ETV Bharat / bharat

పాక్షికంగా తెరుచుకున్న గగనతలం- UAE నుంచి భారత్‌‌కు చేరుకున్న తొలి విమానం

యూఏఈ నుంచి భారత్‌‌కు చేరుకున్న ఎయిరిండియా ఫ్లైట్- 149 మంది ప్రయాణికులకు ఘనస్వాగతం పలికిన ఎయిరిండియా- మంగళవారం రోజు విదేశం నుంచి వచ్చిన తొలి విమానం ఇదే- ఎయిర్‌పోర్టుల నుంచి పరిమిత విమాన సర్వీసులు

UAE To India Flight Services
Passengers arrived Delhi's IGI Airport ((Photo/@AirIndia_News))
author img

By ETV Bharat Telugu Team

Published : March 3, 2026 at 4:46 PM IST

3 Min Read
Choose ETV Bharat

UAE To India Flight Services : ఎట్టకేలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గగనతలం పాక్షికంగా తెరుచుకుంది. దీంతో అక్కడి నుంచి భారత్‌కు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో కూడిన ఎయిర్ ఇండియా విమానం దుబాయ్‌ నుంచి న్యూదిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.

పశ్చిమాసియాలో సైనిక ఘర్షణ జరుగుతున్న వేళ గత 24 గంటల్లో భారత్‌లోకి ప్రవేశించిన తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు ఇదే. ఇక యూఏఈలో ఇరుక్కుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు ఫుజైరా నుంచి దిల్లీ, ముంబయి, కొచ్చిలకు నాలుగు ప్రత్యేక విమానాలను నడుపుతామని స్పైస్ జెట్ ప్రకటించింది. యూఏఈ నుంచి భారత్‌కు పాక్షికంగా విమాన సర్వీసులు ప్రారంభమైన విషయాన్ని తెలుపుతూ భారత విదేశాంగ శాఖకు చెందిన ప్రవాస భారతీయుల తరలింపు విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది.

దుబాయ్ ఎయిర్‌పోర్టుల నుంచి పరిమిత విమాన సర్వీసులు : కేంద్రం
భారత్ - యూఏఈ మధ్య నడిచే రెగ్యులర్ విమాన సర్వీసుల్లో చాలావరకు ఇప్పటికీ సస్పెన్షన్ దశలోనే ఉన్నాయని భారత విదేశాంగ శాఖకు చెందిన ప్రవాస భారతీయుల తరలింపు విభాగం పేర్కొంది. మార్చి 2వ తేదీ సాయంత్రం నుంచి యూఏఈ, భారత్ మధ్య పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయని వెల్లడించింది. యూఏఈలోని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, దుబాయ్ వరల్డ్ సెంట్రల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల నుంచి భారత్‌కు విమాన సర్వీసులు నడుస్తున్నాయని తెలిపింది.

దుబాయ్‌లోని ఈ రెండు ఎయిర్‌పోర్టులను పూర్తిగా మూసివేయలేదని, కానీ వాటిలోకి ప్రవేశించే ప్రయాణికులను కఠినంగా స్క్రీనింగ్ చేస్తున్నారని విదేశాంగ శాఖ చెప్పింది. ఇక భద్రతాపరమైన ముప్పు కారణంగా యూఏఈలోని మిగతా ఎయిర్‌పోర్టులను మూసివేసి ఉంచారని తెలిపింది. ఇక ఇవే వివరాలతో దుబాయ్‌లోని రెండు ఎయిర్‌పోర్టులు కూడా అధికారిక ప్రకటనలు విడుదల చేశాయి.

ఆ విమానానికి ఎయిర్ ఇండియా ఘన స్వాగతం
దుబాయ్ నుంచి 149 మంది ప్రయాణికులతో వచ్చిన తమ విమానాన్ని దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఘన స్వాగతం పలికింది. ఈవివరాలతో ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేసింది. ఫ్లైట్ నంబర్ ఏఐ916డీలో దుబాయ్ నుంచి వచ్చిన అతిథులు, క్రూ సిబ్బందికి స్వాగతం పలికినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. మంగళవారం రోజు విదేశం నుంచి భారత్‌కు చేరుకున్న తొలి విమాన సర్వీసు ఇదేనని చెప్పింది. భారతీయుల ఈ ప్రయాణాన్ని సాధ్యం చేసినందుకు భారత ప్రభుత్వానికి, పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ)కు, దుబాయ్‌లోని స్థానిక అధికార వర్గాలకు ఎయిర్ ఇండియా ధన్యవాదాలు తెలిపింది.

యూఏఈ టు భారత్ నాలుగు ప్రత్యేక విమాన సర్వీసులు : స్పైస్ జెట్
స్పైస్ జెట్ కూడా యూఏఈకి విమాన సర్వీసులను ప్రారంభించనుంది. మార్చి 4 నుంచి కొన్నిరోజుల పాటు యూఏఈలోని ఫుజైరా నుంచి భారత్‌కు నాలుగు ప్రత్యేక విమాన సర్వీసులను నడుపుతామని వెల్లడించింది. ఫుజైరా నుంచి దిల్లీ, ముంబయి, కొచ్చి (కేరళ) మధ్య ఈ విమాన సర్వీసులు నడుస్తాయని తెలిపింది. వీటిలో రెండు విమానాలు ఫుజైరా - ముంబయి రూట్‌లోనే నడుస్తాయని చెప్పింది. ప్రయాణికుల అవసరాలు, పౌర విమానయాన సంస్థ (డీజీసీఏ) అనుమతుల ప్రకారం విమాన సర్వీసుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తామని తెలుపుతూ స్పైస్ జెట్ ఒక ట్వీట్ చేసింది.

నేను ఇంటికి చేరుకున్నా- వాళ్లందరికీ థ్యాంక్స్ : పీవీ సింధు
యూఏఈ గగనతలం మూసివేత కారణంగా కొన్ని రోజులు దుబాయ్‌లో ఇరుక్కుపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు స్వదేశానికి చేరుకున్నారు. తాను సురక్షితంగా బెంగళూరుకు చేరుకున్నాను అంటూ ఆమె ట్వీట్ చేశారు. దుబాయ్‌లో కొన్ని రోజుల పాటు అనిశ్చితిలో, ఆందోళనతో గడపాల్సి వచ్చిందన్నారు. ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నందుకు సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. విమానాశ్రయాల గ్రౌండ్ టీమ్స్, దుబాయ్ అధికార వర్గాలు, ఎయిర్‌పోర్టు సిబ్బంది, ఇమిగ్రేషన్ విభాగాలు, కష్టకాలంలో తన బాగోగులను చూసిన వ్యక్తులందరికీ పీవీ సింధు థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతానికి రెస్ట్ తీసుకోవడం, తదుపరి పోటీలకు సిద్ధం కావడం, భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకోవడంపై ఫోకస్ చేస్తానన్నారు. వాస్తవానికి దుబాయ్ మీదుగా ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌కు పీవీ సింధు బయలుదేరారు. బర్మింగ్‌హామ్‌‌లో జరిగే ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొనాలని ఆమె భావించారు. కానీ దుబాయ్‌లో అకస్మాత్తుగా ఇరుక్కుపోవడంతో ఆ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయారు.