'ఇకపై హార్డ్‌వేర్ రంగంలోనూ భారత్ సత్తా'- సెమీకండక్టర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
సెమీకండర్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ- రూ.22,516 కోట్లతో ప్లాంట్ ఏర్పాటుచేసిన మైక్రాన్ టెక్నాలజీ

Published : February 28, 2026 at 7:08 PM IST
PM Modi On Semiconductor : గ్లోబల్ టెక్నాలజీ వాల్యూ చైన్‌లో భారత్ వేగంగా భాగం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల వాణిజ్యంలో భారత్ కీలక పాత్ర పోషించబోతుందని మోదీ తెలిపారు. గుజరాత్‌లోని సానంద్‌లో ఏర్పాటు చేసిన మైక్రాన్ టెక్నాలజీ సెమీకండక్టర్ ప్లాంట్‌ను ప్రధాని మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులతో కలిసి ప్లాంట్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో సెమీకండక్టర్ల విప్లవంలో భారత్ పాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
మూడేళ్ల కిందటే కుదిరిన MOU
ఈ ప్లాంట్‌కు సంబంధించిన ఎంవోయూ మూడేళ్ల కిందటే జరిగింది. ఇందులో అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్‌కు చెందిన పనులు జరుగుతాయని మోదీ తెలిపారు. అమెరికాకు చెందిన మైక్రాన్ టెక్నాలజీ రూ. 22 వేల 516 కోట్ల భారీ పెట్టుబడితో ఈ కేంద్రాన్ని నెలకొల్పినట్టు వెల్లడించారు. ఈ ప్లాంట్‌లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కావడం ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల వాణిజ్యంలో భారత్ పాత్రను బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. గత శతాబ్దాన్ని చమురు నియంత్రిస్తే ఈ శతాబ్దాన్ని సెమికండక్టర్లు నియంత్రిస్తాయని అభిప్రాయపడ్డారు.
आज भारत ने semiconductor industry में विश्व के नक्शे पर अपना स्थान बना लिया है। 🇮🇳 pic.twitter.com/oSfJpwipZl
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 28, 2026
'10, 11 ఏళ్ల క్రితం భారత్‌లో 'డేటా', 'చిప్స్' గురించిన చర్చ కేవలం కొన్ని వర్గాలకే పరిమితమైంది. టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నప్పుడు మన చర్చలు ఎక్కువగా ఐటీ సేవల చుట్టూనే తిరిగేవి. కానీ ఈరోజు చూడండి, సాఫ్ట్‌వేర్ రంగానికి పేరుగాంచిన భారత్ ఇప్పుడు 'హార్డ్‌వేర్' రంగంలో కూడా తన ఉనికిని చాటుకుంటూ శక్తిమంతంగా మారుతోంది. ఈరోజు సానంద్‌లో సరికొత్త భవిష్యత్తు ఆవిర్భవించడాన్ని మనం చూస్తున్నాం. మైక్రాన్ సంస్థకు చెందిన ఈ ఏటీఎంపీ ఫెసిలిటీలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం అనేది గ్లోబల్ టెక్నాలజీ వాల్యూ చైన్‌లో భారతదేశ పాత్రను మరింత బలోపేతం చేయనుంది. నేడు భారత్ అత్యంత వేగంగా 'గ్లోబల్ సెమీకండక్టర్ వాల్యూ చైన్'లో అంతర్భాగమవుతోంది' అని మోదీ తెలిపారు.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi inaugurates the Semiconductor Assembly, Test and Packaging (ATMP) facility of Micron Semiconductor Technology India Private Limited in Sanand.
— ANI (@ANI) February 28, 2026
(Source: ANI/DD) pic.twitter.com/nY76Tz9S0r
అప్పుడు చమురు- ఇప్పుడు మైక్రోచిప్
అలాగే ఒకప్పుడు ప్రపంచాన్ని చమురు నియంత్రించేదని, ఇప్పుడు మైక్రోచిప్‌ల కాలం నడుస్తుందని మోదీ అన్నారు. 'ఇది ఏఐ విప్లవ శతాబ్దం. ఈ విప్లవానికి సెమీకండక్టర్ అనేది ఒక వారధిలాగా పని చేస్తుంది. ప్రపంచాన్ని గత శతాబ్దంలో చమురు నియంత్రిస్తే, ఈ శతాబ్దాన్ని సెమీకండక్టర్లు నియంత్రిస్తాయి. ఇది ఆమెరికా- భారత్ మధ్య బలమైన సహకారం, భాగస్వామ్యాన్ని కూడా సూచిస్తుంది. ఇది అత్యంత కీలకమైంది. ముఖ్యంగా AI, చిప్స్ రంగాలలో ఈ రెండు టెక్నాలజీలకు సరఫరా గొలుసులు భద్రపరచడానికి ప్రపంచం మొత్తం కృషి చేస్తోంది. అలాగే ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కూడా ఈ లక్ష్యం కోసం పనిచేస్తున్నాయి. ఏఐ సమ్మిట్ సందర్భంగా అమెరికా- భారత్ మధ్య పాక్స్ సిలికా చొరవ ఈ దిశలో మరొక అడుగు లాంటిదే. మా ఉమ్మడి ప్రయత్నాలు ప్రపంచ ముఖ్యమైన ఖనిజాల సరఫరా గొలుసును మరింత సురక్షితంగా చేస్తాయి. భారతదేశ సెమీకండక్టర్ తయారీ ప్రయాణంలో ఈ ప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది' అని మోదీ అన్నారు.
2023లో శంకుస్థాపన!
కాగా, 2023 సెప్టెంబర్‌లో ఈ ప్లాంట్‌నకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లో మొదటి ప్రతిపాదనగా ఈ ప్రాజెక్ట్‌ను ఆమోదించారు. రూ. 22,500 కోట్లకు పైగా వ్యయంతో దీని నిర్మాణం జరిగింది. ఇది దేశంలో వ్యూహాత్మక సెమీకండక్టర్ పెట్టుబడులను ట్రాక్ చేయడంలో ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత దాదాపు 5 లక్షల చదరపు అడుగుల క్లీన్‌రూమ్ స్పేస్ కలిగి ఉంటుంది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్లీన్‌రూమ్‌లలో ఒకటిగా ఇది మారనుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెమరీ స్టోరేజ్, హై స్పీడ్ పెర్ఫార్మెన్స్ లాంటి సేవలు అందించేందుకు అందుబాటులోకి రానుంది.
'మేడ్ ఇన్ ఇండియా' ఫస్ట్ సెమీకండక్టర్ చిప్- లాంఛ్ ఎప్పుడంటే?
'10 వేల మంది యువతకు శిక్షణ - తైవాన్, జపాన్ తదితర దేశాల్లో ఇంటర్న్‌షిప్'

