ETV Bharat / bharat

'ఆపరేషన్ సిందూర్​' దెబ్బకు పాక్ విలవిల- అందుకే​ హడావిడి రాజ్యాంగ సవరణలు : CDS చౌహాన్​

ఆపరేషన్ సిందూర్​ దెబ్బకు పాక్ పూర్తిగా విఫలమైంది- అందుకే హడావుడి రాజ్యాంగ సవరణలు-​ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు

Chief of Defence Staff Gen Anil Chauhan
Chief of Defence Staff Gen Anil Chauhan (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : January 10, 2026 at 8:54 AM IST

3 Min Read
Choose ETV Bharat

CDS Chauhan Slams Pakistan : పాకిస్థాన్​ ఇటీవల హడావుడిగా చేపట్టిన రాజ్యాంగ సవరణలు చేపట్టడంపై భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్​ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్'ను అడ్డుకోలేక ఆ దేశం ఎదుర్కొన్న వైఫల్యాలకు ఇది నిదర్శనమని ఎద్దేవా చేశారు. పొరుగు దేశానికి పరిస్థితులు అనుకూలించలేదని చెప్పడానికి ఈ పరిణామాలే నిరూపణ అని ఆయన అన్నారు.

శుక్రవారం పుణెలో జరిగిన 'పబ్లిక్ పాలసీ ఫెస్టివల్‌'లో జనరల్ చౌహాన్ ప్రసంగిస్తూ, భారత్‌లో ప్రతిపాదిత 'జాయింట్ థియేటర్ కమాండ్ల' పురోగతిని వివరించారు. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2026 మే 30 వరకు గడువు ఇచ్చిందని అన్నారు. అయితే గడువు కంటే ముందే ఈ వ్యవస్థను అమల్లోకి తీసుకురావడానికి సాయుధ దళాలు కృషి చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఈ బాధ్యత తమ ప్రాధాన్యతలలో ఒకటిగా పేర్కొన్న ఆయన, ప్రస్తుతం ఇది తుది దశలో ఉందని చెప్పారు.

పాకిస్థాన్ రక్షణ వ్యవస్థలో కీలక మార్పులు!
ఆపరేషన్ సింధూర్ ప్రస్తుతం తాత్కాలికంగా ఆగిందని అభివర్ణించిన సీడీఎస్, పాకిస్తాన్ సైనిక నిర్మాణంలో వచ్చిన మార్పులపై కీలక విశ్లేషణ చేశారు. "పాకిస్థాన్​లో హడావుడిగా చేసిన రాజ్యాంగ సవరణలు కొన్ని వాస్తవాలను తెలియజేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్‌ సమయంలో పాక్​కు ఏమీ అనుకూలించలేదు. తమ వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయని వారు గుర్తించారు" అని జనరల్ చౌహాన్ అన్నారు.

పాకిస్థాన్​ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కు చేసిన సవరణల వల్ల ఆ దేశ రక్షణ సంస్థలో వచ్చిన ప్రధాన మార్పులను ఆయన ఎత్తి చూపారు. పాక్​లోని మూడు దళాల మధ్య సమన్వయం కోసం గతంలో ఉన్న 'ఛైర్మన్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ' పదవిని రద్దు చేసి, దాని స్థానంలో 'చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్' (సీడీఎఫ్​) పదవిని సృష్టించారు. అయితే, ఈ పదవిని కేవలం ఆర్మీ చీఫ్ మాత్రమే సృష్టించగలరని పేర్కొనడం ద్వారా సంయుక్త సైనిక తత్వం అనే ప్రాథమిక సూత్రానికే పాక్ తూట్లు పొడిచిందని ఆయన విమర్శించారు.

నేషనల్ స్ట్రాటజీ కమాండ్, ఆర్మీ రాకెట్ ఫోర్సెస్ కమాండ్ ఏర్పాటు ద్వారా పాకిస్థాన్​ తన సాయుధ బలగాలను కేంద్రీకరిస్తోంది. దీనివల్ల ఆర్మీ, నౌకాదళం, వాయుసేనలతో కూడిన ఉమ్మడి కార్యకలాపాలు, అణ్వాయుధ వ్యవహారాలన్నీ ఆర్మీ చీఫ్ నియంత్రణలోకి వెళ్తాయి. ఇది పాక్​ 'ల్యాండ్-సెంట్రిక్' ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన విశ్లేషించారు.

సర్వసన్నద్ధంగా భారత్​
గతంలో జరిగిన ఉరి సర్జికల్ స్ట్రైక్స్, ఢోక్లామ్, గల్వాన్ ఘర్షణలు, బాలకోట్ ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్​ల నుంచి భారత సైన్యం అనేక పాఠాలు నేర్చుకుందని జనరల్ చౌహాన్ తెలిపారు. ఇప్పటివరకు ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కమాండ్ ఏర్పాట్లు చేస్తూ వచ్చిన భారత సాయుధ దళాలు, ఇకపై ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి వీలుగా ఒక 'ప్రామాణిక వ్యవస్థ'ను రూపొందిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఆపరేషన్​ సిందూర్​
2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలోకి పాక్​ ఉగ్రవాదులు చొరబడి, హిందూ పురుషులే లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. దీనికి ప్రతీకారంగానే కేంద్ర ప్రభుత్వం "ఆపరేషన్ సిందూర్" చేపట్టింది. 2025 మే 7న అర్ధరాత్రి సమయంలో పాక్​, పీవోకేల్లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడిలో పీవోకే, పాకిస్థాన్ పంజాబ్​ ప్రావిన్స్​లోని 9 ఉగ్రస్థావరాలు నేలమట్టం అయ్యాయి. సుమారు 100-150 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీనిపై పాక్​ నేరుగా భారత్​పై దాడులకు దిగింది. దానికి చైనా ఆయుధ, సాంకేతిక సాయం అందించింది. అయినప్పటికీ భారత్​ తన సొంత బలంతో పోరాడి, పాక్​ను మట్టికరిపించింది. దీనితో కాళ్లబేరానికి వచ్చిన పాక్​ కాల్పుల విరమణకు ప్రతిపాదించింది. శాంతికాముక దేశమైన భారత్​ అందుకు అంగీకరించింది.

జనవరి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు: కిరణ్​ రిజిజు

ట్రేడ్ డీల్​పై అమెరికా వాణిజ్య మంత్రి చెప్పినవన్నీ అబద్ధాలే- ట్రంప్​తో మోదీ 8 సార్లు మాట్లాడారు : భారత్