పాక్ ఐఎస్ఐ కుట్ర- పిల్లలను ఎరవేసి గూఢచర్యం- పఠాన్‌కోట్‌లో 15ఏళ్ల బాలుడు అరెస్ట్
సోషల్ మీడియా ద్వారా పిల్లలకు వల వేస్తున్న పాకిస్థాన్ - తండ్రి చావుకు పగ తీర్చుకునే క్రమంలో ఐఎస్‌ఐ ఉచ్చులో పడ్డ బాలుడు - ఫోన్ క్లోనింగ్‌తో కీలక సమాచారం లీక్

Published : January 6, 2026 at 2:43 PM IST
Minor Spy Arrested in Pathankot: పాకిస్థాన్ తన నీచ బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. భారత్‌ను దెబ్బతీసేందుకు ఇప్పుడు ఏకంగా పసి పిల్లలను పావులుగా వాడుకుంటోంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఒక 15ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను గత ఏడాది కాలంగా పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఏజెంట్లతో టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు. భారత సైనిక రహస్యాలను, దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని వారికి చేరవేస్తున్నట్లు గుర్తించారు. దిల్లీ ఉగ్రదాడి నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు, గూఢచర్య నెట్‌వర్క్‌పై నిఘా పెట్టగా ఈ బాల నేరస్తుడి విషయం వెలుగులోకి వచ్చింది. జమ్మూలోని సాంబా జిల్లాకు చెందిన ఈ బాలుడి వ్యవహారం ఇప్పుడు భద్రతా దళాలను ఉలిక్కిపడేలా చేసింది.
అసలేం జరిగింది?
పఠాన్‌కోట్ ఎస్ఎస్పీ దల్జిందర్ సింగ్ ధిల్లాన్ తెలిపిన వివరాల ప్రకారం, బాలుడు జమ్మూలోని సాంబా జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. ఆ బాలుడు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలతో, ఐఎస్‌ఐ అధికారులతో కాంటాక్ట్‌లో ఉన్నాడని తెలిసింది. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. బాలుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో నుంచి కీలక డిజిటల్ ఆధారాలు సేకరించారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతను దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలపడం భారత నిఘా సంస్థలను కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ బాలుడు ఉగ్ర మాడ్యూల్‌కు అనుబంధంగా ఉన్న పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్లతోనూ నిరంతరం మాట్లాడినట్టు తేలింది. ఐఎస్ఐకి ఇలాంటి యువత అవసరమని, సులభంగా మోసపోయే వారినే వారు లక్ష్యంగా చేసుకుంటారని పోలీసులు స్పష్టం చేశారు.
“ఐఎస్ఐకి అనుబంధంగా ఉన్న ఒక ఉగ్రసంస్థతో బాలుడు టచ్‌లో ఉన్నట్లు మాకు సమాచారం అందింది. అతడు దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్నాడు. ఈ బాలుడు పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్ఐ అధికారులు, ఉగ్ర మాడ్యూల్‌కు సంబంధించిన వ్యక్తులతో నేరుగా సంప్రదింపులు కొనసాగిస్తున్నాడు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని అతడిని అరెస్ట్ చేశాం”
-పఠాన్‌కోట్ ఎస్ఎస్పీ దల్జిందర్ సింగ్
ముగ్గులోకి దించిందిలా
పిల్లల్లో ఉన్న అమాయకత్వాన్ని పాక్ ఏజెంట్లు ఆసరాగా చేసుకుంటున్నారు. అందులో భాగంగానే సోషల్ మీడియా ద్వారా ఈ బాలుడికి వల వేశారు. ముందుగా స్నేహంగా మాట్లాడారు. ఆ తర్వాత మెల్లగా బ్రెయిన్ వాష్ చేశారు. ఆయుధాల శిక్షణ ఇస్తామని, ఆయుధాలు సప్లై చేస్తామని ఆశ చూపారు. ఈ విషయాల తీవ్రత తెలియక ఆ బాలుడు వారి ఉచ్చులో చిక్కుకున్నాడు.
నాన్న చనిపోయాడని
ఈ బాలుడి వెనుక ఒక విషాద కథ కూడా ఉంది. అదే అతన్ని నేరస్తుడిని చేసింది. ఏడాదిన్నర కిందట ఈ బాలుడి తండ్రి చనిపోయారు. అయితే తన తండ్రిని ఎవరో హత్య చేశారని ఆ బాలుడు బలంగా నమ్మాడు. కానీ పోలీసుల విచారణలో అది హత్య కాదని తేలింది. అయినా ఆ బాలుడు నమ్మలేదు. తండ్రి చావుకు కారణమైన వారిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సహాయం కోసం వెతికాడు. ఇదే అదనుగా భావించిన పాక్ ఏజెంట్లు, గ్యాంగ్‌స్టర్లు అతనికి సాయం చేస్తామని నమ్మించి తమ దారిలోకి తెచ్చుకున్నారు.
ఫోన్ క్లోనింగ్, లైవ్ టెలికాస్ట్
ఈ బాలుడికి మొబైల్ టెక్నాలజీపై మంచి పట్టు ఉంది. ఇతని ఫోన్ నుంచి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. పాక్ ఏజెంట్లు ఇతని ఫోన్‌ను 'క్లోనింగ్' చేశారు. అంటే ఇతని ఫోన్ ఇక్కడ ఉన్నా, దాని కంట్రోల్ మొత్తం పాకిస్థాన్‌లో ఉంటుంది. బాలుడు మన దేశంలోని కీలక సైనిక స్థావరాలు, ముఖ్య ప్రదేశాల వీడియోలు తీసేవాడు. పాక్ ఏజెంట్లు ఇతని ఫోన్ హ్యాక్ చేసి, అక్కడి నుంచే 'లైవ్' ద్వారా ఆ ప్రదేశాలను చూసేవారు.
మరికొందరిపై అనుమానం
పోలీసుల విచారణలో మరో ప్రమాదకర విషయం బయటపడింది. కేవలం ఇతను మాత్రమే కాదు, పంజాబ్ సరిహద్దు జిల్లాల్లో ఇంకా చాలా మంది పిల్లలు ఐఎస్‌ఐ ఉచ్చులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పాకిస్థాన్ ఉద్దేశపూర్వకంగానే భారతీయ యువతను, చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకుంది. నకిలీ సోషల్ మీడియా ఖాతాలతో వారిని ట్రాప్ చేస్తోంది. దేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నుతోంది.
ఈ ఘటనతో పంజాబ్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అన్ని జిల్లాల ఎస్పీలకు సమాచారం ఇచ్చారు. సరిహద్దు ప్రాంతాల్లోని పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిఘా పెట్టారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన బాలుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

