'భారత్ యాక్ట్ ఈస్ట్ విధానం మరింత బలోపేతం'- మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ
ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ- తొలుత ఇండోనేషియా రాజధాని జకార్తా చేరుకోనున్న ప్రధాని- ఈనెల 8, 9 తేదీల్లో ఆస్ట్రేలియా, 10,11 తేదీల్లో న్యూజిలాండ్‌లో ప్రధాని పర్యటన

Published : July 6, 2026 at 10:40 AM IST
PM Modi Foreign Tour : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం మూడు దేశాల విదేశీ పర్యటనకు బయలుదేరారు. జులై 6 నుంచి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనతో భారత్ 'యాక్ట్ ఈస్ట్' విధానం, 'మహాసాగర్' విజన్‌తో పాటు స్వేచ్ఛాయుత, సమ్మిళిత ఇండో-పసిఫిక్ ప్రాంతానికి భారత్ కట్టుబాటును మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. తన పర్యటనకు ముందు ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మొదటి విడత ఇండోనేషియాలో
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జులై 6 నుంచి 8 వరకు అక్కడ పర్యటించనున్నారు. 2018లో తన తొలి ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఇరు దేశాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాయని మోదీ గుర్తుచేశారు. అనంతరం 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రబోవో భారత్‌కు రావడం రెండు దేశాల సంబంధాలకు కొత్త ఊపునిచ్చిందన్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే ఇండోనేషియాలోని ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం కానున్నారు. యోగ్యకర్తలోని ప్రసిద్ధ ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని అధ్యక్షుడు ప్రబోవోతో కలిసి సందర్శించనున్నారు.
Over the next few days, I will be attending various programmes in Indonesia, Australia and New Zealand. The aim of these meetings would be to boost economic and strategic cooperation with these valued developmental partners and ensure the youth of our nation get more…
— Narendra Modi (@narendramodi) July 6, 2026
ఆస్ట్రేలియాలో ద్వైపాక్షిక చర్చలు
ఇండోనేషియా పర్యటన అనంతరం ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశానికి వెళ్లనున్నారు. జులై 8,9 తేదీల్లో అక్కడ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో సమావేశమై రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, నైపుణ్యాల మార్పిడి, ప్రజల మధ్య సంబంధాలపై చర్చించనున్నారు. అలాగే అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, కీలక టెక్నాలజీలు, క్రీడలు, క్రీడా శాస్త్రం వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించే అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మెల్‌బోర్న్‌లో భారతీయ ప్రవాసులతో కూడా ప్రధాని ప్రత్యేకంగా సమావేశమవుతారు.
చివరి విడత న్యూజిలాండ్‌లో
పర్యటన చివరి దశలో ప్రధాని మోదీ న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ను సందర్శించనున్నారు. 10,11 తేదీల్లో అక్కడే ఉంటూ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై సమీక్షించనున్నారు. ఈ ఏడాది మార్చిలో లక్సన్ భారత్ పర్యటన అనంతరం ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడిన నేపథ్యంలో తాజా భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, వ్యాపార సంబంధాలను మరింత విస్తరించడంతో పాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) అమలుపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది.
ప్రవాస భారతీయులతో భేటీ
మూడు దేశాల్లోనూ భారతీయ మూలాల ప్రజలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. వివిధ రంగాల్లో విశేషంగా రాణిస్తున్న ప్రవాస భారతీయులు భారత్‌కు, ఆయా దేశాలకు మధ్య వారధిగా నిలుస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. వారితో సమావేశం కావడం పట్ల తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
'మహాసాగర్' విజన్‌కు ప్రాధాన్యం
ఈ పర్యటనలో 'మహాసాగర్' (Mutual and Holistic Advancement for Security Across the Regions) దృష్టికోణానికి కూడా ప్రధాని ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, సమగ్ర అభివృద్ధి, సముద్ర సహకారం, ప్రాంతీయ స్థిరత్వాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై మూడు దేశాల నాయకులతో చర్చలు జరపనున్నట్లు వెల్లడించారు. భారత్ విదేశాంగ విధానంలో 'యాక్ట్ ఈస్ట్' వ్యూహాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఈ మూడు దేశాల పర్యటన కీలక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
బీజేపీ కంచుకోట నుంచి ప్రశాంత్ కిశోర్ పోటీ- 'కొత్త తరహా రాజకీయాలు' తీసుకొస్తానని ప్రతిజ్ఞ

