'దిల్లీలో ఇప్పుడు ఎన్నికలు పెడితే- బీజేపీకి 10 సీట్లు దాటితే రాజకీయాలు వదిలేస్తా'- మోదీకి కేజ్రీవాల్ సవాల్
ఆప్ నేతలపై తప్పుడు కేసులు పెట్టారు- సీబీఐ విచారణ తీరును కోర్టు తప్పుపట్టింది- కోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది- కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

Published : February 27, 2026 at 4:42 PM IST
Kejriwal On Modi : దిల్లీ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. దిల్లీ మద్యం విధానం కేసులో కోర్టు నుంచి ఊరట లభించిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ పార్టీని రాజకీయంగా నశింపజేయాలనే ఉద్దేశంతోనే తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. అంతేకాదు, దిల్లీలో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని, అందులో భారతీయ జనతా పార్టీ 10 సీట్లకంటే ఎక్కువ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
నిజాయతీపై మచ్చ వేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర
శుక్రవారం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్, మద్యం విధానం కేసులో తనతో పాటు ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా, మరికొంతమందికి కోర్టు ఊరట ఇచ్చిందని తెలిపారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసిందన్నారు. "ఇది పూర్తిగా ఫేక్ కేసు. మా నిజాయతీపై మచ్చ వేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసింది" అంటూ కేజ్రీవాల్ మండిపడ్డారు.
#WATCH | Delhi | AAP national convener Arvind Kejriwal says," today, the court in its 600-page order has said that there is not the slightest evidence to even have a case in this matter." https://t.co/wdUFffn0mQ pic.twitter.com/h7qb9xsWZr
— ANI (@ANI) February 27, 2026
రాజకీయాల నుంచి తప్పుకుంటా!
తాను జీవితంలో సంపాదించుకున్నది ఒక్క నిజాయతీ, మంచి పేరు మాత్రమేనని, అదే లక్ష్యంగా చేసుకుని మోదీ, అమిత్ షా దాడి చేశారని ఆరోపించారు. "సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలను ఆయుధాలుగా ఉపయోగించి మమ్మల్ని జైలుకు పంపించారు. నా కుటుంబసభ్యులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన నేరుగా ప్రధానికి సవాల్ విసిరారు. "దిల్లీలో మీకు అంత ప్రజాదరణ ఉంటే వెంటనే ఎన్నికలు పెట్టండి. బీజేపీకి 10 సీట్లు కూడా రావు. అంతకంటే ఎక్కువ వస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను" అని స్పష్టం చేశారు.
కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్న బీజేపీ
కేజ్రీవాల్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం దిల్లీ ప్రజల కోసం పాఠశాలలు, ఆస్పత్రులు, రోడ్లు నిర్మించిందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామని, ఆరోగ్య రంగంలో మోహల్లా క్లినిక్స్ వంటి సేవలు అందించామని గుర్తుచేశారు. "మేం అభివృద్ధి రాజకీయాలు చేశాం. కానీ బీజేపీ మాత్రం కేసులు, కక్షసాధింపు రాజకీయాలు చేస్తోంది" అని విమర్శించారు. దిల్లీలో కాలుష్యం, యమునా నది కాలుష్యం, దెబ్బతిన్న రోడ్లు వంటి సమస్యలపై కూడా ఆయన కేంద్రాన్ని నిలదీశారు.
"మూడుకోట్ల మంది ప్రజలు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాల్సింది పోయి మమ్మల్ని వేధిస్తున్నారు" అని అన్నారు. ఇక కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరుపై కూడా కేజ్రీవాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ విచారణలో లోపాలున్నాయని కోర్టే వ్యాఖ్యానించిందని చెప్పారు. ఇదే విషయంపై సీబీఐ పనితీరును ప్రశ్నించారు. అదేవిధంగా ఈడీ కేసుల్లోనూ ఊరట కోసం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.
ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది: కేజ్రీవాల్
"దేశ ప్రజలకు మోదీ, అమిత్ షా క్షమాపణలు చెప్పాలి. ప్రజలు అధికారాన్ని అభివృద్ధి కోసం ఇచ్చారు గానీ, ప్రతీకార రాజకీయాల కోసం కాదు" అని వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎప్పుడూ ప్రజల మేలు కోసం పనిచేస్తుందని, మాకంటే బాగా పనిచేయాలని బీజేపీని కోరుతున్నామని చెప్పారు. "ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. ప్రజలు మా నిజాయతీని గుర్తిస్తారు. మేం దిల్లీ అభివృద్ధికే కట్టుబడి ఉంటాం" అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
కేసు ఏమిటంటే?
దిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్ 17న మద్యం పాలసీని తీసుకొచ్చింది. 2022 సెప్టెంబరు చివరికి దానిని వెనక్కి తీసుకుంది. ఈ మధ్యలో మద్యం విధానంలో పలు అవకతవకలు జరిగాయని, ఆప్ నేతలు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. ఎక్సైజ్ పాలసీని సవరించేటప్పుడు వీరు అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ, ఈడీలు ఆరోపించాయి. లైసెన్స్‌దారులకు అవసరమైన సాయం చేసి, ప్రతిఫలంగా కొంత మొత్తాన్ని పొందినట్లు దర్యాప్తు సంస్థలు చెప్పాయి. ఈ కుంభకోణంలో భాగంగా దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోదియా, ఇతర ఆప్ నేతలు, మాజీ తెలంగాణ ఎంపీ కవితను అధికారులు అరెస్టు చేశారు. అనంతరం వారు బెయిల్‌పై విడుదలయ్యారు.

