ETV Bharat / bharat

కబడ్డీకి కేరాఫ్ అడ్రస్‌గా 'పాయ్' విలేజ్- జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోన్న ప్లేయర్స్- స్పోర్ట్స్ కోటాలో 250 మందికి జాబ్స్

కబడ్డీ క్రీడకు ప్రధాన కేంద్రంగా మారిన గ్రామం- ప్రతి మూడునాలుగు ఇళ్ల నుంచి ఒక జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్- గ్రామానికి వన్నె తెస్తున్న క్రీడాకారులు

Village Of Kabaddi Players
కబడ్డీకి కేరాఫ్ అడ్రస్‌గా 'పాయ్' విలేజ్ (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : August 28, 2026 at 11:56 AM IST

3 Min Read
Choose ETV Bharat

Village Of Kabaddi Players : దేశవ్యాప్తంగా జరుగుతున్న క్రీడా విప్లవానికి హరియాణాలోని 'పాయ్' గ్రామం ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. 5,000-6,000 కుటుంబాలు నివసిస్తున్న ఈ ఊరు కబడ్డీ క్రీడకు ఒక ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందింది. పాయ్ గ్రామంలో కబడ్డీ కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు. ఇదొక స్థానిక సంస్కృతి, సంప్రదాయాలలో అంతర్భాగం. అలాగే యువత ఆశయాలకు పునాది. ఊర్లోని ప్రతి మూడు- నాలుగు కుటుంబాలలో కనీసం ఒకరైనా జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కబడ్డీ క్రీడాకారుడిగా ఎదిగారు. అలాగే కబడ్డీలో రాణించి స్పోర్ట్స్ కోటా కింద పాయ్ గ్రామానికి చెందిన 250 మందికి పైగా క్రీడాకారులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.

ట్రైనింగ్ తీసుకుంటున్న 1000 మంది
40వేలు జనాభా ఉన్న పాయ్ గ్రామంలో కబడ్డీ ప్రస్థానం 1980లో మొదలైంది. అప్పట్లో కోచ్‌లు రాజ్‌వీర్, పాలా రామ్ గ్రామ యువతను కబడ్డీ క్రీడాకారులుగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకున్నారు. సంప్రదాయ మట్టి మైదానాల్లో (అఖాడాల్లో) శిక్షణ అందించారు. వారి అంకితభావం ఫలితంగానే పాయ్ యువత నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్రామంలో నాలుగు ప్రధాన కబడ్డీ శిక్షణా కేంద్రాలు (అకాడమీలు) ఉన్నాయి. అందులో రెండు పురుషులు, రెండు బాలికలకు సంబంధించినవి. ఈ అకాడమీలు ఉదయం రెండు గంటలు, సాయంత్రం మూడు గంటల పాటు కఠినమైన శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఈ అకాడమీల్లో 800-1,000 మంది క్రీడాకారులు, క్రీడాకారిణిలు తమ నైపుణ్యాలను, శారీరక దృఢత్వాన్ని మెరుగుపరుచుకుంటున్నారు.

Village Of Kabaddi Players
కబడ్డీకి కేరాఫ్ అడ్రస్‌గా 'పాయ్' విలేజ్ (ETV Bharat)

స్థానిక క్రీడాకారులు కబడ్డీలో సాధించిన విజయాలు పాయ్ గ్రామానికి గొప్ప పేరు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ క్రీడలో విశేష సేవలకు అందించినందుకుగానూ పాయ్‌కు చెందిన భీమ్ సింగ్‌కు హరియాణా అత్యున్నత క్రీడా పురస్కారమైన 'భీమ్ అవార్డు' లభించింది. అంతేకాకుండా ఈ ఊరికి చెందిన 15-20 మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించారు. వందలాది మంది జాతీయ స్థాయి పోటీలలో పతకాలు సాధించారు. ప్రో కబడ్డీ లీగ్ (PKL) ప్రారంభ సీజన్ నుంచి పాయ్ గ్రామం తన బలమైన ఉనికిని చాటుకుంటూ వస్తోంది. తొలి సీజన్‌లో గ్రామం నుంచి కేవలం ఇద్దరు క్రీడాకారులు మాత్రమే ఎంపిక కాగా, ఇప్పుడు ప్రతి సీజన్‌లోనూ 5-10 మంది ప్లేయర్స్ పీకేకేఎల్‌లో చోటు దక్కించుకుంటున్నారు. సందీప్ ధూల్, సంజయ్, ప్రదీప్ వంటి పాయ్ గ్రామానికి చెందిన క్రీడాకారులు ప్రో కబడ్డీలో మంచి ప్లేయర్లుగా పేరు సంపాదించుకున్నారు.

Village Of Kabaddi Players
'పాయ్' గ్రామంలోని పిల్లలు (ETV Bharat)

అబ్బాయిలు, అమ్మాయిలకు సమాన అవకాశాలు
పాయ్ గ్రామంలోని ఒక ప్రత్యేకత ఏమిటంటే క్రీడల విషయంలో అబ్బాయిలు, అమ్మాయిలకు సమాన అవకాశాలు, ప్రోత్సాహం లభిస్తాయి. ఈ గ్రామానికి చెందిన సుమారు 50 మంది అమ్మాయిలు జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో చాలా మంది స్వర్ణ పతకాలు సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ ఊరి క్రీడాకారిణి పూజా నర్వాల్ రాణించారు. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలో మూడో స్థానం సాధించిన రీతూ, స్పోర్ట్ కోటా కింద రైల్వేలో టీటీ ఉద్యోగం పొందారు. అదే విధంగా కిరణ్ ఎస్ఎస్‌బీకి ఎంపికయ్యారు. మరోవైపు, అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పతకం అందించాలనే కసితో ముస్కాన్ ప్రతిరోజూ ఐదు గంటల పాటు కబడ్డీ శిక్షణ పొందుతున్నాడు.

Village Of Kabaddi Players
'పాయ్' గ్రామంలోని పిల్లలు (ETV Bharat)

కబడ్డీ క్రీడ కేవలం పతకాలు గెలవడానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇది పాయ్ గ్రామం సామాజిక, ఆర్థిక పరిస్థితులను పూర్తిగా మార్చివేసింది. ఈ ఊరికి చెందిన సుమారు 250-300 మంది క్రీడాకారులు స్పోర్ట్స్ కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. సరైన మార్గదర్శకత్వం, క్రమశిక్షణ, అంకితభావం ఉంటే ప్రపంచ స్థాయి క్రీడా వేదికలపై రాణించవచ్చని ఈ గ్రామం నిరూపిస్తోంది. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దృఢ సంకల్పం ఉంటే విజయం కచ్చితంగా వరిస్తుందని పాయ్ గ్రామ యువత రుజువు చేసింది.

Village Of Kabaddi Players
కబడ్డీ ఆడుతున్న 'పాయ్' గ్రామంలోని పిల్లలు (ETV Bharat)

రాఖీలను భద్రంగా దాచుకున్న అమరవీరుడు- 20ఏళ్ల తర్వాత వెలుగులోకి- కన్నీళ్లు పెట్టుకున్న కుటుంబం

ప్రతిభకు వైకల్యం అడ్డు కాదు- పండగ వేళ ఈ పిల్లలు చేసిన రాఖీలు వెరీ స్పెషల్- ధర చాలా తక్కువే!