కళ్లద్దాలు కొనడానికి వెళ్లి రూ.3 కోట్ల లాటరీ గెలుచుకున్న స్టవ్ రిపేర్ షాప్ ఓనర్
పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన మహేంద్రసింగ్‌ను వరించిన అదృష్టం- జీవనోపాధి కోసం స్టవ్ రిపేర్ షాప్ నడుపుతున్న మహేంద్రసింగ్

Published : February 27, 2026 at 6:16 PM IST
Mahendra Singh Wins Rs. 3 Crore Jackpot: అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. లక్ కలిసొస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారు. పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన నిహాల్ సింగ్ గ్రామస్థుడు మహేంద్ర సింగ్‌కు అదృష్టం కలసివచ్చింది. మహేంద్రసింగ్ గురుగ్రామ్ ఆలయంలో పూజలు చేసి తిరిగి వస్తుండగా, పత్రాన్ మార్కెట్‌లో కళ్లద్దాలు కొనడానికి వెళ్లాడు. ఆయనకు అక్కడ ఓ లాటరీ షాప్ కనిపించడంతో లాటరీ టికెట్కొన్నాడు. ఆ లాటరీ టికెట్‌తో అతను 3 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. నాగాలాండ్ రాష్ట్ర డియర్ మహా శివరాత్రి బంపర్ 2026లో మహేంద్రసింగ్ కొనుగోలు చేసిన లాటరీకి మొదటి బహుమతి దక్కింది.
గ్రామస్థులతో సంతోషాన్ని పంచుకున్న కుటుంబ సభ్యులు: ఆయన జీవనోపాధి కోసం స్టవ్ రిపేర్ షాప్ నడుపుతున్నారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మహేంద్ర సింగ్ ఇంత పెద్ద మొత్తంలో లాటరీ గెలుచుకోవడం కలలా అనిపించిందని ఆయన చెప్పారు. "ముందుగా ఇలాంటి బహుమతి వస్తుందని నేను అసలు ఊహించలేదు. గాజులు కొనడానికి వచ్చాను, కానీ అదృష్టం నా తలుపు తట్టింది " అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. లాటరీలో గెలుచుకున్న డబ్బును శుభకార్యాలకు, సామాజిక సేవలకు ఖర్చు చేస్తానని ఆయన అన్నారు. మహేంద్రసింగ్ కుటుంబ సభ్యులు గ్రామస్థులతో ఈ సంతోషాన్ని పంచుకున్నారు. 3 కోట్ల రూపాయల భారీ లాటరీ గెలుచుకున్నందుకు లూథియానాలోని ఓ ప్రముఖ లాటరీ పంపిణీదారుడు మహేంద్ర సింగ్‌ను సత్కరించారు. మహేంద్రసింగ్‌కు భారీ లాటరీ దక్కడం తమకు ఆనందమైన విషయమని ఆయన అన్నారు. ప్రభుత్వ లాటరీ కావడంతో ప్రతి ఒక్కరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆయన కోరారు. మహా శివరాత్రి బంపర్ డ్రా ఫిబ్రవరి 21న జరిగింది. మహేంద్రసింగ్ లాటరీలో పెద్ద మొత్తంలో నగదు గెలుచుకోవడంతో పంజాబ్‌లోని లాటరీ ప్రియులలో కొత్త ఆశలు చిగురించాయి. మహేంద్రసింగ్ మంచి పనులకు డబ్బు వినియోగిస్తానని చెప్పడం అతనిలోని మంచి తనానికి నిదర్శనం.
విజేతకు మిగిలేది ఎంతంటే: లాటరీ టికెట్ విజేతకు ప్రైజ్ మనీ మొత్తం రాదు. బహుమతిగా పొందిన రూ. 3 కోట్లలో 10 శాతం ఏజెంట్ కమిషన్ కింద పోతుంది. అంటే రూ. 30 లక్షల అన్నమాట. ఇంకా మిగిలిన మొత్తం రూ.2 కోట్ల 70 లక్షలు దీనిపై 30 శాతం టీడీఎస్, మరో 1.2 శాతం సెస్, సర్‌ఛార్జ్‌లు పడతాయి. అంతేగానీ గెలిచిన మొత్తం విజేత జేబులోకి వెళ్లదు. ఉదాహరణకి రూ.కోటి గెలిచిన విజేతకు 10 శాతం ఏజెంట్ కమిషన్ పడుతుంది. అంటే రూ.90 లక్షలు మిగులుతాయి. దానిపై టీడీఎస్, సెస్, సర్‌ఛార్జ్‌లు 31.2 శాతం కట్ అవుతాయి. దీంతో విజేత జేబులోకి దాదాపుగా రూ.62 లక్షలు వెళ్తాయి. లాటరీ ఏజెంట్లు విన్నింగ్ టికెట్‌ను అమ్మడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తారు.
మీరు ఏదైనా లాటరీ గెలిస్తే ఇలా చేయాలి: మీరు ఏదైనా లాటరీ గెలిస్తే, బహుమతిగా పొందిన డబ్బును స్వీకరించడానికి 30 రోజుల్లోపు అనుసరించాల్సిన చట్టపరమైన విధానాలను తెలుసుకుందాం. మొదట అధికారిక గెజిట్‌లో లాటరీ టికెట్ నంబర్‌ను తనిఖీ చేసుకోవాలి. ఆ తర్వాత గెలిచిన టికెట్ వెనుక మీ పేరు, అడ్రస్, సంతకం చేసి దాన్ని జాగ్రత్త పరచాలి. విజేత ఈ పత్రాలను సమర్పించాలి. ఒరిజినల్ లాటరీ టికెట్ ( సంతకాలు చేసిన లాటరీ టికెట్ జిరాక్సులు), పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు (గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించినవి), పాన్ కార్డ్, ఆధార్, ఓటర్ ఐడీ లేదా రేషన్ కార్డు జిరాక్సులు, క్లెయిమ్ అప్లికేషన్ (ఫారం-V), రూపాయి రెవెన్యూ స్టాంప్‌తో రసీదు ఇవన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి.
ప్రతి నెలా బాలేశ్వర్ టు పూరీ యాత్ర- సైకిల్‌పై 260కి.మీల ప్రయాణం- జగన్నాథుడికి తులసిని తీసుకుని!
తమిళనాడులో ప్రజాస్వామ్యానికి గొప్ప చరిత్ర- ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు!: సీఈసీ జ్ఞానేశ్ కుమార్

