కుప్పకూలిన శిక్షణ విమానం- ఇన్‌స్ట్రక్టర్, ట్రైనీ పైలెట్ దుర్మరణం
టేకాఫ్ అయిన 20 నిమిషాలకు కూలిన శిక్షణ విమానం- నాథపుర్వా గ్రామం వద్ద ఘటన- ప్రమాద స్థలానికి చేరుకుని శకలాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

Published : August 27, 2026 at 2:41 PM IST
Trainer Aircraft Crash Kanpur : ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లోని గంగానది తీరంలో ఓ శిక్షణ విమానం కుప్పకూలగా, ఇన్‌స్ట్రక్టర్‌తో పాటు ఓ ట్రైనీ పైలెట్ ప్రాణాలు కోల్పోయారు. గార్గ్ ఏవియేషన్‌కు చెందిన రెండు ఇంజిన్ల కలిగిన 'టెక్నామ్' శిక్షణ విమానం గురువారం ఉదయం 11.30 గంటలకు కాన్పూర్‌లో టేకాఫ్ అయింది. గాల్లోకి ఎగిరిన 20 నిమిషాలకే కత్రి ప్రాంతంలోని నాథపుర్వా గ్రామం వద్ద గంగానది ఒడ్డున అదుపుతప్పి కుప్పకూలింది.
ప్రమాద ధాటికి నుజ్జునుజ్జు అయిన విమానం
ఈ ప్రమాదంలో గుజరాత్‌కు చెందిన ఇన్‌స్ట్రక్టర్ సచిన్ భాటియా, కర్ణాటకకు చెందిన ట్రైనీ పైలట్ అభిషేక్ పూజారి మృతి చెందారు. మరణించిన ఇన్‌స్ట్రక్టర్ సచిన్ భాటియాకు దాదాపు 3000 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉందని కాన్పూర్ పోలీసులు తెలిపారు. కాగా, ప్రమాదం ధాటికి విమానం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఘటనా స్థలానికి చేరుకుని శకలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ప్రమాద తీరును బట్టి విమానం ఏదైనా వస్తువును ఢీకొన్నట్లు తెలుస్తోందని, అయితే సమగ్ర విచారణ తర్వాతే కచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసు అధికారులు తెలిపారు.
As per preliminary information received, a Tecnam P2006T twin-engine aircraft, bearing registration VT-NBV and operated by M/s Garg Aviation Ltd., Kanpur, met with an accident on the afternoon of 27 August 2026, approximately 5 NM from Kanpur Civil Airport, near Ganga Barrage.… https://t.co/OblyPBwNmF
— ANI (@ANI) August 27, 2026
ప్రమాద స్థలిలో చెల్లాచెదురుగా పడి ఉన్న శకలాలు
ప్రమాద స్థలం నుంచి వచ్చిన వీడియోల్లో ఆ ప్రాంతమంతా శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు కనిపించింది. ప్రమాద సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. భారీ శబ్దాలతో మొదట బాంబు పేలిందేమోనని, తీవ్ర భయాందోళనకు గురయ్యామని తెలిపారు. ప్రమాద సమయంలో పైలట్లు విమానం నుంచి బయటకు రావడానికి ప్రయత్నించారా లేదా అనే విషయాన్ని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు, ప్రమాదానికి గురైన విమానం 2023 నుంచి గార్గ్ ఏవియేషన్ యాజమాన్యంలో ఉంది. అయితే, ఈ విమానంలో నిర్వహణకు సంబంధించిన ఎలాంటి లోపాలు లేవని ఆ సంస్థ పేర్కొంది. ప్రమాదం జరిగిన అనంతరం కమిషనర్ లాల్, అదనపు పోలీస్ కమిషనర్లు విపిన్ తాడా, సంకల్ప్ శర్మ, చీఫ్ ఫైర్ ఆఫీసర్ దీపక్ శర్మ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.
ఘటనపై స్పందించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఇదిలా ఉండగా, విమాన ప్రమాద ఘటనపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. "గంగా బ్యారేజ్ సమీపంలో కాన్పూర్ సివిల్ ఎయిర్‌పోర్ట్‌కు సుమారు 5 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. VT-NBV రిజిస్ట్రేషన్ గల టెక్నామ్ P2006T విమానం గురువారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. ఈ విమానాన్ని కాన్పూర్‌కు చెందిన గార్గ్ ఏవియేషన్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ విమానం కాన్పూర్ సివిల్ ఎయిర్‌పోర్ట్‌లోని లోకల్ ఫ్లయింగ్ ఏరియాలో శిక్షణా విమానయానంలో పనిచేస్తోంది. విమానంలో శిక్షణ పొందుతున్న పైలట్, శిక్షకుడు ఉన్నారు. ప్రమాదంలో ఇద్దరూ మరణించారు" అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి ముగ్గురు అధికారుల బృందం ప్రమాద స్థలాన్ని సందర్శించనుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దర్యాప్తు అనంతరం ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, కారణాలు తెలుస్తాయని తెలిపింది.

