దిల్లీలో పెట్రోల్ బాంబు దాడులకు ఐఎస్ఐ కుట్ర- రైల్వే స్టేషన్, బస్‌స్టాప్, పోలీస్ లైన్సే టార్గెట్
పాక్‌కు చెందిన ఐఎస్ఐ హ్యాండ్లర్ ఆదేశాలతో దిల్లీలో పెట్రోల్ బాంబు దాడులకు కుట్ర- న్యూ పోలీస్ లైన్స్, ఆనంద్ విహార్ ఐఎస్బీటీ, రైల్వే స్టేషన్లే లక్ష్యం

Published : July 8, 2026 at 5:05 PM IST
ISI Plot To Attack Delhi : దిల్లీ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. పాకిస్థాన్ ఐఎస్ఐ హ్యాండ్లర్ షెహజాద్ భట్టీ పర్యవేక్షణలో దిల్లీపై పెట్రోల్ బాంబు దాడులకు కుట్ర పన్నినట్లు వారు గుర్తించారు. బుధవారం దిల్లీ, పంజాబ్‌ల్లో ఆరుగురు అనుమానిత వ్యక్తులను దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్టు చేసింది. వారిని తమదైన రీతిలో విచారణ చేయగా, ఈ కుట్ర గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
"పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ హ్యాండ్లర్ షెహజాద్ భట్టీ ఆదేశాల మేరకు దేశ రాజధాని దిల్లీలోని పలు కీలక ప్రాంతాల్లో పెట్రోల్ బాంబు దాడులు చేయడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ముఖ్యంగా దిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న న్యూ పోలీస్ లైన్స్, ఆనంద్ విహార్ ఇంటర్-స్టేట్ బస్ టెర్మినల్, రైల్వే స్టేషన్ సహా విపరీతమైన రద్దీ ఉండే మార్కెట్ ప్రాంతాల్లో వారు రెక్కీ నిర్వహించి, దాడులు చేయడానికి ప్లాన్ చేశారు" అని పోలీసులు తెలిపారు.
నిషేధిత యాప్స్ ద్వారా చాటింగ్
దర్యాప్తు సమయంలో నిందితుల మొబైల్ ఫోన్ల నుంచి ఈ ప్రాంతాలకు సంబంధించిన వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తాము రికార్డు చేసిన రెక్కీ వీడియోలను ఒక నిషేధిత మెసేజింగ్ అప్లికేషన్ ద్వారా ఐఎస్ఐ హ్యాండ్లర్ భట్టీకి పంపినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. భట్టీకి, నిందితులకు మధ్య జరిగిన సోషల్ మీడియా చాట్లను కూడా రీస్టోర్ చేశారు.
ఆ చాట్‌లో ఏముంది?
జూన్ చివరి వారంలో భట్టీ, నిందితుడు డానిష్ (అలియాస్ చంద్ మియాన్) మధ్య జరిగిన సంభాషణలు దర్యాప్తులో బయటపడ్డాయి. ఆ చాట్‌లో 'మెటీరియల్' సాయంత్రంలోపు అందుతుందని, దానిని సేకరించాలని భట్టీ, డానిష్‌కు తెలిపాడు. ఆ తర్వాత మెటీరియల్ అందిందా అని భట్టీ అడగగా, అంతా సేకరించామని డానిష్ సమాధానం చెప్పాడు. ఆ వస్తువులను సురక్షితంగా సిద్ధంగా ఉంచుకొని, తదుపరి ఆదేశాల కోసం వేచి ఉండాలని భట్టీ ఆదేశించాడు. కాగా ఈ చాట్‌లో ప్రస్తావించిన 'మెటీరియల్' దిల్లీలో పెట్రోల్ బాంబు దాడులకు చేయడానికి ఉద్దేశించిందేనని దర్యాప్తులో తేలింది. అంతకు ముందు పోలీసులు రాజ్‌ఘాట్ వెనుక ఉన్న విజయ్ ఘాట్ నుంచి పెట్రోల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు.
పాక్ నెట్‌వర్క్‌తో సంబంధాలు
ఇంతకు ముందు అరెస్టు చేసిన ఆరుగురు నిందితులకు, షెహజాద్ భట్టీ కోసం పనిచేస్తున్న మరో 10 మంది పాకిస్థాన్ వ్యక్తులతో కూడా పరిచయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఉగ్రకుట్రలో వారి పాత్ర, ప్రమేయంపై దర్యాప్తు అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఎవరికి ఏ పని అప్పగించారంటే,
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, డానిష్ (అలియాస్ చంద్ మియాన్)కు దిల్లీలో రెక్కీ నిర్వహించడం, దాడికి ప్రణాళిక వేసే బాధ్యతను భట్టీ అప్పగించాడు. ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేస్తే డానిష్‌కు రూ.20వేలు ఇస్తానని మాటిచ్చాడు. సల్మాన్ అనే మరో నిందితుడికి ఒక ప్రత్యేకమైన పని అప్పగించారు. ఇతను డానిష్‌కు సహకరిస్తూ, ఉగ్ర దాడులకు సంబంధించిన వీడియో తీసి, ఆ ఫుటేజ్‌ని నేరుగా షెహజాద్ భట్టీకి పంపాలని చెప్పారు. దిల్లీలోని షాహీన్ బాగ్‌కు చెందిన తయ్యబ్, ఐఎస్ఐ పంపిన ఆయుధాలు అందుకోవడం, వాటిని అమ్మే పనులను చూసుకుంటున్నాడు. ఘజియాబాద్‌లోని మోదీనగర్‌కు చెందిన జుబేర్ ఖాన్ అమృత్సర్ నుంచి ఆయుధాల కన్సైన్మెంట్ను తీసుకువచ్చాడు. మేరఠ్‌కు చెందిన అలీ ఫజల్ ఆయుధాలను విక్రయించే బాధ్యత చూసుకున్నాడు. అమృత్‌సర్‌కు చెందిన మల్కిత్ సింగ్ ఈ నెట్‌వర్క్‌లో కీలక వ్యక్తి. ఇతను పాకిస్థాన్ నుంచి డ్రోన్ల ద్వారా పడేసిన ఆయుధాలను సేకరించి, వాటిని తమ ఉగ్ర నెట్‌వర్క్‌లోని మిగిలిన సభ్యులకు పంపిణీ చేసే బాధ్యత తీసుకున్నాడు. అయితే ఐఎస్ఐ హ్యాండ్లర్ షెహజాద్ భట్టీతో సంబంధం ఉన్న రెండు మోడ్యాళ్లును ఛేదించిన తర్వాత, దిల్లీ పోలీసులు ఈ ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. సరిహద్దు అవతల ఉన్న పెద్ద నెట్వర్క్, ఇతర పాకిస్థానీ హ్యాండర్ల పాత్రపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
'ఎంత దూరమైనా పారిపోవచ్చు- కానీ తప్పించుకోలేరు'- ఎన్కౌంటర్లో లష్కరే ఉగ్రవాది హతం
''VB G RAM G' అంటే ఉపాధి హక్కులను దొంగలించడమే'- కొత్త చట్టంపై కాంగ్రెస్ విమర్శలు

