ETV Bharat / bharat

'ఈ గౌరవాన్ని మా దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు'- ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొన్నందుకు భారత్‌కు ఇరాన్ థ్యాంక్స్

భారత్‌పై ఇరాన్ ప్రశంసలు- ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల్లో ఇండియా పాల్గొనడంపై హర్షం- ఈ చర్య ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను తెలియజేస్తోందని వెల్లడి

India Attend Khamenei Funeral
Minister of state for external affairs Pabitra Margherita and Bihar Governor Lieutenant General (Retired) Syed Ata Hasnain represented India at Ayatollah Khamenei's funeral (Photo: x/@Iran_in_India)
author img

By ETV Bharat Telugu Team

Published : July 6, 2026 at 9:35 AM IST

3 Min Read
Choose ETV Bharat

India Attend Khamenei Funeral : ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలలో పాల్గొన్నందుకు భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు ఇండియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. ఈ చర్య ఇరు దేశాల మధ్య ఉన్న లోతైన చారిత్రక, సాంస్కృతిక, మానవ సంబంధాలను ప్రతిబింబిస్తుందని పేర్కొంది. జాతీయ సంతాప సమయంలో ఇరాన్ ప్రజల పట్ల పరస్పర గౌరవం, హృదయపూర్వక సంఘీభావానికి ఇది ఒక శక్తివంతమైన వ్యక్తీకరణగా కూడా నిలిచిందని అభిప్రాయపడింది. ఈ మేరకు భారత్‌లోని ఇరాన్ ఎంబసీ 'ఎక్స్‌'లో పోస్ట్ పెట్టింది.

"ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో భారత ప్రభుత్వం తరఫున హాజరైన అధికారిక ప్రతినిధి బృందానికి ధన్యవాదాలు. ఖమేనీ పార్థీవదేహానికి నివాళులర్పించినందుకు వారికి భారత్‌లోని ఇరాన్ ఎంబసీ హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తోంది. ఖమేనీ అంత్యక్రియలకు భారత రాజకీయ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, మేధావులు, వివిధ మతాల ప్రతినిధులు హాజరు కావడం ఇరు దేశాల మధ్య ఉన్న చిరకాల బంధాన్ని ప్రతిబింబిస్తుంది. భారత్ అందిస్తున్న ఈ స్నేహం, కరుణ, హృదయపూర్వక గౌరవాన్ని ఇరాన్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఇరాన్, ఇండియా మధ్య శాశ్వత సంబంధాలకు ఇది ఒక విలువైన సాధనంగా భావిస్తారు. అలాగే రెండు దేశాల మధ్య చిరకాల స్నేహాన్ని మరింత బలోపేతం చేయడానికి ఒక విలువైన పునాదిగా భావిస్తారు. ఖమేనీ మరణం తర్వాత విషాద సమయంలో ఇరాన్‌కు అండగా నిలిచిన, సానుభూతి తెలిపిన భారతీయ అధికారులు, ప్రముఖులు, పౌరులకు కూడా ధన్యవాదాలు" అని భారత్‌లో ఇరాన్ రాయబార కార్యాలయం పేర్కొంది.

భారత్ నుంచి హాజరయ్యింది ఎవరంటే?
ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో భారత్‌ తరఫున విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా, బిహార్‌ గవర్నర్‌ సయ్యద్‌ అత్‌-హస్నైన్‌లు పాల్గొన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరయ్యారు.

ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చిన ఇరాన్‌కు కృతజ్ఞతలు : ముఫ్తీ
"నేను టెహ్రాన్ నుంచి బయలుదేరుతున్నప్పుడు ఈ తీవ్ర బాధాకరమైన సమయంలో నా ఆలోచనలు ఇరాన్ ధైర్యవంతమైన నాయకత్వం, ప్రజలతో ఉన్నాయ్. మేము ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాం. ఇంతటి దయగల, ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చిన ఇరాన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనడం గౌరవంగా ఉంది" అని మెహబూబా ముఫ్తీ ఎక్స్‌‌లో పోస్ట్‌ పెట్టారు.

'ఇది ఖమేనీ వీడ్కోలు కార్యక్రమం కాదు- ఆయన మార్గంలో నడుస్తామని ప్రతిజ్ఞ'
అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు కేవలం వీడ్కోలు కార్యక్రమం మాత్రమే కాదని, అది ఆయన మార్గంలోనే పయనిస్తామన్న ప్రతిజ్ఞ అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అభిప్రాయపడ్డారు. ఇరాన్, ఇస్లాంల గౌరవం కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన ఖమేనీకి, ఆయన కుటుంబ సభ్యులకు, ఇతర మృతులకు సంతాపం తెలిపారు. ఇరాన్‌పై యుద్ధం చేయడం ద్వారా శత్రువు (అమెరికా, ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి) పశ్చిమాసియా భౌగోళిక స్వరూపాన్ని మార్చివేసినప్పటికీ, ఈ సంఘర్షణ ముస్లింల మధ్య ఐక్యతను, సంఘీభావాన్ని బలపరిచిందన్నారు. అలాగే మానవ హక్కుల గురించి శత్రువులు చేసే వాదనలు అబద్ధమని బయటపెట్టిందని పేర్కొన్నారు. అమెరికా, ఐరోపా దేశాల మద్దతుతో తమ ప్రాంతంలో జరిగిన నేరాలకు జయోనిస్టులే బాధ్యులని ఆరోపించారు.

మూడో రోజు అంత్యక్రియలు ప్రారంభం
ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్ర మూడో రోజు ప్రారంభమైంది. సోమవారం దేశ రాజధాని టెహ్రాన్‌లో అంతిమయాత్ర జరుగుతోంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల్లో మరణించిన ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యుల శవపేటికలను టెహ్రాన్ వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. కాగా, మంగళవారం పవిత్ర నగరమైన ఖోమ్‌లో ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపు జరగనుంది. అనంతరం ఖమేనీ భౌతికకాయాన్ని ఇరాక్‌లోని నజఫ్, కర్బలా నగరాలకు విమానంలో తీసుకెళ్తారు. గురువారం ఇరాన్‌లోని మషద్ నగరంలో అలీ ఖమేనీ భౌతికకాయాన్ని ఖననం చేయనున్నారు.

రెండో రోజుకు చేరిన ఖమేనీ అంతిమయాత్ర- ప్రార్థనలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరు- ట్రంప్‌ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కొత్త టోల్‌ విధానం- మిత్రదేశాలకు ప్రత్యేక రాయితీలు!