ETV Bharat / bharat

పాక్ హ్యాండ్లర్లకు భారత్​ సిమ్ కార్డులు- బార్డర్​లో సోలార్ కెమెరాల ఏర్పాటుకు ప్లాన్​- నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

భారత సరిహద్దుల్లో సోలార్ కెమెరాలు ఏర్పాటుకు ఉగ్రవాదుల ప్లాన్​- అప్రమత్తమైన భద్రతా దళాలు

Pak-Linked Border Espionage Busted
పాకిస్థాన్​కు భారతదేశ సిమ్​కార్డులు చేరవేరుస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : August 29, 2026 at 10:02 PM IST

3 Min Read
Choose ETV Bharat

Indian SIMs to Pakistan : భారత​ కార్డులను పాకిస్థాన్​కు చేరవేసి, ఆ నంబర్లతో వాట్సాప్​ యాక్టివేట్ చేయడానికి, సరిహద్దుల్లో సోలార్ కెమెరాలు అమర్చడానికి ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు నివేదికలు వచ్చిన నేపథ్యంలో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ వ్యవహారానికి సంబంధించి రాజస్థాన్​ పోలీసులు, సీఐడీ సంయుక్తంగా ఆపరేషన్​ నిర్వహించి, అనూప్​గఢ్​కు చెందిన బల్వీందర్​ సింగ్​ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి. భారత పౌరుల సిమ్​ కార్డును సేకరించి, వాటిని పాక్​ ఉగ్రవాదులకు పంపించి, ఆ నంబర్ల సాయంతో పాకిస్థాన్​ నుంచే వాట్సాప్​ ఉపయోగించేలా సాయం చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి.

పోలీస్ అధికారి కర్తార్ సింగ్ మాట్లాడుతూ, నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. పాక్ హ్యాండ్లర్లతో అతనికి ఉన్న సంబంధాలు, సిమ్​ కార్డులను పాకిస్థాన్​కు పంపడానికి ఉపయోగిస్తున్న పద్ధతుల గురించి ఆరా తీస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఉగ్ర నెట్​వర్క్​లో పాలుపంచుకుంటున్న ఇతర వ్యక్తుల గురించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని చెప్పారు. ​తమ విచారణలో నిందితుడు ఇప్పటి వరకు సుమారు 8 ఇండియన్​ సిమ్​ కార్డులను, పాకిస్థాన్​కు పంపినట్లు తేలిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ సిమ్ కార్డులు ఏ మార్గాల ద్వారా పాకిస్థాన్​కు చేరాయనే కోణంలో భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.

పాక్ హ్యాండ్లర్లతో పరిచయాలు
"సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులు, భద్రతా సంస్థలు గత కొంత కాలంగా నిఘా పెట్టాయి. ఈ క్రమంలోనే బల్వీందర్​ సింగ్​కు పాకిస్థానీ హ్యాండ్లర్లతో పరిచయాలు ఉన్నట్లు సమాచారం అందింది. దర్యాప్తు ముమ్మరం చేయడంతో భారత సిమ్ కార్డులను పాకిస్థాన్​కు పంపడం, ఆ నంబర్లతో అక్కడ వాట్సాప్​ నడపడం మొదలైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఈ సిమ్ కార్డులను ఎవరి పేరుతో తీసుకున్నాడు. వీటిని పాకిస్థాన్​కు పంపడంలో ఎవరెవరు సహకరించారు. ఈ నంబర్లను ఎందుకోసం వాడుతున్నారు అనే విషయాలపై ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి" అని పోలీసులు తెలిపారు.

సోలార్ కెమెరాల ఏర్పాటుకు ప్రయత్నం!
ఈ దర్యాప్తులో సిమ్ కార్డుల వ్యవహారంతోపాటు మరికొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. పోలీసుల సమాచారం ప్రకారం, పాకిస్థానీ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు సరిహద్దు ప్రాంతాల్లో సోలార్ కెమెరాలు అమర్చడానికి ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు ఈ సోలార్​ కెమెరాలు ఎక్కడ అమర్చాలనుకున్నారు? వాటి ఉద్దేశం ఏమిటి? దీని వెనుక పెద్ద ఉగ్రనెట్​వర్క్ ఏదైనా ఉందా? అనే కోణంలో భద్రతా సంస్థలు దర్యాప్తును వేగవంతం చేశాయి. కాగా నిందితుడు బల్వీందర్​ సింగ్​పై ఇదివరకే జైత్​సర్ పోలీసు స్టేషన్​లో ఎన్​డీపీఎస్​ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదై ఉండడం గమనార్హం. కాగా ప్రస్తుతం ఈ సిమ్ కార్డు వ్యవహారానికి సంబంధించి అనుప్​గఢ్ పోలీసు స్టేషన్​లో మరో కొత్త కేసు నమోదు చేశారు.

భారీ ఉగ్రకుట్ర భగ్నం
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ఐదుగురు ముష్కరులను గుజరాత్ ఏటీఎస్ అధికారులు గత నెల అరెస్టు చేశారు. పటన్ జిల్లా సిద్ధ్‌పూర్ తాలూకా ఖడియాల్ గ్రామంలో వీరందరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిని బిలాల్ అబిద్‌భాయ్ షేరా, మహ్మద్ అయూబ్ కడివాలా, మహ్మద్ పాలన్‌పురి, షఫియా రాయిస్ ముక్తి, మహ్మద్ హసన్ కర్దియాగా గుర్తించారు. గుజరాత్‌లో ఉగ్ర నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు యత్నిస్తూ జులై 3న ఏటీఎస్ చేతికి 8 మంది ఉగ్రవాదులు చిక్కారు. నిందితులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా)లోని సెక్షన్లు 13, 17, 18, 38, 39, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 148, 61 కింద కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు.

బర్డ్‌ఫ్లూ వ్యాప్తిపై WHO అలర్ట్- భారత్ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచన

ఖర్గే సభా వేదికను శుద్ధి చేయడం నేరమే- వెంటనే FIR నమోదు చేయాలి: రాహుల్‌ డిమాండ్