాం. గర్భాశయ క్యాన్సర్ నివారణే ఈ వ్యాక్సినేషన్ ముఖ్య ఉద్దేశం"
- మోదీ, భారత ప్రధాని
'స్వస్థ నారి' విజన్‌లో భాగంగా
దేశవ్యాప్త హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ టీకా అమలు అనేది భారత ప్రజారోగ్య ప్రయాణంలో ఒక నిర్ణయాత్మక చర్యను అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వస్థ నారి' విజన్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహించనున్నారు. ఏటా 14 ఏళ్ల వయసు గల సుమారు 1.15 కోట్ల మంది బాలికలకు ఈ వ్యాక్సినేషన్ టీకాలు వేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రత్యేక చొరవ మహిళల ఆరోగ్య సంరక్షణకు తోడ్పుడనుంది. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తారు. మొదట మూడు నెలలు యుద్ధప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అర్హులైన బాలికలకు రోజూ టీకా వేసేలా అధికారులు ఇది వరకే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం, ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్త సాధారణ రోగనిరోధక షెడ్యూల్‌లో చేర్చుతారు.
ఇదిలా ఉండగా, మార్కెట్‌లో వేల రూపాయల ఖరీదు చేసే ఈ వ్యాక్సిన్‌ను, ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో, (ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు), సబ్-డిస్ట్రిక్ట్, జిల్లా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు) అలాగే ప్రభుత్వ వైద్య కళాశాల్లో ఈ టీకా ఉచితంగా అందుబాటులో ఉంటుంది. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుంచి 'ఇన్ఫార్మ్డ్ కన్సెంట్' తీసుకున్న తర్వాతే ఈ వ్యాక్సినేషన్ టీకా ఇవ్వనున్నారు.
వైద్య అధికారుల పర్యవేక్షణలో టీకా కార్యక్రమం
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం శిక్షణ పొందిన వైద్య అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రతి సెషన్లో శిక్షణ పొందిన వైద్య అధికారులు, నైపుణ్యం కలిగిన ఆరోగ్య సంరక్షణ బృందాలు ఉంటాయి. ఇమ్యునైజేషన్ తర్వాత ఏవైనా సమస్యలు తలెత్తితే, తక్షణ వైద్య సహాయం కోసం 24x7 వైద్య సదూపాయాలు అందుబాటులో ఉన్న ఆసుపత్రులతో అనుసంధానించారు. అదేవిధంగా, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది.
మహిళల్లో సంభవిస్తున్న క్యాన్సర్ మరణాల్లో గర్భాశయ క్యాన్సర్ రెండో అతిపెద్ద కారణమని అధికార గణాంకాలు చెబుతున్నాయి. భారత్‌లో ఏటా 1.2 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. ఇందులో భాగంగా సుమారు 80,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని 2022 గ్లోబోకాన్ డేటా చెబుతోంది. అయితే, గర్భాశయ క్యాన్సర్‌ను టీకా, ముందస్తు స్క్రీనింగ్ ద్వారా ఈ సమస్యను 100శాతం మేర నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువమంది ప్రజలకు ఈ విషయం తెలియకపోవడం వల్లనే ఈ ప్రమాదాల బారిన పడుతున్నారని చెబుతున్నారు. అయితే, ఈ మరణాలను అడ్డుకోవడానికి ముందస్తు పరీక్షలే ఏకైక మార్గమని అంటున్నారు.
దేశవ్యాప్తంగా బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సినేషన్- క్యాన్సర్‌కు చెక్ పెట్టేలా కేంద్రం కీలక నిర్ణయం
నేడు దేశవ్యాప్తంగా HPV వ్యాక్సినేషన్ ప్రారంభించనున్న మోదీ- ఏడాదికి 1.15 కోట్ల మంది బాలికలకు టీకాలు

