ETV Bharat / bharat

వృక్షమాత సాలుమరద తిమ్మక్క కన్నుమూత- వృక్ష సంరక్షణకు ఆమె జీవితం అంకితం

114 ఏళ్ల వయసులో తుది శ్వాస వీడిచిన తిమ్మక్క

Salumara Timmakka Passed Away
'Saalumarada' Thimmakka (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : November 14, 2025 at 8:21 PM IST

3 Min Read
Choose ETV Bharat

Salumara Timmakka Passed Away : కర్ణాటకకు చెందిన వృక్షమాత, పద్మశ్రీ పురస్కార గ్రహీత సాలుమరద తిమ్మక్క (114) కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యలతో గత కొన్ని రోజులుగా బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తిమ్మక్క శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల సీఎం సిద్ధరామయ్యతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు, పర్యావరణ ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.

1911 జూన్ 30న కర్ణాటక తుముకూరు జిల్లా చక్కెనహళ్లి గ్రామంలో జన్మించారు తిమ్మక్క. పేదరికం కుల వివక్ష కారణంగా చదువుకు దూరమయ్యారు. తన కుటుం సభ్యులతో కలిసి పొలం పనులకు వెళ్లేవారు. 1928లో తిమ్మక్కకు వివాహమైంది. పెళ్లి తర్వాత 25 ఏళ్ల వరకు సంతానం కలుగలేదు. దీంతో ఆమె తీవ్ర నిరాశకు గురయ్యారు. అత్తగారి కుటుంబ సభ్యులు తన భర్తకు రెండో పెళ్లి చేయాలని చూశారు. దీంతో ఆత్మహత్యకు యత్నించింది. తన భర్త ఎలాగో ఆమెను కాపాడాడు. అప్పుడే తిమ్మక్కకు తన భర్త మొక్కలు తీసుకొచ్చి ఇచ్చారు. ఇవే మన బిడ్డలు జాగ్రత్తగా పెంచుకుందామని చెప్పారు. అలా ఆ బాధను అధిగమించి తన జీవితాన్ని పర్యావరణ సేవకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. తన భర్తతో కలిసి మొక్కలు నాటడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు. కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మొక్కలు నాటి, వాటిని కంటికి రెప్పలా కాపాడుతూ సస్యశ్యామలం చేశారు. 1948లో తొలి ఏడాది 10, తర్వాత 15, ఆపై సంవత్సరం 20 మొక్కలు నాటారు. అలా ఏటా ఆ సంఖ్యను పెంచుకుంటూ పోయారు. ఆ నాలుగు కిలోమీటర్ల మేరా 384 మర్రి కొమ్మల అంటు కట్టి నాటారు. పదేళ్ల పాటు అచ్చంగా ఈ కృషిని కొనసాగించారు.

పదేళ్ల తర్వాత తిమ్మక్క భర్త చిక్కయ్యతో కలసి అమూల్య జాతులకు చెందిన 8వేల మొక్కలు నాటారు. వీరిద్దరి దినచర్యలో సగం రోజు పొలం పని. మిగిలిన సమయం అంతా మొక్కలు నాటడానికే అంకితం చేసేవారు. 1958 లో తిమ్మక్క కృషికి తొలి గుర్తింపు లభించింది. హుళికోట చెన్నప్ప, చక్ర బసవప్ప అనే ఇద్దరు ఆసాములు తిమ్మక్క దంపతులను ప్రశసించారు. వెండి పతకంతో సత్కరించారు. అదే తిమ్మక్క-చిక్కయ్య దంపతుల పర్యవరణ కృషికి తొలి సత్కారం. అలా వరుస కానుకలు వస్తూనే ఉన్నాయి. తిమ్మక్కకు 82 ఏళ్ల వయసులో తన భర్త మరణించారు. ఆయన సమాధి వద్ద ఒక పనస మొక్కను నాటారు. ఆమెకు వచ్చే వితంతు పింఛన్​తో బతికేది. ఆ తర్వాత ఉమేశ్​ అనే అబ్బాయిని దత్తత తీసుకుంది. తన కుమారుడితో కలిసి బెంగళూరులో జీవించేది.

తిమ్మక్క జీవితంపై నాటకం, పుస్తకం, డాక్యుమెంటరీ
తిమ్మక్కపై 1999లో దేశ పర్యావరణ హితకారులు 'తిమ్మక్క మథు 284 మక్కలు' అనే డాక్యుమెంటరీని తీశారు. దానిని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. సాలుమరద తిమ్మక్క జీవిత చరిత్ర ఆధారంగా ప్రవరఆర్ట్ స్టుడియోస్ 'సాలుమరగల తాయి తిమ్మక్క' అనే నాటకాన్ని రూపొందించి ప్రదర్శించింది. దర్శకుడు హను రామసంజీవ రూపకల్పన చేశారు. ఇక 2015 లో రచయిత్రి బేలూరి ఇందిరమ్మ 'సాలుమరద శారదారిణి' శీర్షికతో కన్నడ భాషలో తిమ్మక్క జీవిత చరిత్ర పుస్తకం రాశారు. 2023 జనవరి 26న గణతంత్ర వేడుకల కవాతు సందర్భంగా తిమ్మక్క ఆకుపచ్చ కృషి దేశమంతా చాటుతూ కర్ణాటక ప్రగతి శకటంలో సాలుమరద తిమ్మక్క ప్రతిరూపాన్ని ప్రదర్శించి గౌరవించారు. నారీ విజేతలు ముగ్గురిలో ఒకరుగా ఆమె ప్రతిమను వుంచటం విశేషం. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తొలిసారిగా సీఎం అయినప్పుడు, 2014-16 మధ్య 'సాలుమరద తిమ్మక్క షేడ్ ప్లాన్' కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. 2018 లో తుముకూరు జిల్లాలో కర్ణాటక ప్రభుత్వం సాలుమరద తిమ్మక్క ఉద్యానవనాన్ని ప్రారంభించింది. ఇక్కడ 40 రకాల అమూల్య వృక్షజాతులున్నాయి.

పద్మశ్రీ అవార్డుతో సత్కరం
జీవితమంతా పర్యావరణ పరిరక్షణలో మమేకమైన సాలుమరద తిమ్మక్క కృషిని గుర్తిస్తూ అనేక పురస్కారాలు వరించాయి. తిమ్మక్క ఇప్పుడు దేశమంతా పర్యటిస్తూ పర్యావరణ చైతన్యం తెస్తున్నారు. బెంగూరు, దిల్లీ, హైదరాబాద్, ఇంకా అనేక నగరాల్లో, పట్టణాల్లో పర్యటించి వన మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొక్కలు నాటారు. పార్లమెంటు ఆవరణలో, హైదరాబాద్​లో మొక్కలు నాటారు. జస్టిస్ పి.ఎన్ భగవతి కమిటీ 1996లో తిమ్మక్కను జాతీయ పౌరురాలిగా గుర్తిస్తూ పురస్కారం ప్రకటించింది. 1996 డిసెంబర్ 23న ప్రధాని దేవెగౌడ చేతుల మీదుగా నేషనల్ సిటిజన్ పురస్కారాన్ని స్వీకరించారు. తిమ్మక్క దశాబ్దాల నిష్కళంక, నిస్వార్థ హరిత కృషిని గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఆమెకు 2019 లో పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. 2020 సంవత్సరంలో కర్ణాటక కేంద్రీయ విశ్వవిద్యాలయం తిమ్మక్కకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఇందిరా ప్రియదర్శిని, నాడోజా, వృక్ష మాత తదితర అవార్డులను గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు.