ETV Bharat / bharat

సోనియా ఆత్మకథకు మేము ప్రచురణకర్తలం కాదు : పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రకటన

సోనియా గాంధీ ఆత్మకథ ప్రచురణ విషయంలో ట్విస్ట్- ఈ పుస్తకాన్ని తాము ప్రచురించట్లేదని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా వెల్లడి

Sonia Gandhi Memoir Book Publisher
సోనియా గాంధీ (ANI, X@PawanKhera)
author img

By ETV Bharat Telugu Team

Published : August 28, 2026 at 5:00 PM IST

3 Min Read
Choose ETV Bharat

Sonia Gandhi Memoir Book Publisher : కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌' విషయంలో కీలక పరిణామం జరిగింది. ఈ పుస్తకానికి భారత్‌లో తాము ప్రచురణకర్తలం కాదని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా తెలిపింది. సోనియా తన జీవిత ప్రయాణంపై రాసిన ఆత్మకథను నవంబరు 10న హార్డ్‌కవర్, ఈ-బుక్‌ రూపంలో విడుదల చేయనున్నామని పెంగ్విన్ రాండమ్ హౌస్ అనుబంధ ప్రచురణ సంస్థ నాఫ్ ప్రకటించిన కొన్ని వారాల తర్వాత ఈ ప్రకటన వెలువడింది.

సోనియా గాంధీ ఆత్మకథ ప్రచురణ విషయంలో పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ఇండియా వెనక్కి తగ్గిందని ఇటీవల కాలంలో జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఎడిటోరియల్‌ మార్పులకు సోనియా గాంధీ అంగీకరించకపోవడంతోనే ప్రచురణ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ఇండియా తాజాగా స్పష్టం చేసింది. అయితే సోనియా గాంధీతో జరిగిన చర్చల వివరాలను మాత్రం వెల్లడించేందుకు నిరాకరించింది. రచయిత్రితో జరిగిన చర్చలు గోప్యమైనవని, వాటిపై వ్యాఖ్యలు చేయబోమని పేర్కొంది.

'అవన్నీ అవాస్తవాలే'
"సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌' పుస్తకానికి ఇండియాలో మేము ప్రచురణకర్తలం కాదు. రచయిత్రి ఎడిటోరియల్ మార్పులను తిరస్కరించినందున ఆమె ఆత్మకథను ప్రచురించకూడదని మేము నిర్ణయించుకున్నామని వచ్చిన వార్తలు అవాస్తవం. 'బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌' పుస్తకాన్ని ప్రచురించేందుకు మేము ఆసక్తిగా ఉన్నాం. ప్రచురణ ప్రక్రియలో భాగంగా రచయితలు ఇచ్చే సమాచారాన్ని వాస్తవ నిర్ధారణ చేసుకోవడం, పుస్తకానికి ఉపయోగపడే సిఫార్సులు చేయడం మా విధి, బాధ్యత. " అని పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ఇండియా శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.

అమెజాన్‌లో ఈ-బుక్ వెర్షన్
భారతదేశంలో సోనియా గాంధీ ఆత్మకథ పుస్తక పంపిణీదారుడి పరిస్థితిపై క్లారిటీ లేదు. అయితే అమెజాన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లోని ఒక పేజీలో 'బిలాంగింగ్' ఈ-బుక్ వెర్షన్ రూ. 2,615కు ప్రీ ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నట్లు చూపించింది. ఈ కామర్స్ వెబ్‌సైట్ ప్రకారం 'బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌' ఈ-బుక్‌ను యూకేకు చెందిన విలియం కాలిన్స్ ప్రచురించింది.

జీవితంలోని కీలక ఘట్టాలను బుక్‌లో వెల్లడించిన సోనియా
తన జీవితంలో జరిగిన కీలక ఘట్టాలు, విషయాలను ఆత్మకథలో రాసుకొచ్చానని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ తెలిపారు. అలాగే రాజీవ్‌ గాంధీతో ప్రేమ, పెళ్లి వంటి విషయాలను ప్రస్తావించానని చెప్పారు. రాజకీయాల్లోకి రావడం, అందుకు దారితీసిన పరిస్థితులను పంచుకున్నట్లు వెల్లడించారు. తన కుటుంబం గురించే ఈ బుక్‌లో ఎక్కువగా ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. తన జీవితాన్ని మార్చేసిన మధురమైన ఆనందాలు, చీకటి-నిరాశల గుండా సాగిన ప్రయాణానికి ఈ పుస్తకం ఓ నిదర్శనమని స్పష్టం చేశారు. ఆరు దశాబ్దాలుగా దేశంలో తాను కళ్లారా చూసిన సామాజిక, రాజకీయ మార్పులపై పాఠకులకు ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని ఈ పుస్తకం అందిస్తుందని వివరించారు.

ఇందిరా గాంధీతో సోనియా పరిచయం, హిందీ నేర్చుకోవడానికి, చీరలు ధరించడానికి, భారతీయ వంటకాలను ఆస్వాదించడానికి సోనియా చేసిన ప్రయత్నాలు, అలాగే గాంధీ కుటుంబాన్ని కుదిపేసిన విషాదాలు కూడా 'బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌' బుక్‌లో ఉన్నాయి. విమాన ప్రమాదంలో రాజీవ్‌ గాంధీ తమ్ముడు సంజయ్‌ గాంధీ మరణం, ఆ తర్వాత 1984లో ప్రధాని ఇందిరా గాంధీ దారుణ హత్య వంటి ఘోరాలను ఇందులో సోనియా ప్రస్తావించారు. తల్లి మరణానంతరం ప్రధాని అయిన రాజీవ్‌ గాంధీ, సరిగ్గా ఏడేళ్ల తర్వాత ఎన్నికల ప్రచారంలో దారుణంగా హత్యకు గురైన విషాద ఘటనలను కూడా ఈ బుక్‌లో సోనియా గుర్తుచేశారు. 2004లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ ప్రధాని పదవిని తిరస్కరించడం వెనుక ఉన్న అసలు కారణాలను సోనియా గాంధీ ప్రస్తావించారు.

బాధ్యత నుంచి తప్పించుకునే ఫ్రీ కోచింగ్ ఎత్తుగడ: కాంగ్రెస్ విమర్శలు

నేపాల్ వరదలపై 'డ్రామా' వ్యాఖ్యలు- వివాదంపై శశిథరూర్ వివరణ ఇదే!